- Home
- Business
- Bangalore: రోడ్డుపై ఒంటరిగా వెళ్లిన పన్ను కట్టే రోజులు రాబోతున్నాయి, ఇలా అయితే బెంగళూరులో బతకడం కష్టమే
Bangalore: రోడ్డుపై ఒంటరిగా వెళ్లిన పన్ను కట్టే రోజులు రాబోతున్నాయి, ఇలా అయితే బెంగళూరులో బతకడం కష్టమే
భారతదేశ ఐటీ రాజధానిగా బెంగుళూరు (Bangalore)పేరు పొందింది. అయితే అక్కడ ట్రాఫిక్ ను భరించలేక ఎంతోమంది ఊరి విడిచి వెళ్ళిపోతున్నారు. అందుకే త్వరలో కర్ణాటక ప్రభుత్వం ఒంటరిగా రోడ్డుపై కార్లు, బైకులపై తిరిగేవారికి పన్ను విధించాలని ఆలోచిస్తుంది.

బెంగళూరులో కొత్త పన్ను
బెంగళూరును సిలికాన్ సిటీ, భారతదేశ ఐటీ రాజధాని అని పిలుస్తారు. కానీ బెంగళూరులో ట్రాఫిక్ చూస్తే నరకంలా అనిపిస్తుంది. బెంగళూరులో జరిగే ట్రాఫిక్ జామ్‌ల గురించి ప్రపంచవ్యాప్తంగా ఐటి నిపుణులందరికీ తెలుసు. రోజూ ఆఫీస్ కి వెళ్లే ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతూ ఆఫీసులకు చేరుకుంటారో బెంగుళూరులో జీవించిన వారికి తెలుసు. అందుకే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఒక కొత్త ఆలోచన చేసింది. అదే కంజెషన్ టాక్స్. అంటే రద్దీపన్ను.
కారులో ఒంటరిగా వెళితే
కంజెషన్ టాక్స్ అనేది ఒంటరిగా కారులో ప్రయాణించే వారికి పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు, ఇతర ప్రధాన కూడలిలో ట్రాఫిక్ అధికంగా ఉంటుంది. కానీ కొంతమంది కారులో ఒక్కరే ప్రయాణిస్తూ ఉంటారు. అదే వారు మరి కొంతమందిని తమ కారులో తీసుకెళ్తే ట్రాఫిక్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటి కార్ పూలింగ్ ఆలోచనలను పెంచేందుకే పన్ను విధించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒక కారులో ఒకే వ్యక్తి ప్రయాణిస్తే పన్ను అధికంగా కట్టాల్సి వస్తుంది. ఇద్దరూ లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే మాత్రం పన్ను కట్టాల్సిన అవసరం ఉండదు. ఇలా పన్ను వేయడం వల్ల ఒంటరిగా కార్లు నడిపే వారి సంఖ్య తగ్గిపోతుందన్నది ప్రభుత్వ ఆలోచన.
ఎలా పన్ను కట్టాలి?
ఈ కొత్త రద్దీపన్ను అమలు చేయాలంటే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం కష్టం. అందుకే ఫాస్టాగ్ వ్యవస్థని వినియోగించుకోవాలన్నదే కర్ణాటక ప్రభుత్వం ఆలోచన. ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఆగి ఫీజు చెల్లించి వెళ్లాల్సిన అవసరం లేదు. కారులో ఒంటరిగా ఒక వ్యక్తి రద్దీగా ఉండే రోడ్ల మీదకి రాగానే ఆ పన్ను ఫాస్టాగ్ నుండి ఆటోమేటిక్ గా కట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఆలోచన చర్చల దశలోనే ఉంది. త్వరలో అమల్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గడమే కాదు ప్రభుత్వానికి మరింత ఆదాయం కూడా వస్తుంది.
బైకులపై వెళ్లేవారు?
ప్రస్తుతం కారులో వెళ్లేవారిపైనే ఈ పన్నును వేసేందుకు సిద్ధమవుతున్నారు. బైకుల గురించి ఎక్కడ ప్రస్తావనా తేలేదు. బైకులపై వెళ్లేవారు కూడా ఒంటరిగా ప్రయాణించకం కన్నా ఒకరిని తమతో పాటు తీసుకువెళ్లడం వల్ల ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయి. మొదట కార్లపై ప్రయోగించిన తర్వాతే బైకులపై వెళ్లే వారిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇలా ఈ పన్నును వేయడం వల్ల ట్రాఫిక్ తగ్గడమే కాదు.. బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణా వ్యవస్థకు బలం చేకూరుతుంది. ఎక్కువ మంది సొంత కార్లు వదిలేసి బస్సుల్,లో మెట్రోల్లో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా అవసరం లేని ప్రయాణాలను తగ్గించుకుంటారు.
ఎప్పుడు అమల్లోకి?
ఈ నిర్ణయం తీసుకున్నాక ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందో కూడా కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి కూడా ఇప్పుడు కార్లు ఉంటున్నాయి. అలాగే టాక్సీ డ్రైవర్లు కూడా కొన్నిసార్లు కార్లను.. కస్టమర్లు లేకపోయినా ఒక చోట నుండి మరోచోటకి తీసుకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి అప్పుడు వారిపై పన్ను అనేది కొత్త భారంగా పడుతుంది. దీనివల్ల వారిలో అసహనం పెరిగే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ వైపుగా కూడా ప్రభుత్వ అధినేతలు ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాదికి ఏదో ఒక విషయం తేలిపోతుంది.