2-2-2.. ఇది పాటిస్తే భార్యాభర్తల సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు
ఏది ఏమైనా వైవాహిక జీవితం ఒక్కటి బాగుంటే చాలనుకునే భార్యాభర్తలున్నారు. ఇలాంటి వారికోసం 2-2-2 రూల్ బాగా ఉపయోగపడుతుంది. ఈ రూల్ ని పాటిస్తే వీరి సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇంతకీ ఇదేంటంటే?

ఈ రోజుల్లో దాంపత్య జీవితం ఎలా సాగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్క సెలబ్రిటీలు మాత్రమే కాదు సాధారణ జనాలు కూడా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలొచ్చినా, మనస్పర్థలొచ్చినా విడాకులు తీసుకుంటున్నారు. వేర్వేరుగా ఉంటున్నారు. కానీ దీనివల్ల పుట్టిన పిల్లల జీవితం ఎటూ కాకుండా పోతుంది. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో దాంపత్య జీవితాన్ని ఆనందంగా గడపడం రోజురోజుకూ కష్టంగా మారుతోంది. భాగస్వామిపై పెట్టుకున్నఅంచనాల వల్లే వైవాహిక జీవితాన్ని ముందుకు నడిపించడం, వారిని సాటిస్ఫై చేయడం కష్టంగా మారింది.
కానీ పెళ్లి తర్వాత మీ భాగస్వామికి ఇచ్చే కొద్దిపాటి సమయం కూడా మీ వైవాహిక జీవితాన్ని ఆనందంగా మారుస్తుంది. మీ బంధాన్ని బలంగా చేస్తుంది. ఉదాహరణకు మీరు మీ భాగస్వామికి తగిన సమయాన్ని ఇవ్వనందుకు మాత్రమే కోపంగా ఉన్నా, గొడవలు, కొట్లాటలు అవుతున్నా 2-2-2 నియమాన్ని పాటించండి. కొత్తగా పెళ్లైన జంటైనా, పెళ్లై ఏండ్లు గడుస్తున్న జంటైనా ఈ నియమం పాటిస్తే మీ జీవితంలో ఒంటరితనం పారిపోతుంది. అందమైన, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు.
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఏం చేయాలి?
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎన్నో విషయాలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇలాంటి వాటిలో 2-2-2 నియమం ఒకటి. ఈ నియమాన్ని గనుక మీరు పాటిస్తే మీ వైవాహిక జీవితం సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతి 2 వారాలకు డిన్నర్ కు వెళ్లండి
ఎంత బిజీ లైఫ్ ను గడుపుతున్నా మీరు మీ భాగస్వామి కోసం కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. అలాగే ప్రతి రెండు వారాలకోసారి డిన్నర్ కు లేదా లంచ్ డేట్ కు వెళ్లండి. సినిమా డేట్ కూడా వెళ్లొచ్చు. ఇది చాలా బెస్ట్ ఆప్షన్ కూడా. భార్యాభర్తలిద్దరూ కాసేపు కలిసి కూర్చుంటే మనసులో ఉన్న చెడు ఆలోచనలు, అపార్థాలన్నీ తొలగిపోతాయి.
రెండు నెలలకోసారి వీకెండ్
ప్రతి రెండు నెలలకోసారి మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లండి. అక్కడ ఎలాంటి ఆలోచనలు కానీ, టెన్షన్ కానీ లేకుండా ఒక రెండు మూడు రోజులు ఆనందంగా గడపండి. దీనివల్ల భార్యాభర్తలిద్దరూ తగినంత సమయాన్ని గడుపుతారు. అలాగే ఇద్దరి మధ్యనున్న అపార్థాలు తొలగిపోయి ఆనందంగా ముందుకు సాగుతారు.
2 సంవత్సరాలకు ఒక పూర్తి వారాన్ని ప్లాన్ చేయండి
మీ దాంపత్య జీవితం ఆనందంగా సాగాలంటే ప్రతి రెండు సంవత్సరాలకోసారి ఒక వారం పాటు కలిపి గడపండి. అంటే కుటుంబ విషయాలు, వ్యాపార విషయాలు, కెరీర్, పిల్లలు వంటి చీకు చింతలను వదిలేసి మీ ఇద్దరి కోసం సమయాన్ని కేటాయించండి. అలాగే ఒకరి ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోండి. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది. అలాగే ఒకరిపై ఒకరికి ప్రేమ కూడా పెరుగుతుంది.