ఉపరాష్ట్రపతి చేసే పని ఏంటి.? అతన్ని తొలగించే హక్కు ఎవరికి ఉంటుంది.?
దేశంలో అత్యున్నత పదవుల్లో ఉపరాష్ట్రపతి పదవి ఒకటి. తాజాగా దేశానికి కొత్త ఉపరాష్ట్రపతి నియమితులవుతోన్న తరుణంలో అసలు ఉపరాష్ట్రపతి ఏం చేస్తారు.? ఆ పదవికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కీలక పదవి
భారత ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి తర్వాత అత్యంత కీలకమైన పదవిలో ఒకరు. ఈ పదవికి ప్రత్యేకమైన అధికారాలు, బాధ్యతలు, సౌకర్యాలు ఉంటాయి. రాజ్యాంగంలోని పలు ఆర్టికల్స్ ఉపరాష్ట్రపతి పనితీరుకు మార్గనిర్దేశం చేస్తాయి. ఇప్పుడు ఉపరాష్ట్రపతి చేసే ముఖ్యమైన పనులు, ఆయనకు లభించే వేతనం, తొలగింపు విధానం వంటి అంశాల గురించి తెలుసుకుందాం.
ఉపరాష్ట్రపతి విధులు
ఉపరాష్ట్రపతి ఒకేసారి రెండు విధులు నిర్వర్తిస్తారు:
కార్యనిర్వాహక విధులు – రాష్ట్రపతి రాజీనామా చేయడం, మరణించడం, అభిశంసనకు గురికావడం లేదా అనారోగ్య కారణాల వలన విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడతారు. ఈ సమయంలో ఆయన రాష్ట్రపతికి లభించే అన్ని అధికారాలు, వేతనం, సౌకర్యాలు పొందుతారు.
శాసన విధులు – ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్-అఫీషియో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. సభా కార్యక్రమాలు నిర్వహించడం, చర్చలు క్రమబద్ధంగా సాగేందుకు పర్యవేక్షణ చేయడం ఆయన బాధ్యత. ఈ పనిలో డిప్యూటీ ఛైర్మన్ సహకరిస్తారు.
జీతం, సౌకర్యాలు, పింఛన్
ఉపరాష్ట్రపతికి ప్రత్యేకంగా వేతనం నిర్ణయించలేదు. ఆయన రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతం అందుకుంటారు.
ప్రస్తుతం జీతం నెలకు రూ. 4 లక్షలు (2018లో రూ. 1.25 లక్షలు ఉండేది). రోజువారీ భత్యం, ఉచితంగా నివాసం, వైద్య సదుపాయాలు, ప్రయాణ సౌకర్యాలు లభిస్తాయి. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి విధులు నిర్వర్తించే పరిస్థితిలో, ఆయనకు రాష్ట్రపతి వేతనం, అన్ని సౌకర్యాలు వర్తిస్తాయి. పదవీ విరమణ తర్వాత ఉపరాష్ట్రపతికి పింఛన్ జీతంలో 50%గా లభిస్తుంది.
అధికారాలు, ప్రాధాన్యం
ఉపరాష్ట్రపతి దేశంలోని రెండో అత్యున్నత రాజ్యాంగ పదవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 ఉపరాష్ట్రపతి పదవిని నిర్ధారిస్తే, ఆర్టికల్ 65 రాష్ట్రపతి గైర్హాజరీ లేదా పదవి ఖాళీ అయిన సందర్భాల్లో బాధ్యతలు చేపట్టే అధికారం ఇస్తుంది. రాజ్యసభలో సమాన ఓట్లు పడినప్పుడు, నిర్ణయాత్మక ఓటు వేసే హక్కు ఉపరాష్ట్రపతికే ఉంటుంది. భారత రాజకీయ వ్యవస్థలో సమతుల్యత, స్థిరత్వానికి ఉపరాష్ట్రపతి కీలక పాత్ర పోషిస్తారు.
ఉపరాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ
ఉపరాష్ట్రపతిని తొలగించడం ఒక ప్రత్యేక విధానం ద్వారా మాత్రమే సాధ్యం. రాజ్యసభ పూర్తి మెజారిటీతో తీర్మానం ఆమోదించాలి. ఆ తీర్మానాన్ని లోక్‌సభ సాధారణ మెజారిటీతో ఆమోదించాలి. కనీసం 14 రోజుల ముందుగానే నోటీసు ఇవ్వకపోతే అలాంటి తీర్మానం ముందుకు రాదు. ఆర్టికల్ 71 (1) ప్రకారం, అర్హత ప్రమాణాలు నెరవేర్చకపోవడం లేదా ఎన్నికల అవకతవకల వల్ల సుప్రీంకోర్టు కూడా ఉపరాష్ట్రపతిని తొలగించగలదు.
మరికొన్ని ఆసక్తికర విషయాలు
ఇప్పటివరకు ఏ ఉపరాష్ట్రపతినీ తొలగించిన దాఖలాలు లేవు. ఆర్టికల్ 122 ప్రకారం, రాజ్యసభ లేదా డిప్యూటీ ఛైర్మన్‌పై న్యాయస్థానంలో సవాలు చేయలేరు. ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా గరిష్టంగా 6 నెలలు మాత్రమే కొనసాగగలరు. పోటీ లేకుండా ఎన్నికైన ఉపరాష్ట్రపతులలో సర్వేపల్లి రాధాకృష్ణన్, హిదయతుల్లా, శంకర్ దయాళ్ శర్మ ఉన్నారు.