పెళ్లి తర్వాత అమ్మానాన్నలకు ఈ విషయాలను అస్సలు చెప్పొద్దు..
మనం చేసే కొన్ని పొరపాట్లు కానీ, అలవాట్లు కానీ రిలేషన్ షిప్ లో గొడవలకు కారణమవుతాయి. అంతేకాదు ఇవి మళ్లీ మళ్లీ రిపీట్ అయితే మీ బంధం బలహీనపడటం స్టార్ట్ అవుతుంది. అందుకే పెళ్లి తర్వాత ఎవ్వరికీ చెప్పకూడని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ప్రతి విషయాన్ని పేరెంట్స్ తో షేర్ చేసుకునే అలవాటు ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత ఈ అలవాటును మానుకోవడమే మంచిది. చాలా మంది పెళ్లి తర్వాత వారి మధ్య జరిగే ప్రతీది పేరెంట్స్ తో పాటుగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇంటి చుట్టుపక్కల వారికి చెప్పుకుంటుంటారు.ఈ అలవాటు ఎక్కువగా ఆడవారికే ఉంటుంది. కానీ ఇది మీ భర్తతో మీ బంధాన్ని దెబ్బతీస్తుంది. చాలా మంది తాము చేసే చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టరు. కానీ ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడపాలనుకుంటే మాత్రం కొన్ని విషయాలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకండి.
పెళ్లి తర్వాత వచ్చే సమస్యల గురించి ఆడవాళ్లు వాళ్ల అమ్మలతో చెప్పుకుంటూ ఉంటారు. ఇది మంచి విషయమే. ఎందుకంటే తల్లులు వారికున్న అనుభవం, జ్ఞానంతో సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో చెప్తారు. కానీ భార్యాభర్తల మధ్య మరిన్ని గొడవలు పెట్టే విషయాలను మాత్రం తల్లికే కాదు ఎవ్వరితోనూ చెప్పకూడదు. అవేంటంటే..
గొడవ గురించి..
ప్రతి భార్యాభర్తల మధ్య గొడవలొచ్చే విషయాలు చాలానే ఉంటాయి. చిన్న చిన్న గొడవలను మీరిద్దరూ కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. కానీ కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కు అన్ని విషయాలు చెప్పి గొడవలను పరిష్కరించమని చెప్తుంటారు. కానీ చిన్న చిన్న గొడవలకు కూడా కుటుంబ సభ్యులను ఇందులో భాగస్వామ్యం చేయకూడదు. సమస్య పెద్దదైతేనే దాన్ని కుటుంబ సభ్యలకు చెప్పాలి. చిన్న వాటిని కూడా తల్లితోనో, తమ్ముడితోనో, చెల్లెలితోనో చెప్పడం వల్ల మీ భర్తకు మీపై కోపం పెరుగుతుంది. అంతేకాదు ఈ అలవాటు మీ భర్తపై అసూయ, ద్వేషం ఏర్పడి క్రమంగా గౌరవం కూడా తగ్గడం మొదలవుతుంది. ఇది ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది.
మీ భాగస్వామి వ్యక్తిగత విషయాలను..
పెళ్లైన తర్వాత మీ భర్త అతని వ్యక్తిగత విషయాలను మీతో పంచుకున్నట్టైతే దాని గురించి అందరికీ చెప్పి తప్పు చేయకండి. ఎందుకంటే దీని వల్ల కలిగే విభేదాలు చాలా ఉంటాయి. మీపై నమ్మకం కూడా పోతుంది. ఇది మంచిది కాదు. మీరు మీ అమ్మతో ఎంత సన్నిహితంగా ఉన్నా.. పెళ్లి తర్వాత మీ భర్త పట్ల మీ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.
భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని విషయాలు..
ఫ్యామిలీని ఎప్పుడు ప్లాన్ చేసుకుంటారు? ఎప్పుడు ఇంటికి వస్తారు? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను మీ దగ్గరే ఉంచుకోండి. ఈ చర్చలన్నీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు కూడా కారణం కావొచ్చు. ఎందుకంటే కొత్త తరం, పాత తరం ఆలోచనల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇది కొన్నిసార్లు జంటలపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడిని సహించనప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి.