- Home
- National
- Interesting news: దగ్గు సిరప్ లో విష పదార్థాలు, అత్యంత సేఫ్ సిటీ.. ఇలా మీరు మిస్ అయిన వార్తలు ఇక్కడ చదివేయండి
Interesting news: దగ్గు సిరప్ లో విష పదార్థాలు, అత్యంత సేఫ్ సిటీ.. ఇలా మీరు మిస్ అయిన వార్తలు ఇక్కడ చదివేయండి
ఈవారం ఎన్నో ప్రత్యేక సంఘటనలు, కథనాలు (News) వచ్చాయి. అందులో ఆసక్తికరమైనవి (Interesting news) ఎన్నో ఉంటాయి. వాటిని మీరు మిస్ అయి ఉంటే ఇక్కడ చదివేయండి.

పిల్లల ఆధార్ అప్డేట్ కు ఫీజు రద్దు
ఏడు నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ఫీజును UIDAI రద్దు చేసింది. దీనివల్ల మన దేశంలో ఉన్న ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఒక ఏడాది పాటు ఇది అమలులో ఉంటుంది. పిల్లలకు విద్యా, స్కాలర్ షిప్లు, పథకాలు అందడం సులభతరం చేసేందుకే ఆధార్లో ఉచిత బయోమెట్రిక్ అప్డేట్ ను అందించినట్టు ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది. ఆధార్ కార్డు పై పేరు, పుట్టిన తేదీ, చిరునామా, మొబైల్ నెంబరు, ఈ మెయిల్ వంటివి ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కోసారి విడిగా చేయించాలనుకుంటే మాత్రం 50 రూపాయల నుండి 75 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఉచిత ఆఫర్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి.
దగ్గులో విషం
దగ్గు మందులో విష పదార్థాల కారణంగా మధ్యప్రదేశ్ లోని చింద్వారా జిల్లాలో 9 మంది పిల్లలు మరణించారు. వారు కోల్డ్రిఫ్ అనే దగ్గు సిరప్ ను వాడిన తర్వాత మరణించినట్టు పరీక్షల్లో తేలింది. దీంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ అమ్మకాలను నిషేధించింది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న శ్రేసన్ ఫార్మాసిటి నుంచి ఈ దగ్గు సిరప్ ను తయారు చేస్తున్నారు. కోల్డ్రిఫ్ సిరప్ లో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్ ఉందని నివేదికలు వెల్లడించాయి. దీనివల్ల తీవ్రమైన మూత్రపిండాల వైఫల్,యం కాలేయ వైఫల్యం జరుగుతుందని.. ఇది మనిషి వినియోగించేందుకు సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు.
అత్యంత సేఫ్ సిటీ ఇదేనట
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతున్న ప్రకారం కోల్ కతా మరొకసారి మన దేశంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా నిలిచింది. వరుసగా ఈ ఘనతను నాలుగోసారి సాధించింది. కోలకతాలో నేరాల రేటు అత్యల్పంగా ఉన్నట్టు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెబుతోంది. లక్ష మందికి 83.9 నేరారోపణలే నమోదవుతున్నాయి. 2025లోనే కాదు 2024, 2023, 2022 ఇలా గత నాలుగేళ్లుగా కోల్ కతా అత్యంత సురక్షిత నగరంగా పేరు తెచ్చుకుంది.
చైనాకు విమాన సర్వీసులు ఎప్పటినుంచంటే
ఐదేళ్ల తర్వాత తొలిసారి భారతదేశం.. చైనా మధ్య ప్రత్యక్ష విమాన రాకపోకలు ప్రారంభం అవ్వబోతున్నాయి. అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండిగో సంస్థ కోల్ కతా నుండి చైనాలోని గ్యాంగ్జావ్ కు విమాన సర్వీసులను అక్టోబర్ 26 నుండి టేకాఫ్ చేయబోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత చైనాకు విమాన సర్వీసులను భారతదేశం నిలిపివేసింది. తాజాగా మారిన పరిణామాలతో తిరిగి భారతదేశం చైనాకు విమాన సర్వీసులను మొదలుపెట్టింది.
బ్రెయిన్ డెత్ పై శిక్షణలేని భారతీయ వైద్యులు
మనదేశంలో న్యూరో సర్జన్లు, న్యూరాలజిస్టులు, క్రిటికల్ కేర్ నిపుణులపై ఒక సర్వేను నిర్వహించారు. ఆ సర్వేలో సగానికి పైగా వైద్యులకు బ్రెయిన్ డెత్ ను ధ్రువీకరించడానికి కావాల్సిన శిక్షణ అందలేదని తేలింది. దీనివల్ల అవయవదానానికి ఇబ్బంది ఏర్పడుతుందని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనాన్ని ప్రచురించారు. వైద్యులలో ఎంతోమంది అద్భుతంగా రోగుల ప్రాణాలు కాపాడుతున్నప్పటికీ వారిలో 10 శాతం మందికి మాత్రమే బ్రెయిన్ డెత్ ను ధ్రువీకరించే శిక్షణ తీసుకున్నట్టు తేలింది. దీనివల్ల అవయవ దానం విషయంలో ఎంతో ఇబ్బందులు ఏర్పడతాయి. బ్రెయిన్ డెత్ జరిగిన కొన్ని గంటలలోపే అవసరమైన అవయవాలను తొలగించాల్సి ఉంటుంది. లేకుంటే ఉపయోగం ఉండదు. కాబట్టి వైద్యులకు బ్రెయిన్ డెత్ విషయంలో మరింత శిక్షణ అవసరమని ఈ అధ్యయనం చెబుతోంది.