- Home
- National
- Kalki Bhagavan: ఎల్‌ఐసీ క్లర్క్ నుంచి రూ. 200 కోట్ల ఏకం సామ్రాజ్యం వరకు.. కల్కి భగవాన్ సంచలన లైఫ్ స్టోరీ ఇది
Kalki Bhagavan: ఎల్‌ఐసీ క్లర్క్ నుంచి రూ. 200 కోట్ల ఏకం సామ్రాజ్యం వరకు.. కల్కి భగవాన్ సంచలన లైఫ్ స్టోరీ ఇది
Spiritual Leader Kalki Bhagavan: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ (77) చెన్నైలో కన్నుమూశారు. వరదయ్యపాళెంలోని ఏకం క్షేత్రంలో శనివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

కల్కి భగవాన్ ఇకలేరు.. చెన్నై హాస్పిటల్‌లో ఏం జరిగింది? ఏకం క్షేత్రంలో అంత్యక్రియలు
సాధారణ కుటుంబంలో పుట్టి, క్లర్క్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అనుచరులను సంపాదించుకున్న ప్రముఖ ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ (77) ఇకలేరు. గత పది రోజులుగా ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాన్ని ఆయన కుమారుడు కృష్ణాజీ ఒక వీడియో మెసేజ్ ద్వారా అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఆయన అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. 1949 మార్చి 7న తమిళనాడులోని వెల్లూరు జిల్లా నాథం గ్రామంలో జన్మించిన ఆయన, చెన్నై డి.జి. వైష్ణవ్ కాలేజీలో చదువు పూర్తి చేశాక ఎల్‌ఐసీ (LIC) క్లర్క్‌గా ఉద్యోగంలో చేరారు. కొన్ని రోజులు నేషనల్ ఇన్సూరెన్స్ ఏజెంట్‌గా, టీచర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.
'జీవాశ్రమ్' పాఠశాలతో మొదలైన కొత్త జర్నీ
1980ల చివర్లో కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయన, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో ప్రత్యామ్నాయ విద్యా విధానం కోసం ‘జీవాశ్రమ్’ అనే స్కూల్ ప్రారంభించారు. పిల్లల్లో ఆత్మపరిశీలన పెంపొందించడమే లక్ష్యంగా ఇది సాగింది. 1990ల ప్రారంభంలో (1992-1994 ప్రాంతంలో) తనను తాను విష్ణుమూర్తి పదో అవతారమైన ‘కల్కి’గా ప్రకటించుకున్నారు.
ఆ తర్వాత తన కేంద్రాలను తమిళనాడులోని నేమం, ఆంధ్రప్రదేశ్‌లోని వరదయ్యపాళేనికి విస్తరించారు. ధ్యానం, ‘ముక్తి దీక్ష’ (ఒనెనెస్ బ్లెస్సింగ్) పేరుతో సరికొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలను డిజైన్ చేసి, కేవలం ఇండియాలోనే కాకుండా విదేశీయులను కూడా భారీగా ఆకర్షించారు.
రూ. 200 కోట్లతో పాలరాతి ఏకం ఆలయం
వరదయ్యపాళెం మండలం బత్తులవల్లం దగ్గర సుమారు రూ.200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన పాలరాతి నిర్మాణం ‘గోల్డెన్ సిటీ’ (ఏకం ఆలయం/వన్‌నెస్ టెంపుల్) ఆయన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు మెయిన్ హబ్‌గా మారింది. కల్కి గ్రామీణాభివృద్ధి ట్రస్ట్, వన్నెస్ హ్యూమన్, లోకా ఫౌండేషన్, ముక్తి వంటి సంస్థల ద్వారా తాగునీరు, ఉచిత కంటి వైద్యశిబిరాలు, విద్యా సాయం వంటి సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టారు.
అయితే, ఆయన ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు వివాదాలు కూడా నడిచాయి. కమర్షియలైజేషన్, భూ వివాదాలతో పాటు 2019 అక్టోబర్‌లో ఐటీ శాఖ జరిపిన సోదాలు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించాయి. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున నగదు, విదేశీ కరెన్సీ, బంగారం లభ్యమైనట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు. 2017 నుంచే సంస్థల బాధ్యతలను తన కుమారుడు ఎన్.కె.వి. కృష్ణ, కోడలు ప్రీతా కృష్ణలకు అప్పగించి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఆలయ ప్రాంగణంలోనే అంత్యక్రియలు
కల్కి భగవాన్ భౌతికకాయాన్ని బుధవారం ఉదయం తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని ఏకం క్షేత్రానికి తీసుకువచ్చారు. బుధవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు మూడు రోజుల పాటు భక్తుల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఇక్కడే ఉంచనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఆన్‌లైన్ ద్వారా లైవ్ దర్శన ఏర్పాట్లు కూడా చేశారు.
విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. శనివారం ఏకం ఆలయ ప్రాంగణంలోనే అధికారిక లాంఛనాలు, సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, సమాధి నిర్మాణం చేపడతామని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.

