- Home
- National
- Alcohol: స్విగ్గీ, జొమాటో ద్వారా మద్యం డెలివరీ.. ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందంటే.
Alcohol: స్విగ్గీ, జొమాటో ద్వారా మద్యం డెలివరీ.. ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందంటే.
ఈ కామర్స్ రంగం ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. పెద్ద పెద్ద వస్తువులు మొదలు ఉల్లిగడ్డ వరకు ఇంటికి డెలివరీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మద్యాన్ని కూడా హోం డెలివరీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

ఆన్‌లైన్‌లో మద్యం విక్రయం ప్రణాళిక
కేరళ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (BEVCO) రాష్ట్రంలో ఆన్‌లైన్ ద్వారా మద్యం విక్రయానికి సిద్ధమవుతోంది. BEVCO మేనేజింగ్ డైరెక్టర్ హర్షితా అట్టలూరి ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనను సమర్పించారు. ఈ నిర్ణయంతో ఆదాయాన్ని పెంచడంతో పాటు, కస్టమర్లకు సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆసక్తి చూపిస్తోన్న స్విగ్గీ, జొమాటో
ఆన్‌లైన్ మద్యం డెలివరీ కోసం BEVCO ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందించింది. Swiggy, Zomato వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారంలు ఈ సేవలో భాగం కావడానికి ఆసక్తి చూపుతున్నాయి. యాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చి, నేరుగా కస్టమర్ ఇంటికే మద్యం పంపే విధానాన్ని అవలంభించనున్నారు.
కొనుగోలుకు వయసు పరిమితి
BEVCO ప్రతిపాదన ప్రకారం, 23 ఏళ్లకు పైబడిన వారికే ఆన్‌లైన్‌లో మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్డర్ చేసేముందు వయస్సు ధృవీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. దీంతో మైనర్ల చేత మద్యం కొనుగోలు అడ్డుకట్ట వేయనున్నారు.
తక్కువ ఆల్కహాల్ డ్రింక్స్ విడుదల
ప్రతిపాదనలో భాగంగా తక్కువ శక్తి (Low Power) కలిగిన మద్యం కూడా మార్కెట్లోకి తీసుకురావాలని BEVCO భావిస్తోంది. ఇది ముఖ్యంగా పర్యాటకుల కోసం అనుకూలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ విధానం మద్యం వినియోగాన్ని నియంత్రణలో ఉంచుతూ, ఆదాయాన్ని పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.
విదేశీ బీర్ విక్రయానికి అవకాశం
BEVCO సిఫారసులో మరో అంశం – విదేశీ బ్రాండ్ బీర్ విక్రయానికి అనుమతి ఇవ్వడం. రాష్ట్రంలోని మద్యం విక్రయ కేంద్రాల్లో, అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలలో కూడా ఈ బీర్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. మరి కేరళలలో ప్రతిపాదనలో ఉన్న ఈ విధానం తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలవుతుందా లేదో చూడాలి.