- Home
- Feature
- Motivational Story: కష్టాలన్నీ మీకే అనుకుంటున్నారా.? ఆలు, గుడ్డు, కాఫీ కథ చదవాల్సిందే.
Motivational Story: కష్టాలన్నీ మీకే అనుకుంటున్నారా.? ఆలు, గుడ్డు, కాఫీ కథ చదవాల్సిందే.
Motivational Story: ప్రతీ ఒక్కరికీ కష్టాలు వస్తాయి. అయితే ఆ కష్టాలను ఎలా తీసుకుంటామన్న దాని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి ఒక గొప్ప సందేశాన్ని అందించే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక కూతురి బాధ
ఒక రోజు ఓ అమ్మాయి తన తండ్రితో మాట్లాడుతూ.. “నాన్నా, నా జీవితం చాలా కష్టంగా ఉంది. ఎప్పుడూ సమస్యలే ఎదురవుతున్నాయి. ఒకటి పరిష్కరించుకున్నా, వెంటనే మరోటి వస్తోంది. ఇక ఎలా జీవించాలో నాకు అర్థం కావడం లేదు...” అని వాపోయింది.
తండ్రి చేసిన ప్రయోగం
ఆమె తండ్రి ఓ చెఫ్. ఏమీ మాట్లాడకుండా ఆమెను కిచెన్‌కి తీసుకెళ్లాడు. మూడు పాత్రల్లో నీటిని నింపి గ్యాస్ స్టవ్‌పై పెట్టాడు. నీరు మరిగిన తర్వాత ఒక పాత్రలో బంగాళదుంపలు, రెండోవాటిలో గుడ్లు, మూడోవాటిలో కాఫీ గింజలను వేశాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాటిని 20 నిమిషాలు మరిగించాడు.
ఫలితాలు చూపించిన తండ్రి
ఆ తర్వాత పాత్రలను తీసి బంగాళదుంపలను ఒక బౌల్‌లో, గుడ్లను మరో బౌల్‌లో వేశాడు. కాఫీని ఒక కప్పులో పోశాడు. “నీకు ఏం కనిపిస్తోంది.?” అని అడిగాడు. ఆమె “బంగాళదుంపలు, గుడ్లు, కాఫీ” అంది. “ఇంకా దగ్గరగా చూడు” అన్న తండ్రి. ఆమె బంగాళదుంపలను తాకి అవి మృదువుగా మారినట్లు గమనించింది. గుడ్డును పగలగొట్టగానే అది గట్టిగా ఉడికినట్లు అర్థం చేసుకుంది. అదే విధంగా కాఫీ గింజలు మధురమైన సువాసనతో కూడిన కాఫీగా మారిందని నవ్వింది.
జీవిత పాఠం
తండ్రి అప్పుడు వివరించాడు.. “ఈ మూడూ వేడి నీటిలో మరుగుతూ ఒకే కష్టాన్ని ఎదుర్కున్నాయి. కానీ ప్రతిదీ వేర్వేరు రీతిలో స్పందించింది.
* బంగాళదుంప మొదట గట్టిగా, బలంగా ఉంది. కానీ నీటిలో మరిగిన తర్వాత బలహీనమైంది.
* గుడ్డు బయట తేలికగా, లోపల ద్రవంగా ఉంది. కానీ నీటిలో ఉడికాక గట్టిపడింది.
* కాఫీ గింజలు నీటిలో మరిగినప్పుడు నీటినే మార్చి కొత్త వాసన, రుచిని సృష్టించాయి.”
నీ నిర్ణయం ఏమిటి?
ఇదంతా చూపించిన తర్వాత తండ్రి.. కూతురిని ప్రశ్నిస్తూ.. “కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా స్పందిస్తావు?
* బంగాళదుంపలా బలహీనమవుతావా?
* గుడ్డులా గట్టిపడతావా? లేక కాఫీలా పరిస్థితినే మార్చేస్తావా?” అని ప్రశ్నించాడు.
నీతి ఏంటంటే: మన చుట్టూ, మనకు జరిగే విషయాల కంటే, మనలో ఏమి జరుగుతుందన్నదే జీవితంలో ముఖ్యమైంది. కష్టాలను మనం ఎలా హ్యాండిల్ చేస్తామన్న దాని ప్రకారం మన జీవితం ఆధారపడి ఉంటుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది.