టమాటా @ రూ. 250.. ఎక్కడో తెలుసా??
టమాటా పండించే ముఖ్యమైన ప్రాంతాల్లో వేడిగాలులు, భారీ వర్షాలు పంట దిగుబడిపై ప్రభావం చూపడం వల్ల టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక ఈ రాష్ట్రంలోనైతే ఏకంగా కిలో రూ.250 కి చేరుకుని గుండెలు గుభేలనిపిస్తుంది.

ఉత్తరాఖండ్ : ఇక్కడ టమాటా ధర వింటే ఒక్కసారిగా గుండెలు గుభేలుమనడం ఖాయం. రూపాయికి కిలో లభించే టమాటాలు ఇక్కడ ఏకంగా రూ.250కి కిలోకి చేరుకున్నాయి.
గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలనంటుతున్న సంగతి తెలిసిందే. కిలో టమాట సెంచరీ దాటి.. పరుగులు పెడుతోంది. సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. దీంతో కొన్ని చోట్ల ప్రభుత్వాలే సబ్సిడీ రేట్లలో టమాటాలను సరఫరా చేస్తున్నాయి.
ఈ టమాటాలు ఉత్తర భారత్ లో రూ. 250 పలుకుతోంది. గంగోత్రి ధామ్‌లో టమాట కిలోకు రూ.250, ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోయాయని.. కూరగాయల విక్రయదారుడు తెలిపారు.
ఉత్తరకాశీలో టమాటా ధరల పెరుగుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేట్లు ఇంతగా పెరిగిపోవడంతో ప్రజలు వాటిని కొనేందుకు కూడా ఇష్టపడడం లేదు. గంగోత్రి, యమునోత్రిలో టమాట కిలో రూ. 200 నుంచి రూ. 250 పలుకుతోంది' అని కూరగాయల విక్రయదారు రాకేష్ తెలిపారు.
టమాటా పండించే కీలక ప్రాంతాల్లో నెలకొన్న వేడిగాలులు, భారీ వర్షాలు, టమాటా పంటను దెబ్బతీయడం కూరగాయల ధరలు భారీగా పెరగడానికి కారణమని పలువురు పేర్కొన్నారు.మిగతా వస్తువుల్లాగా టామాటాలను ఎక్కువ కాలం నిల్వ చేయడం కుదరకపోవడం కూడా దీనికి కారణం అని చెబుతున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కేజీ రూ. 150 దాటింది. చెన్నైలో, టమోటాలు ప్రస్తుతం కిలో ₹ 100-130 వరకు దొరుకుతున్నాయి.
టమాటా ధరలు పెరగడంతో రకరకాల మీమ్స్, జోక్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి.
అనేక రాష్ట్రాల మాదిరిగానే కర్నాటకలో కూడా ఇటీవలి రోజుల్లో టమాటా ధరలు ఆకాశాన్నంటాయి. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర రాజధాని చెన్నైలోని రేషన్ షాపుల్లో కిలోకు రూ. 60 చొప్పున రాయితీ ధరతో టొమాటోలను విక్రయించడం ప్రారంభించింది.
బెంగళూరులో టమోటా ధరలు కిలోకు రూ.101 నుండి 121 వరకు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్‌లో అకస్మాత్తుగా ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ధరలు పెరగడం, టమాటాకు తెగుళ్లు సోకడంతో మార్కెట్‌లోకి దిగుబడి తగ్గింది.
గురువారం తెలంగాణ, కర్నాటకల్లో టమాటా, పచ్చిమిర్చి దొంగతనాలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే.