వైఎస్ జగన్‌ను ఫాలో అవుతోన్న విజయ్.. ఇద్దరిలో కనిపిస్తున్న కామన్ పాయింట్ ఇదే.
దళపతి విజయ్ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కజగం పేరుతో పార్టీని స్థాపించిన విజయ్ గురువారం మదురైలో జరిగిన రెండో వార్షికోత్సవంతో ఒక్కసారిగా దేశం దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.

500 ఎకరాల్లో భారీ సభ
తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ రెండో వార్షికోత్సవ సభను మధురైలో అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ఏకంగా 506 ఎకరాల విస్తీర్ణంలో సభను ఏర్పాటు చేశారు. సుమారు 1.5 లక్షల మంది కోసం సీటింగ్ ఏర్పాటు చేశారు. విజయ్ అభిమానులు పొట్టేత్తారు. దాదాపు 3 లక్షలకు పైగా ప్రజలు ఈ సభకు వచ్చినట్లు సమాచారం.
2026 ఎన్నికలపై స్పష్టమైన సంకేతాలు
వేలాదిగా తరలి వచ్చిన అభిమానుల సమక్షంలో విజయ్ కీలక రాజకీయ సందేశాలు ఇచ్చారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మక మలుపు కానున్నాయని ఆయన అన్నారు. DMKని రాజకీయ ప్రత్యర్థిగా, BJPని భావజాల విరోధిగా అభివర్ణించారు. రాబోయే పోరు ప్రధానంగా TVK, DMK మధ్యనే జరుగుతుందని విజయ్ స్పష్టం చేశారు. DMK ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా అవినీతి, వారసత్వ రాజకీయాలకు కట్టుబడి ఉందని విజయ్ ఆరోపించారు. “పేరులో ధైర్యం ఉంటే సరిపోదు, ప్రజల కోసం ధైర్యంగా పనిచేయాలి” అంటూ సీఎం ఎం.కే. స్టాలిన్‌పై కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
ప్రధాన ఆకర్షణగా ర్యాంప్
ఇక ఈ సమావేశంలో ర్యాంప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రధాన సభకు అనుకొని సుమారు 300 మీటర్ల ర్యాంప్‌ను ఏర్పాటు చేశారు. ప్రసంగం ప్రారంభించేందుకు ముందు విజయ్ ఈ ర్యాంప్ నడుస్తూ అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఇది అభిమానుల్లో జోష్ నింపింది. విజయ్ ర్యాంప్‌పై నడుస్తున్నంతసేపు చప్పట్లు, అరుపులతో సభస్థలం హోరెత్తింది. పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా కూడా విజయ్ ర్యాంప్‌పై నడుస్తూ సందడి చేశారు.
జగన్‌తో పోలిక
అయితే ఈ ర్యాంప్ చూసిన తర్వాత చాలా మంది ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోల్చుతున్నారు. ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జగన్ భారీ ఎత్తున సిద్ధం సభలను నిర్వహించారు. ఆ సమయంలో కూడా ఇలాంటి ర్యాంప్‌లను ఏర్పాటు చేశారు. జగన్ ఈ ర్యాంప్‌పై నడుస్తూ తనదైన మేనరిజంతో మైక్ చప్పుడు చేస్తూ ప్రజలను ఊత్తేజపరిచారు. సిద్ధం సభలకు ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అయితే అది ఓట్లగా మాత్రం మారలేదని ఫలితాలు వచ్చిన తర్వాత స్పష్టమైంది.
ప్రశాంత్ కిషోర్ సాయం
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన మద్ధతును విజయ్‌కి ప్రకటించిన విషయం తెలిసిందే. విజయ్‌తో కలిసి ప్రశాంత్ టీమ్ పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఈ ర్యాంప్ ఏర్పాట్లను గమనిస్తే ఇది స్పష్టమవుతోంది. జగన్‌కు కూడా ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ టీమ్ పనిచేసిన విషయం తెలిసిందే.