- Home
- National
- ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్.? దేశవ్యాప్తంగా ఎందుకు ఈయన పేరు మారుమోగుతోంది? ఈయన లక్ష్యం ఏంటి.?
ఎవరీ సోనమ్ వాంగ్‌చుక్.? దేశవ్యాప్తంగా ఎందుకు ఈయన పేరు మారుమోగుతోంది? ఈయన లక్ష్యం ఏంటి.?
Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ పేరు ఇటీవల దేశమంతా మారుమోగుతోంది. 3 ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన "ఫున్‌సుఖ్ వాంగ్డూ" పాత్రకు ప్రేరణగా నిలిచిన వ్యక్తిగా చాలా మందికి తెలిసిన వాంగ్‌చుక్ గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం.

ఎవరీ వాంగ్‌చుక్, ఎక్కడ జన్మించాడు.?
3 ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ పోషించిన "ఫున్‌సుఖ్ వాంగ్డూ" పాత్రకు ప్రేరణగా నిలిచిన వ్యక్తిగా చాలా మందికి తెలిసిన వాంగ్‌చుక్ వాస్తవానికి కేవలం ఒక ఆవిష్కర్త మాత్రమే కాదు.. విద్యా వ్యవస్థను మార్చాలన్న సంకల్పంతో పనిచేసిన సంస్కర్త, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించిన శాస్త్రవేత్త, హిమాలయ ప్రాంత ప్రజల హక్కుల కోసం ఉద్యమించిన సామాజిక కార్యకర్త కూడా. విద్య, సాంకేతికత, ప్రకృతి, స్థానిక సమాజ అభివృద్ధి.. ఈ నాలుగు రంగాలను ఒకే దారిలో నడిపించిన అరుదైన వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.
సోనమ్ వాంగ్‌చుక్ 1966 సెప్టెంబర్ 1న లడఖ్‌లోని లేహ్ జిల్లా అల్చి సమీప గ్రామంలో జన్మించారు. చిన్ననాటి వరకు ఆయనకు సాధారణ పాఠశాల విద్య అందలేదు. తొమ్మిదేళ్ల వయసు వచ్చే వరకు ఇంట్లోనే తల్లి వద్ద తన మాతృభాషలో చదువు నేర్చుకున్నారు. తర్వాత శ్రీనగర్‌లోని పాఠశాలలో చేరినప్పుడు భాషా సమస్యలు, ప్రాంతీయ వివక్ష, ఒంటరితనం వంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ అనుభవాలే భారత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను ఆయనకు దగ్గరగా చూపించాయి.
తర్వాత ఢిల్లీలో చదువు కొనసాగించిన ఆయన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) శ్రీనగర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం భూగర్భ నిర్మాణాలు, పర్యావరణానికి అనుకూలమైన నిర్మాణ విధానాలపై కూడా ప్రత్యేకంగా అధ్యయనం చేశారు.
SECMOLతో విద్యా విప్లవం.. ఫెయిల్ అయిన విద్యార్థులకే అవకాశం
1988లో సోనమ్ వాంగ్‌చుక్ స్థాపించిన SECMOL (Students' Educational and Cultural Movement of Ladakh) సంస్థ ఆయన జీవితంలోనే కాదు, లడఖ్ విద్యా రంగంలోనూ కీలక మలుపు తీసుకొచ్చింది. పాఠ్యపుస్తకాలు, బోధనా విధానాలు స్థానిక జీవన విధానానికి అనుగుణంగా లేకపోవడం వల్లే విద్యార్థులు వెనుకబడుతున్నారని గుర్తించిన ఆయన, గ్రామీణ అవసరాలకు తగ్గ విద్యా నమూనాను రూపొందించారు.
ఆయన రూపొందించిన ఆపరేషన్ న్యూ హోప్ కార్యక్రమం ప్రభుత్వం, గ్రామ సమాజం, విద్యా నిపుణుల భాగస్వామ్యంతో పాఠశాలల పనితీరును మార్చింది. స్థానిక సంస్కృతి, భాష, వాతావరణాన్ని ప్రతిబింబించే పాఠ్యాంశాలు రూపొందించడం, ఉపాధ్యాయులకు కొత్త శిక్షణ ఇవ్వడం, గ్రామ విద్యా కమిటీలకు అధికారాలు కల్పించడం వంటి సంస్కరణలు అమలు చేశారు.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లేహ్ సమీపంలో ఏర్పాటు చేసిన సెక్మోల్ ప్రత్యామ్నాయ పాఠశాలలో రాష్ట్ర పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకే ప్రవేశం కల్పించారు. అక్కడ పరీక్షలకే పరిమితమైన విద్య కాకుండా, వ్యవసాయం, ఇంజనీరింగ్, శక్తి వినియోగం, నిర్మాణం, నాయకత్వం వంటి అంశాలను ప్రాజెక్టుల ద్వారా నేర్పించారు. మట్టితో నిర్మించిన భవనాలు, పూర్తిగా సౌరశక్తితో నడిచే క్యాంపస్, ప్రకృతికి అనుగుణమైన జీవన విధానం ఈ విద్యా కేంద్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి.
ఐస్ స్థూపం నుంచి సౌర టెంట్ల వరకు.. ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆవిష్కరణలు
సోనమ్ వాంగ్‌చుక్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం ఐస్ స్థూపం (Ice Stupa) ఆవిష్కరణ. లడఖ్‌లో శీతాకాలంలో వృథాగా వెళ్లిపోయే నీటిని మంచు స్థూపాల రూపంలో నిల్వ చేసి, వేసవిలో పంటల సాగుకు వినియోగించే ఈ పద్ధతి నీటి నిర్వహణలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది. వాతావరణ మార్పుల ప్రభావంతో హిమానీనదాలు తగ్గుతున్న పరిస్థితుల్లో రైతులకు ఇది కీలక పరిష్కారంగా మారింది.
ఈ ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో స్విట్జర్లాండ్ వంటి దేశాలు కూడా ఆయన సాంకేతికతను స్వీకరించాయి. తర్వాత అత్యంత చలి ప్రాంతాల్లో విధులు నిర్వహించే భారత సైనికుల కోసం సౌరశక్తితో వేడి నిల్వ చేసే మొబైల్ టెంట్లను రూపొందించారు. అలాగే స్థానిక కుటుంబాలకు ఉపాధి కల్పించే ఫార్మ్‌స్టేస్ లడఖ్ పర్వత ప్రాంతాల అవసరాలకు అనుగుణమైన ఉన్నత విద్య కోసం హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అల్టర్‌నేటివ్స్, లడఖ్ (HIAL) స్థాపన కూడా ఆయన దూరదృష్టికి నిదర్శనాలుగా నిలిచాయి.
ప్రభుత్వ సలహాదారుగా మొదలై.. ఉద్యమకారుడిగా మారిన ప్రయాణం
ఒక దశలో సోనమ్ వాంగ్‌చుక్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్య, పర్యావరణం, పర్యాటకం, నీటి నిర్వహణ వంటి రంగాల్లో సలహాదారుగా పనిచేశారు. జాతీయ విద్యా మండళ్లు, రాష్ట్ర విద్యా బోర్డులు, లడఖ్ హిల్ కౌన్సిల్ వంటి అనేక సంస్థల్లో సభ్యుడిగా సేవలందించారు. ప్రారంభంలో ఆర్టికల్ 370 రద్దును కూడా ఆయన స్వాగతించారు. లడఖ్ అభివృద్ధికి కొత్త అవకాశాలు వస్తాయని భావించారు.
అయితే కాలక్రమేణా భూమి హక్కులు, స్థానిక సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, స్వయంప్రతిపత్తి వంటి అంశాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ విధానాలను బహిరంగంగా విమర్శించడం ప్రారంభించారు. లడఖ్‌కు రాజ్యాంగపరమైన రక్షణలు, ఆరవ షెడ్యూల్ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అనేక నిరసనలకు నాయకత్వం వహించారు. ఆయన చేపట్టిన దీక్షలు, పాదయాత్రలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. అదే సమయంలో ఆయనపై వచ్చిన కొన్ని ఆరోపణలు, అరెస్టులు, రాజకీయ వివాదాలు కూడా జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు కారణమయ్యాయి. అయితే ఆ ఆరోపణలను ఆయన, ఆయన కుటుంబ సభ్యులు రాజకీయ ప్రేరేపితమైనవిగా ఖండించారు.
ఇప్పుడు మరోసారి దేశ దృష్టిని ఆకర్షిస్తున్నాడు
2009లో విడుదలైన 3 ఇడియట్స్ చిత్రంలోని "ఫున్‌సుఖ్ వాంగ్డూ" పాత్రకు సోనమ్ వాంగ్‌చుక్ జీవితం స్ఫూర్తిగా నిలిచిందని చెప్తారు. ఆ సినిమా తర్వాత ఆయన పేరు దేశమంతా తెలిసినా, ఆయన అసలు కృషి మాత్రం విద్యా సంస్కరణలు, స్థానిక ప్రజల సాధికారత, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి చుట్టూనే తిరిగింది.
ప్రస్తుతం నీట్ పరీక్షల నిర్వహణలో జవాబుదారీతనం తీసుకురావాలని, పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. దీక్ష కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించినప్పటికీ, తన డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గబోనని ప్రకటించారు. ఈ అంశంపై వైద్యులు, ఢిల్లీ హైకోర్టు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు విద్యా సంస్కర్తగా, ఆవిష్కర్తగా గుర్తింపు పొందిన సోనమ్ వాంగ్‌చుక్.. ఇప్పుడు ప్రజా ఉద్యమాలకు ప్రతీకగా మరోసారి జాతీయ చర్చలో నిలిచారు.

