త్రివర్ణపతాక రూపకర్త పింగళి వెంకయ్య వర్థంతి నేడు: ఆయన జీవిత విశేషాలు...
1876 ఆగస్టు 2వ తేదీన మచిలీపట్నంలో పుట్టిన పింగళి వెంకయ్య భారత జెండాను రూపొందించడంతో ఆయనను అందరూ ముద్దుగా జెండా వెంకయ్య అని కూడా పిలుచుకునే వారు.
భారత త్రివర్ణ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 55వ వర్ధనతి నేడు. యావత్ భారతదేశం తలెత్తుకొని ఎలుగెత్తి సలాం కొట్టే జాతీయ జెండాను రూపిందించింది మన తెలుగువాడవ్వడం మన గర్వకారణం. 1876 ఆగస్టు 2వ తేదీన మచిలీపట్నంలో పుట్టిన పింగళి వెంకయ్య భారత జెండాను రూపొందించడంతో ఆయనను అందరూ ముద్దుగా జెండా వెంకయ్య అని కూడా పిలుచుకునే వారు.
పతాకాన్ని రూపొందించే ముందు ఆయన దాదాపుగా 30 దేశాల జెండాలను అధ్యయనం చేసాడు. 1916 నుండి 1921 వరకు అనేక దేశాల పతాకాలను అధ్యయనం చేసి చివరకు త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు. 1921 మార్చ్ 31 నుంచి ఏప్రిల్ 1వ తేదీవరకు విజయవాడలో జరిగిన జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో మహాత్మ గాంధీ ఈ జాతీయ జెండాకు ఆమోదముద్ర వేశారు.
19 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ లో చేరి దక్షిణాఫ్రికాలో ఆంగ్లో బోయర్ యుద్ధంలో బ్రిటిషువారి తరుఫున యుద్ధం చేసాడు. తొలుత జాతీయ కాంగ్రెస్ కోసం జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య ఆ తరువాత దానికి 1947లో మార్పులు చేసి భారత జాతీయ పతాకాన్ని రూపొందించాడు.
వెంకయ్య గారు జియాలజి శాస్త్రంలో నిష్ణాతుడు. వ్యవసాయదారుడు. గాంధీ స్పూర్తితో గాంధీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించాడు. గాంధీజీ అనుంగ శిష్యుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వాతంత్రోద్యమంలో అయన ముందుండి నడిచాడు. ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్రోద్యమ సమయంలో అక్కడ స్థానిక ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించాడు.
స్వతంత్రం వచ్చిన తరువాత 1967 లో ఆయన 86 సంవత్సరాల వయసులో మరణించాడు. మచిలీపట్నంలో ఆయనొక విద్యాసంస్థను కూడా ప్రారంభించాడు. యావత్ దేశానికి గర్వకారణమైన జెండాను ఆయన రూపొందించి జెండా వెంకయ్యగా ఆయన పేరు తెచ్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ నేటి ఉదయం ఆయనను స్మరిస్తూ ఒక ట్వీట్ చేసింది.
భారత తపాలా శాఖా ఆయన స్మృత్యర్థం 2009లో ఒక పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసింది. 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు భారత రత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. నేడు ఆయన వర్థంతి సందర్భంగా యావత్ దేశం ఆయనకు నివాళులు అర్పిస్తోంది.