Flash Flood : ఇదెక్కడి వింతరా బాబు ... నడి ఎండాకాలంలో ఈ వర్షాలు, వరదలేంటి..!
Uttarakhand Flash Flood : భారతదేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు మండుటెండలు కాస్తుంటే మరోవైపు వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ఇలా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎండా వాన పరిస్థితులు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో అయితే ఏకంగా వరదలే సంభవించి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రస్తుత చమోలి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us
)
Uttarakhand Flash Floods
Uttarakhand Rains : దేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు విచిత్రంగా మారుతున్నారు. వేసవిలో ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు కూడా దంచి కొడుతున్నాయి. భగ్గుమంటున్న సూర్యుడికి సడన్ గా మబ్బులు అడ్డువచ్చి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇలా పలురాష్ట్రాల్లో ఒక్కసారిగా భారీ వర్షాలు మొదలై వరదలకు దారితీస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో ఇవాళ(గురువారం) ఇదే జరిగింది.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో భారీ వర్షం మరోసారి విధ్వంసం సృష్టించింది. జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. దీని వల్ల ఆ ప్రాంతంలో చాలా నష్టం వాటిల్లడమే కాకుండా సాధారణ జనజీవనం కూడా స్తంభించింది. ముఖ్యంగా థరాలి మరియు పరిసర ప్రాంతాలలో పరిస్థితి దారుణంగా ఉంది.
ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురవడంతో పాటు కొండచరియలు విరిగిపడటంతో ప్రమాదాలు సంభవించాయి. కార్లు, బైక్‌లు సహా అనేక వాహనాలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చాలా రోడ్లను మూసివేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొండచరియలు విరిగిపడటంతో పెద్దపెద్ద బండరాళ్లు రోడ్లపై ఉన్నాయని... ఇలాంటి సమయంలో ఆ రోడ్లపై ప్రయాణం అసాధ్యమని సహాయక సిబ్బంది చెబుతున్నారు. అందువల్లే ప్రజలకు ఇబ్బందులు ఎదురైనా రోడ్లను మూసివేసినట్లు చెబుతున్నారు.
శిథిలాలను తొలగించడానికి మరియు కనెక్టివిటీని పునరుద్ధరించడానికి BRO (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) చురుకుగా పనిచేస్తోంది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అధికారులు పౌరులను అప్రమత్తం చేస్తున్నారు... ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వర్షాలు కొనసాగే అవకాశం ఉందికాబట్టి కొండ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అవసరం అయితేనే ఇళ్లనుండి బయటకు రావాలని సూచిస్తున్నారు.
Heavy Rains
దేశవ్యాప్తంగా భారీ వర్షాలు :
భారత వాతావరణ శాఖ (IMD) రాబోయే నాలుగు రోజులు దేశంలో వాతావరణం ఎలా ఉంటుందో ప్రకటించింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, యానాం, కేరళ, మాహే ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ రాష్ట్రాల్లో పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
తూర్పు, ఈశాన్య భారతదేశంలో ఏప్రిల్ 11 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అస్సాం, మేఘాలయ, బీహార్, జార్ఖండ్‌లో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. అస్సాం, మేఘాలయలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Weather
దేశంలో విచిత్ర వాతావరణం :
భారత వాతావరణ శాఖ ప్రకారం వాయువ్య భారతదేశం, మధ్య భారతదేశం, మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల్లో ఈ హెచ్చుతగ్గులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి వాతావరణమే ఉంది. పగటిపూట ఎండ మండిపోతోంది... సాయంత్రం అయ్యేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది. ఇలా కొన్నచోట్ల ఎండలు మండిపోతుంటే మరికొన్నిచోట్ల చల్లని గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ విచిత్ర వాతావరణం మరికొన్నిరోజులు ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.