పిల్లలకు జ్వరం రావొద్దంటే ఏం చేయాలో తెలుసా?
చలికాలంలో పిల్లలకు తరచుగా దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. దీనికి కారణం వారి ఇమ్యూనిటీ పవర్ తగ్గడమే. అందుకే వారి ఇమ్యూనిటీ పవర్ ఎలా పెంచాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మీరు గమనించారో లేదో కానీ చలికాలంలోనే పిల్లలు జబ్బు బారిన ఎక్కువగా పడుతుంటారు. ముఖ్యంగా ఈ సీజన్ లో పిల్లలకు జ్వరం, దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీనికి అసలు కారణం ఈ సీజన్ లో వారి ఇమ్యూనిటీ పవర్ తగ్గడమే. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడే పిల్లలు తరచుగా జబ్బు బారిన పడుతుంటారు.
పిల్లల్ని హెల్తీగా ఉంచడానికి, సీజనల్ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుంచి రక్షించడానికి తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా పిల్లలు అనారోగ్యానికి గురవుతూనే ఉంటారు. అయితే పిల్లలకు చలికాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా, హెల్తీగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పండ్లు:
పండ్లు పిల్లల ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తింటే చలికాలంలో పిల్లల ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. ఇందుకోసం ఈ సీజన్ లో పిల్లలకు నారింజ, ద్రాక్ష వంటి పండ్లను ఇవ్వండి. ఎందుకంటే ఈ పండ్లలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లు చలికాలంలో వచ్చే ఎన్నో వ్యాధులను రాకుండా కాపాడుతుంది. మీ పిల్లలు నేరుగా పండ్లను తినడానికి ఇష్టపడకపోతే జ్యూస్ చేసి ఇవ్వండి.
పెరుగు:
మీకు తెలుసా? కాలాలతో సంబంధం లేకుండా పెరుగును తినొచ్చు. చలికాలంలో కూడా పెరుగును తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది వారి ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అలాగే జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పిల్లల ఎముకలు బలంగా ఉండేందుకు అవసరమైన కాల్షియాన్ని కూడా అందిస్తుంది. అయితే రాత్రి, ఉదయం కాకుండా.. పెరుగును మధ్యాహ్నం వేళ ఇవ్వండి.
బెర్రీలు:
బెర్రీల్లో కూడా ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు,బ్లాక్ బెర్రీలు వంటి రకరకాల బెర్రీల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని పిల్లలు తింటే ఇమ్యూనిటీ పవర్ బలంగా అవుతుంది.
ఆకుకూరలు
చలికాలంలో ఆకు కూరలను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా ఈ ఆకు కూరలు పిల్లల రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ పిల్లల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కాబట్టి పిల్లల రోజువారి ఆహారంలో పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ వంటి ఆకుకూరలను చేర్చండి. వీటిలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి తో పాటుగా విటమిన్ కె వంటి ఎన్నో రకాల పోషకాలుంటాయి.
అల్లం
అల్లంలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలంగా చేస్తాయి. పిల్లలకు అల్లంలో కొంచెం బెల్లం కలిపి ఇవ్వండి. ఈ అల్లం చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం రాకుండా పిల్లల్ని కాపాడుతాయి.