మందు బాబులకు ఈ ప్రదేశాలు స్వర్గం.. తక్కువ ధరకు ఆల్కహాల్ దొరికే ప్రాంతాలివే
Liquor: భారతదేశంలో మద్యం ధరలు రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. ఓ చోట చౌకగా లభిస్తే.. మరోచోట ఎక్కువ ధర ఉంటుంది. మరి దేశంలో తక్కువ ధరకు మద్యం లభించే ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దేశంలోనే చౌకైన మద్యం గోవాలో
గోవాలో మద్యం ధరలు దేశంలోనే అత్యల్పంగా ఉంటాయి. అక్కడ మద్యంపై విధించే ఎక్సైజ్ సుంకం కేవలం 49% మాత్రమే. పర్యాటకులను ఆకర్షించడమే ఈ తక్కువ ధరలకు ప్రధాన కారణం. గోవా ప్రభుత్వం చౌకైన మద్యం పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుందని నమ్ముతుంది. అందుకే బీరు నుంచి హార్డ్ లిక్కర్ వరకు అన్ని రకాల డ్రింక్స్ ఇక్కడ ఇతర రాష్ట్రాల కంటే చాలా తక్కువ ధరకే లభిస్తాయి.
హర్యానా, ఢిల్లీ
గోవా తరువాత హర్యానా, ఢిల్లీలో మద్యం ధరలు చౌకగా ఉంటాయి. హర్యానాలో ఎక్సైజ్ పన్ను రేటు సుమారు 47%, ఇది చాలా రాష్ట్రాల కంటే తక్కువ. పైగా, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ (CSD) ద్వారా విక్రయించే మద్యం కూడా తక్కువ ధరలకు దొరుకుతుంది. గురుగ్రామ్, ఫరీదాబాద్ వంటి నగరాల్లో మద్యం ధరలు పొరుగు రాష్ట్రాల కంటే చవకగా ఉంటాయి. ఢిల్లీలో పన్ను రేటు దాదాపు 62% ఉండగా, ఉత్తరప్రదేశ్‌లో అది 66% వరకు ఉంటుంది. అయినా ఢిల్లీలో మద్యం కొంత తక్కువ ధరకే లభిస్తుంది.
పుదుచ్చేరి, సిక్కిం, డామన్ & డయూ
గోవా తరహాలోనే పుదుచ్చేరి, సిక్కిం, డామన్ & డయూ వంటి ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకర్షించడానికి మద్యంపై పన్నులను తక్కువగా ఉంచాయి. వీటిలో చాలా ప్రాంతాలు సముద్రతీరాలు లేదా పర్యాటక కేంద్రాలు కావడం వల్ల, చౌకైన మద్యం అక్కడి హోటల్ పరిశ్రమ, రిసార్ట్ బుకింగ్స్‌కు అదనపు బూస్ట్ ఇస్తుంది.
ప్రతి రాష్ట్రంలో ధర ఎందుకు మారుతుంది?
మద్యం GST పరిధిలో లేదు, కాబట్టి కేంద్ర ప్రభుత్వం కాకుండా ప్రతి రాష్ట్రం దాని స్వంత పన్ను రేటును నిర్ణయిస్తుంది. ఎక్సైజ్ సుంకం, రవాణా ఛార్జీలు, రిటైల్ మార్జిన్ వంటి అంశాలు ధరపై ప్రభావం చూపుతాయి. కొన్ని రాష్ట్రాలు అధిక ఆదాయం కోసం పన్నులు పెంచుతాయి. మరికొన్ని పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు తగ్గిస్తాయి. ఈ విధంగా ప్రతి రాష్ట్రంలో ఒకే బ్రాండ్ మద్యం కూడా వేర్వేరు ధరలకు లభిస్తుంది.
తక్కువ ధరల వెనక వ్యూహం
గోవా, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల ప్రధాన ఉద్దేశ్యం పర్యాటకాన్ని పెంచడం, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడం. చౌకైన మద్యంతో దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా వస్తారని వారు నమ్ముతున్నారు. అయితే ఈ రాష్ట్రాలు మద్యం రవాణాపై పరిమితులు కూడా విధించాయి. గోవా నుంచి ఇతర రాష్ట్రాలకు నిర్ణీత పరిమితికి మించి మద్యం తీసుకెళ్లడం క్రిమినల్ నేరంగా పరిగణిస్తారు.