వన్ నేషన్ వన్ ఎలక్షన్ : ఏ రాష్ట్రాలకు లాభం, ఏ రాష్ట్రాలకు నష్టం : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ పరిస్థితేంటి?
వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా మోదీ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రామ్ నాథ్ కోవింద్ కమిటీ నివేదికకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో అసలు ఏమిటీ ఎన్నికలు? దీని ప్రభావం ఎలా వుంటుంది? ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితేంటి? తెలుసుకుందాం.
One nation one election
One nation one election : భారతదేశంలో ఎన్నికల సంస్కరణలపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది... రాజకీయాల కారణంగా దేశ అభివృద్ది కుంటుబడుతోందనే ఆందోళన వుంది. కేవలం పాలనపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు నిత్యం రాజకీయాలు చేస్తున్నాయని... దీంతో ప్రజా సంక్షేమం, అభివృద్దిలో వెనకబడిపోతున్నామనే వాదన వుంది. ఇందుకు పరిష్కారంగా తెరపైకి వచ్చిందే 'వన్ నేషన్ వన్ ఎలక్షన్ (జమిలి ఎన్నికలు)''.
One nation one election
ఏమిటీ జమిలి ఎన్నికలు?
ఎప్పటినుండో జమిలి ఎన్నికలపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ చర్చ సాగుతోంది. అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? అని కొందరు... సాధ్యమేనని మరికొందరు వాదిస్తూ వస్తున్నారు. ఈ వాదోపదాలకు తెరదించుతూ మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో జమిలి ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. త్వరలోనే మహారాష్ట్ర, డిల్లీ లతో పాటు మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ముగిసాయి. ఇందుకు కొన్ని నెలల ముందే తెలంగాణతో పాటు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్...ఇలా దేశవ్యాప్తంగా నిత్యం ఎన్నికలు జరుగుతూనే వుంటాయి.
లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు తోడు రాష్ట్రాల్లో మున్సిపల్, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతుంటాయి. ఇలా ఎప్పుడూ ఎన్నికల హడావిడి వుండటంతో ప్రభుత్వాలు, పాలకులు అభివృద్ది, ప్రజాసంక్షేమం కంటే రాజకీయాలపై ఎక్కువ దృష్టిపెడుతున్నారు... ఇది దేశానికి మంచిది కాదని మోదీ సర్కార్ భావిస్తోంది. అందుకోసమే ఓ ప్రత్యామ్నాయ ఆలోచనతో ముందుకు వచ్చింది. అదే వన్ నేషన్ వన్ ఎలక్షన్.
దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్. అంటే లోక్ సభతో పాటే అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అన్నమాట. ఇటీవల లోక్ సభతో పాటే ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరిగాయి. ఈ నాలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని అన్నిరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్ సభతో పాటే నిర్వహించాలని అని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసమే జమిలి ఎన్నికల నిర్వహణకు సిద్దమయ్యింది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కొన్నాళ్లపాటు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. 1951-52, 1957, 1962, 1967 లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత కొన్ని రాష్ట్రాల్లో ముందస్తుగానే అసెంబ్లీలు రద్దయ్యాయి... కొన్నిసార్లు లోక్ సభలు రద్దయ్యాయి. దీంతో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోసారి ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయి... లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అసలు సంబంధమే లేకుండా పోయింది.
One nation one election
జమిలి ఎన్నికలపై ఎన్డిఏ ఆసక్తి :
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచన ఇప్పటిది కాదు... ఎప్పటినుండో ఈ డిమాండ్ వుంది. ముఖ్యంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డిఏ కూటమి జమిలి ఎన్నికలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తూ వస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే నినాదం చాలాఏళ్లుగా వినిపిస్తున్నా గత అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటిలాగే వాజ్ పేయి హయాంలో కూడా జమిలి ఎన్నికల నిర్వహణపై చాలా కసరత్తు జరిగింది.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ప్రతిపక్ష పార్టీలతో కూడా పలుమార్లు సంప్రదింపులు జరిపింది వాజ్ పేయి ప్రభుత్వం. ఇలా ప్రయత్నాలు జరుగుతుండగానే ఎన్డిఏ ప్రభుత్వం గద్దెదిగింది. దీంతో జమిలి ఎన్నికల ప్రస్తావన మరుగునపడింది.
అయితే 2014లో మళ్లీ ఎన్డిఏ అధికారంలోకి వచ్చాక వన్ నేషన్ వన్ ఎలక్షన్ మళ్లీ తెరపైకి వచ్చింది. దేశవ్యాప్తంగా బిజెపి హవా గట్టిగా వీస్తుండటంతో జమిలి ఎన్నికలకు ఇదే సరైన సమయంగా మోదీ సర్కార్ భావించింది. ఈ క్రమంలోనే పదేపదే వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి మాట్లాడుతూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇలా గత రెండు పర్యాయాలు కేవలం జమిలి ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించి... మోదీ 3.O లో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటుచేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సుదీర్ఘ కసరత్తు చేసారు.
రామ్ నాథ్ కోవింద్ కమిటీ :
వన్ నేషన్ వన్ ఎలక్షన్... అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మోదీ సర్కార్ మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, నిపుణులకు చోటు కల్పించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరి, ఆర్థిక కమీషన్ మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్ సభ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమీషనర్ సంజయ్ కొఠారీ, న్యాయవాది హరీష్ సాల్వే ఈ కమిటీ సభ్యులుగా వున్నాయి.
ఈ కమిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై సుదీర్థ కసరత్తు జరిపింది. 2023 సెప్టెంబర్ 1న రామ్ నాథ్ కోవింద్ కమిటీని కేంద్రం ఏర్పాటుచేసింది. అప్పటినుండి 190 రోజులపాటు 47 రాజకీయ పార్టీలు, ప్రజలు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంది. అయితే 32 రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలకు మద్దతిచ్చాయి. 21,558 ప్రజల్లో 80 శాతం మంది ఈ ఎన్నికలకు మద్దతిచ్చినట్లు నివేదికలో పేర్కొన్నారు.
ఇలాఏడు నెలల పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలు, ఎదురయ్యే సవాళ్లు, కలిగే లాభాలపై కసరత్తు జరిపింది. గత లోక్ సభ ఎన్నికలకు ముందు మార్చి 14, 2024 న ఈ కమిటీ18,629 పేజీలతో కూడిన నివేదికన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందించారు. తాజాగా ఈ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
సిపార్సులు :
వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనని రామ్ నాథ్ కోవింద్ కమిటీ తేల్చింది. ఇందుకు సంబంధించి కొన్ని సిపార్సులు చేసింది. అందులో ముఖ్యమైనవి.
1. రెండచెల విధానంలో జమిలి ఎన్నికలను నిర్వహించాలి. మొదట లోక్ సభ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి. ఆ తర్వాత 100 రోజుల్లోనే మున్సిపాలిటీ, పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
2. హంగ్ ఏర్పడినా, అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వం అర్దాంతరంగా కూలిపోయినా మిగిలిన కాలానికి ఎన్నికలు నిర్వహించవచ్చు.
3. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వుంటుంది.ఐదు ఆర్టికల్స్ ని సవరించాల్సి వుంటుంది.
4. ఈ మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగానే ఓటర్ల జాబితా రూపొందించాలి.
5. మొదటిసారి జమిలి ఎన్నికల కోసం అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం ఒకేసారి ముగుస్తుంది.
6. ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ కోసం ముందుగానే అన్ని సిద్దం చేసుకోవాలి. అంటే ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే పరికరాలు, సిబ్బంది,భద్రతా పరమైన అంశాలను ముందుగానే సంసిద్దం చేసుకోవాలి.
అసలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యమేనా?
జమిలి ఎన్నికల కాన్సెప్ట్ బాగానే వున్నా ఇది ఆచరణ సాధ్యమా అన్న అనుమానాలు ప్రజల్లో వున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇది అసాధ్యం అంటున్నాయి. దీంతో పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
కేవలం లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడమే సాధ్యం కావడంలేదు... పలు విడతల్లో నిర్వహిస్తున్నారు... అలాంటిది లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యమయ్యే పనేనా.
ఇలా ఒకేసారి ఎన్నికల నిర్వహణ రాజకీయ పార్టీలు, నాయకులపై మరింత భారాన్ని పెంచుతాయి. కాబట్టి వారు అంగీకరించడం లేదు. జమిలి ఎన్నికలు సాధ్యం కాదని ... ఈ ఎన్నికలను తాము వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు. ప్రతిపక్షాలను కాదని ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా?
ఈ ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ అవసరమని రామ్ నాథ్ కోవింద్ కమిటీ స్పష్టం చేసింది. అయితే ఇందుకోసం పార్లమెంట్ లో టూ థర్డ్ మెజారిటీ వుండాలి. ఆ బలం ఎన్డిఏకు వుందా? అంటే లేదు అనేదే సమాధానం.
ఎన్డిఏ కూటమికి లోక్ సభలో 292, రాజ్యసభలో 112 మంది సభ్యుల బలం వుంది. జమిలి ఎన్నికల కోసం రాజ్యాంగ సవరణ చేయాలంటే లోక్ సభలోని 545 సీట్లకు గాను 364 సీట్లు వుండాలి. కానీ ఎన్డిఏకే అటు లోక్ సభ, ఇటు రాజ్యసభలో అంత బలం లేదు.
ఎలాగోలా పార్లమెంట్ లో గట్టెక్కినా న్యాయ పరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం వుంది. జమిలి ఎన్నికల వల్ల ముందుగానే అధికారాన్ని కోల్పోయే ప్రతిపక్ష పార్టీలు కోర్టులను ఆశ్రయిస్తారు. అప్పుడు కోర్టు తీర్పును బట్టి నడుచుకోవాల్సి వుంటుంది.
జమిలి ఎన్నికల వల్ల లాభాలు :
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణ వల్ల చాలా లాభాలున్నాయని రామ్ నాథ్ కోవింద్ కమిటీ, ఎన్డీఏ కూటమి మాత్రమే కాదు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకే సారి ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం గణనీయంగా పెరుగుతుంది... అంటే అత్యధికుల అభిప్రాయం పరిగణలోకి తీసుకోబడి ప్రజలు కోరుకున్నవారే అధికారంలోకి వస్తారు.
ప్రస్తుతం అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలపై చూపిస్తున్న ఆసక్తి లోక్ సభ ఎన్నికలపై ప్రజలు చూపించడంలేదు. దీంతో అసెంబ్లీతో పోలిస్తే లోక్ సభ ఎన్నికల్లో చాలా తక్కువ శాతం ఓటింగ్ నమోదవుతోంది. జమిలి ఎన్నికలతో ఈ సమస్య వుండదు. రెండు ఓట్లు ఒకేసారి వేస్తారు కాబట్టి రెండింటి ఓటింగ్ శాతం ఒకేలా వుంటుంది.
జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశమే అభివృద్ది, ప్రజా సంక్షేమానికి ఎన్నికలు అడ్డు కాకూడదని. ఎన్నికల నియమావళి కారణంగా ప్రభుత్వాలు అభివృద్ది, సంక్షేమ పనులను చేపట్టలేక పోతున్నాయి. ఇలా ఎక్కువసార్లు ఎన్నికలు వుండటంవల్ల ప్రభుత్వ సమయం ఎక్కువగా వృధా అవుతుంది. అలాకాకుండా ఒకేసారి ఎన్నికలుంటే ప్రభుత్వ సమయం ఆదా అవుతుంది... అభివృద్ది, సంక్షేమానికి ఆటంకం వుండదు.
ఎలాగూ లోక్ సభ ఎన్నికల నిర్వహణ కోసం భారీగా ఖర్చు చేయాల్సి వుంటుంది. కాబట్టి అసెంబ్లీ ఎన్నికలను కూడా కలిపి నిర్వహించడం ద్వారా ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయి. రాజకీయ పార్టీల ఖర్చు కూడా భారీగా తగ్గుతుంది.
ఎన్నికల సమయంలో పార్టీలు, నాయకులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వుంటాయి. కాబట్టి ప్రచారంలో ఒక్కోసారి మాటలయుద్దం కాస్త గొడవలు దారితీస్తుంటుంది. పదేపదే ఎన్నికలు జరగడంవల్ల మళ్లీమళ్లీ గొడవలకు ఆస్కారం వుంటుంది. జమిలి ఎన్నికల వల్ల ఈ సమస్య తప్పుతుంది... పార్టీలు, నాయకుల మధ్యే కాదు కార్యకర్తల మధ్య విబేధాలకు ఆస్కారం వుండదు.
జమిలి వల్ల నష్టాలు :
వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని నష్టాలు కూడా వున్నాయి. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి ఇది మంచింది కాదనేది ప్రతిపక్షాల వాదన. ఎన్డిఏ స్వార్థం కోసమే ఈ ఎన్నికల ప్రస్తావన తెరపైకి తెచ్చారనేది మరో వాదన సాగుతోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ, బిజెపి హవా సాగుతోంది. లోక్ సభ ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే నరేంద్ర మోదీ, బిజెపి చరిష్మా కంటే స్థానిక పరిస్థితులే ఫలితాన్ని నిర్ణయిస్తున్నాయి. ఈ పరిస్థితి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు వేరువేరుగా జరగడం వల్లే ఉత్పన్నం అవుతుందని బిజెపి బావిస్తుందట. ఇలా కాకుండా లోక్ సభతో పాటే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల తమకు కలిసివస్తుందనేది బిజెపి ఆలోచనగా ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
జమిలి ఎన్నికలు ప్రాంతీయ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలుంటాయి. జాతీయ పార్టీల ప్రయోజనాలను కాపాడేలా జమిలి ఎన్నికల ప్రక్రియ వుంటుంది. దేశ పరిస్థితుల ప్రభావం కూడా ఎన్నికలపై పడుతుంది కాబట్టి ప్రాంతీయ పార్టీలు నష్టపోయే అవకాశం వుంటుంది.
జమిలి ఎన్నికల వల్ల కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా నష్టపోయే ప్రమాదం వుంది. ఎలాగంటే పదవీ కాలం ముగియకుండానే అధికారాన్ని కోల్పోవచ్చు. మరికొన్ని పార్టీలు మాత్రం పదవీకాలం ముగిసాక కూడా అధికారంలో వుండే అవకాశాలు వున్నాయి. ఇలా లోక్ సభ ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తెలంగాణ, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో అధికార పార్టీలు లాభపడే అవకాశం వుంది. అలాగే లోక్ సభ ఎన్నికల తర్వాత ఎన్నికలు జరిగే రాష్ట్రాలు పదవీకాలం ముగియకుండానే అధికారం కోల్పోయే అవకాశం వుంది. ఇక లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో యదావిధిగానే ఎన్నికలు వుంటాయి.