- Home
- National
- మొన్న సుజాతక్క, నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. తెలుగు మావోయిస్ట్ అగ్రనాయకులంతా ఎందుకిలా లొంగిపోతున్నారు?
మొన్న సుజాతక్క, నిన్న మల్లోజుల, నేడు ఆశన్న.. తెలుగు మావోయిస్ట్ అగ్రనాయకులంతా ఎందుకిలా లొంగిపోతున్నారు?
Maoist : మావోయిస్ట్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లలో కొందరు… తమంతట తామే లొంగిపోయి మరికొందరు అగ్రనాయకులు ఉద్యమానికి దూరం అవుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇందులో తెలుగువాళ్లే ఎక్కువగా ఉంటున్నారు.

మావోయిస్ట్ పార్టీకి దెబ్బమీద దెబ్బ
Maoists Surrender : మొన్న మావోయిస్ట్ అగ్రనాయకురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క... నిన్న మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్... నేడు మావోయిస్ట్ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న... అగ్రనాయకులంతా వరుసగా లొంగిపోతున్నారు. ఇక ఇటీవలకాలంలో జరిగిన ఎన్కౌంటర్లలో మరికొందరు కీలక నాయకులు హతమయ్యారు. దీంతో ఇప్పటికే బలహీనంగా ఉన్న మావోయిస్ట్ పార్టీ రోజురోజుకు మరింత దెబ్బతింటోంది. అగ్రనాయకుల లొంగుబాట్లతో మావోయిస్ట్ ఉద్యమం ఉనికినే కోల్పోయేలా కనిపిస్తోంది.
ఇప్పటివరకు లొంగిపోయిన తెలుగు మావోయిస్ట్ అగ్రనాయకులు వీరే..
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, అగ్రనేత కిషన్ జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క గతనెల సెప్టెంబర్ లో తెలంగాణ పోలీసులకు ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. భర్త మరణం తర్వాత దాదాపు దశాబ్దానికి పైనే ఆమె మావోయిస్ట్ ఉద్యమంలో కొనసాగారు.. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె లొంగిపోయారు. సుజాతక్క తెలంగాణలోని గద్వాల ప్రాంతానికి చెందినవారు. ఈమెతో పాటే మరికొందరు మావోయిస్టులు కూడా పోలీసులకు లొంగిపోయారు.
సరిగ్గా నెలరోజుల తర్వాత అక్టోబర్ లో మరో మావోయిస్ట్ అగ్ర నాయకుడు కూడా లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి స్వయంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్ ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఈయన కూడా తెలంగాణకు చెందినవారే. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన మావోయిస్ట్ ఉద్యమంలో ప్రవేశించి అంచెలంచెలుగా టాప్ స్థానానికి చేరుకున్నారు. ఈయన తలపై రూ.6 కోట్ల రివార్డ్ ఉంది.
తాజాగా మరో మావోయిస్ట్ అగ్రనాయకుడు, కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న చత్తీస్ ఘడ్ లో లొంగిపోయారు. కాంకేర్ జిల్లా పోలీసులకు సరెండర్ అయిన ఆశన్న రేపు(గురువారం) చత్తీస్ ఘడ్ సీఎం విష్ణుదేవ్ సాయికి ఆయుధాలను అప్పగించనున్నారు. ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్లు సీఎం ప్రకటించనున్నారు.
ఇలా ఇప్పటివరకు లొంగిపోయిన ముగ్గురు మావోయిస్ట్ పార్టీ కేంద్ర నాయకులు తెలుగువారే. వీరు ఉద్యమాబాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ. వీరి బాటలోనే మిగిలిన మావోయిస్టులు నడిచి హింసను వీడాలని... ప్రజాస్వామ్య పాలనకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.
మావోయిస్ట్ అగ్రనేతల మృతి
మావోయిస్ట్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలో భద్రతా బలగాలు జరిపిన ఎన్కౌంటర్లలో మావోయిస్ట్ అగ్రనాయకులు చాలామంది మరణించారు. వీరిలోనూ తెలుగు నాయకులే అధికంగా ఉన్నారు. ఇటీవల మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు.
రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి, పుల్లూరు ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, సుధాకర్, మోడెం బాలకృష్ణ, కట్టారామచంద్రారెడ్డి అలియాస్ రాజు దాదా, కాదరి సత్యనారాయణ అలియాస్ కోసా తదితరులు కూడా ఇటీవల కాలంలో భద్రతాబలగాల ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. వీళ్లంతా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులే. ఇక ఎన్కౌంటర్లలో చనిపోయిన సాధారణ మావోయిస్టులకు లెక్కేలేదు.
ఆపరేషన్ కగార్ ఎఫెక్టేనా?
మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకుంది మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. మావోయిస్టుల హింసావాదాన్ని వీడి జనజీవనస్రవంతిలో కలిసిపోవాలని... లేదంటే వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. కేవలం బెదిరించడమే కాదు ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఏరివేతకు భారీ ఆపరేషన్ చేపట్టింది కేంద్రం.
భద్రతాబలగాల కాల్పుల్లో గత ఏడాదికాలంగా దాదాపు 357 మందికిపైగా మావోయిస్టుల హతమయ్యారు. అలాగే మరో 412 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వరుస ఎన్కౌంటర్లు, అగ్రనాయకుల మధ్య నెలకొన్న విబేధాలు ఈ లొంగుబాట్లకు కారణంగా తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టులపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా జనజీవనస్రవంతిలో కలిసిపోయే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు... పునరావాసం కోసం నగదు, ఇతర సహాయం అందిస్తోంది ప్రభుత్వం. ఎలాంటి చర్యలు తీసుకోకుండా సామాన్య జీవితం గడిపేందుకు అవకాశం ఇస్తుండటం కూడా మావోయిస్టుల లొంగుబాటుకు కారణంగా తెలుస్తోంది.