- Home
- National
- Women Leave: మహిళలకు 12 రోజులు జీతంతో కూడిన సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Women Leave: మహిళలకు 12 రోజులు జీతంతో కూడిన సెలవులు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Women Leave: మహిళా ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రతీ నెలా ఒక రోజు వేతనంతో కూడిన నెలసరి సెలవు మంజూరు చేయాలని కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

దేశంలోనే తొలిసారిగా
కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు సంవత్సరానికి 12 రోజుల నెలసరి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు రెండింటికీ వర్తిస్తుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గార్మెంట్ ఫ్యాక్టరీలు, ఐటీ కంపెనీలు, బహుళజాతి సంస్థల్లో పనిచేసే మహిళలు ప్రతినెలా ఒక జీతంతో కూడిన నెలసరి సెలవు పొందవచ్చు. ఈ నిర్ణయం మహిళల ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా, ఉద్యోగ ప్రదేశాల్లో సౌకర్యవంతమైన, సహాయక వాతావరణాన్ని సృష్టించడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
మహిళల సంక్షేమం కోసం
ఈ విషయమై కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ.. “మేము మహిళలకు నెలసరి సెలవులు మంజూరు చేశాం. ఇది మా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. మహిళలు తమకు అనుకూలంగా నెలకు ఒకటి లేదా ఏడాదికి 12 రోజులు వరకూ సెలవులు తీసుకోవచ్చు” అని చెప్పుకొచ్చారు. ఈ విధానం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలన్నింటికీ సమానంగా అమలు చేస్తామని, ఇది మహిళల సంక్షేమం కోసం తీసుకొచ్చిన నిర్ణయమని వివరించారు.
ఎలా రూపొందించారు.?
ఈ పాలసీని రూపొందించడానికి క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన సప్నా ఎస్ ఆధ్వర్యంలోని 18 మంది కమిటీ సిఫార్సులు ఇచ్చింది. వారు మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే శారీరక, మానసిక ఇబ్బందులను వివరించి, విశ్రాంతి అవసరమని సూచించారు. ప్రభుత్వం ఈ అంశంపై వివిధ శాఖలతో చర్చలు జరిపి, పరిశ్రమల పరిస్థితులు, ముఖ్యంగా గార్మెంట్ పరిశ్రమలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉండడం వంటి అంశాలను పరిశీలించింది. అమలు చేసే ముందు పలు అవగాహన సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో సుమారు 60 లక్షల మహిళలు పనిచేస్తున్నారు. వారిలో 25-30 లక్షల మంది కార్పొరేట్ రంగంలో ఉన్నారని అంచనా.
ఇతర రాష్ట్రాల్లో కూడా..
భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు అందిస్తున్నాయి:
బీహార్ – 1992 నుంచి ప్రభుత్వ ఉద్యోగినులకు నెలకు 2 రోజులు సెలవులు ఇస్తున్నారు.
కేరళ – ప్రభుత్వ ఐటీఐల్లో చదువుతున్న మహిళా విద్యార్థినులకు నెలకు 2 రోజుల నెలసరి సెలవులు అందిస్తోంది.
ఒడిశా – ప్రభుత్వ ఉద్యోగినులకు నెలకు 1 రోజు జీతంతో కూడిన సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడీ జాబితాలో కర్ణాటక కూడా వచ్చి చేరింది.
కేవలం సెలవు మాత్రమే కాదు
ఈ నిర్ణయం కేవలం సెలవులు ఇవ్వడమే కాదు, మహిళల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఉత్పాదకత వంటి అంశాలను కాపాడేందుకు తీసుకున్న సానుకూల చర్యగా అభివర్ణిస్తున్నారు. ఐటీ రంగం, గార్మెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళలు గత కొన్నేళ్లుగా ఈ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి పెద్ద ఊరటనిస్తోంది.