పాముకాటుతో ప్రేమికుడి హత్య.. ఓ ప్రియురాలి ఘాతుకం..
ఓ మహిళ తన ప్రేమికుడిని పాముకాటుతో చంపింది. దీనికోసం పాములాడించే వ్యక్తి సహాయం తీసుకుంది.

ఉత్తరాఖండ్ : ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఓ వ్యాపారి మృతి అనుమానాస్పదంగా మారింది. దర్యాప్తు చేసిన పోలీసులు మొదట పాముకాటుతో మృతి చెందాడని అనుకున్నారు. కానీ, ఆ తరువాత విచారణలో తేలిన విషయాలు వారిని అవాక్కయ్యేలా చేశాయి.
ఆ వ్యాపారిని ఓ మహిళ పాముకాటుతో హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ఒకప్పుడు ఆ వ్యక్తితో సంబంధం పెట్టుకుని అతడిని వదిలించుకునేందుకు ప్రయత్నించింది.
జూలై 15న పోలీసులు హల్ద్వానీలోని తీన్ పానీ ప్రాంతానికి సమీపంలో కారులో ఒక వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు. వ్యక్తి కాలుపై పాము కాటు వేసిన గుర్తు కనిపించింది. మృతదేహం అంకిత్ చౌహాన్ అనే స్థానిక వ్యాపారిది. అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని గుర్తించి, జూలై 17న ఐపీసీ సెక్షన్లు 369/23, 302 కింద కేసు నమోదు చేశారు.
దర్యాప్తులో, అంకిత్ చౌహాన్ కాలును కాటు వేసిన పాముకు చెందిన పాము లాడించే వ్యక్తి కూడా హత్యలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
నైనిటాల్‌లోని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ భట్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ హత్యలో పాములాడించే వ్యక్తితో సహా ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ప్రధాన నిందితుడు డాలీ అలియాస్ మహి, అంకిత్ చౌహాన్‌తో ఒకప్పుడు రిలేషన్‌షిప్‌లో ఉంది.
ఎస్‌ఎస్‌పి భట్ తెలిపిన వివరాల ప్రకారం, మహి కొన్నాళ్లుగా అంకిత్‌ను డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఆ తర్వాత అతడిని వదిలించుకోవాలని అనుకుంది. అయినప్పటికీ అంకిత్ ఆమెను వెంబడిస్తూనే ఉన్నాడు.దీంతో.. అంకిత్ ను పాము కాటుతో హత్య చేయించాలనుకుంది. దీనికోసం ఓ పాములాడించే వ్యక్తిని సంప్రదించింది.
అలా మహి అంకిత్ హత్యకు ప్లాన్ చేసిందని, ఫలితంగా అతని మరణానికి కారణమైందని ఎస్‌ఎస్‌పి తెలిపారు. మహితోపాటు మరో ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. అధికారులు కేసును మరింత లోతుగా విచారించి, పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.