- Home
- National
- ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్రత్యక్షం.. రీల్ చూసిన భార్యకు ఫ్యూజులు అవుట్
ఏడేళ్ల క్రితం తప్పిపోయిన భర్త ఇన్‌స్టాలో ప్రత్యక్షం.. రీల్ చూసిన భార్యకు ఫ్యూజులు అవుట్
సోషల్ మీడియా ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. సోషల్ మీడియా ద్వారా నేరాలు జరుగుతున్నాయని చెప్పడంలో ఎంత నిజం ఉందో ఆ నేరాలను చేధించడంలో కూడా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. తాజాగా జరిగిన ఓ సంఘటన దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.

పెళ్లి జరిగిన ఏడాదికే అదృశ్యం
ఉత్తరప్రదేశ్‌లోని అతామౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లూ, 2017లో మురార్నగర్‌కు చెందిన శీలా అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ఏడాదిలోనే వారి సంబంధాలు క్షీణించాయి. కట్నం పేరుతో బంగారు గొలుసు, ఉంగరం కోసం ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇవి అందకపోవడంతో శీలాను ఇంటి నుంచి బయటికి పంపేశారు. దీంతో ఆమె కుటుంబం కట్న వేధింపుల కేసు పెట్టింది. ఇదే సమయంలో 2018 ఏప్రిల్‌లో జితేంద్ర అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.
శీలాపై హత్య ఆరోపణలు
జితేంద్ర కనిపించకపోవడంతో అతని తండ్రి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు గాలింపు చేపట్టినా ఫలితం రాలేదు. ఇంతలో జితేంద్ర కుటుంబం, శీలా కుటుంబాన్ని నిందిస్తూ "మా కొడుకును చంపి శరీరాన్ని అదృశ్యం చేశారు" అని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో శీలా ఎన్నో సంవత్సరాలు అవమానాలను భరించాల్సి వచ్చింది.
సోషల్ మీడియాలో ప్రత్యక్షం
ఏడు సంవత్సరాల తరువాత శీలా ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో జితేంద్రను గుర్తించింది. అతను మరో మహిళతో లూధియానాలో ఉంటూ వీడియోలు తీస్తున్నాడు. ఈ రీల్ వైరల్ కావడంతో నిజం బయటపడింది. శీలా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జితేంద్ర కావాలనే ఇంటి నుంచి పారిపోయి లూధియానాలో మరో మహిళను పెళ్లి చేసుకుని జీవిస్తున్నట్లు విచారణలో తేలింది.
పోలీసులు కేసు నమోదు
కోట్వాలి సండిలా పోలీస్‌స్టేషన్‌కి శీలా ఫిర్యాదు చేసిన తరువాత పోలీసులు జితేంద్రను అదుపులోకి తీసుకున్నారు. రెండు వివాహాలు, మోసం, కట్న వేధింపుల కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతను పోలీసు కస్టడీలో ఉన్నాడు. శీలా మీడియాతో మాట్లాడుతూ "నా భర్త కనిపించకుండా పోయిన తరువాత, అతని కుటుంబం నాపై హత్య ఆరోపణలు చేసింది. కానీ నిజానికి వారు నన్ను మోసం చేశారు. ఇప్పుడు రీల్స్‌లో అతని నిజమైన జీవితం బయటపడింది" అని చెప్పింది.