ఇస్రో బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్.. కక్ష్యలోకి సీఎంఎస్-03 ఉపగ్రహం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా అత్యంత బరువైన సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

బాహుబలి రాకెట్ తో ఇస్రో మరో రికార్డు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుతమైన విజయాన్ని సాధించింది. బాహుబలి రాకెట్ గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్‌ను ఉపయోగించి, భారత నేవీ కోసం రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం సీఎంఎస్-03ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఆదివారం సాయంత్రం 5.26 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. 43.5 మీటర్ల పొడవు, 642 టన్నుల బరువున్న ఈ భారీ రాకెట్ నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్లింది.
Kudos Team #ISRO!
India’s #Bahubali scales the skies, with the successful launch of #LVM3M5 Mission!
“Bahubali” as it is being popularly referred, LVM3-M5 rocket is carrying the CMS-03 communication satellite, the heaviest ever to be launched from the Indian soil into a… pic.twitter.com/ccyIPUxpIX— Dr Jitendra Singh (@DrJitendraSingh) November 2, 2025
భారత నేవీకి ఇస్రో సాంకేతిక సహకారం
CMS-03 ఉపగ్రహం (లేదా GSAT-7R) ప్రత్యేకంగా భారత నావికాదళం అవసరాల కోసం రూపొందించారు. ఇది నౌకాదళ కమ్యూనికేషన్ వ్యవస్థలను మరింత ఆధునికంగా, భద్రంగా మార్చడమే కాకుండా, సముద్ర నిఘా సామర్థ్యాలను కూడా గణనీయంగా పెంచుతుంది.
ఈ ఉపగ్రహం ద్వారా హిందూ మహాసముద్రం సహా విస్తారమైన సముద్ర ప్రాంతాల్లోని నౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాల మధ్య నిరంతర కమ్యూనికేషన్ కొనసాగుతుంది. సీ, ఎక్స్‌టెండెడ్ సీ, క్యూ బ్యాండ్లలో సిగ్నల్ ప్రసార సామర్థ్యం ఉండటంతో వాయిస్, డేటా, వీడియో లింకులు మరింత సురక్షితంగా ఉంటాయి.
భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయి
సుమారు 4,410 కిలోల బరువున్న CMS-03 భారతదేశం నుంచి ఇప్పటివరకు ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో అత్యంత బరువైనది. ఈ విజయంతో ఇస్రో కొత్త మైలురాయిని అందుకుంది. భారత భూభాగం మాత్రమే కాకుండా సముద్ర ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలు, వ్యూహాత్మక కమ్యూనికేషన్ వ్యవస్థలు మరింత బలపడనున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశ భద్రతా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయని ఇదివరకు నిపుణులు పేర్కొన్నారు.
What a moment! #LVM3M5 lifts off with #CMS03, marking another milestone in India’s space journey. Relive the liftoff highlights pic.twitter.com/HOPEvYYljK
— ISRO (@isro) November 2, 2025
ఎల్‌వీఎం3 సిరీస్‌లో 8వ విజయం
ఇస్రో చైర్మన్ నారాయణన్ ఈ విజయాన్ని సగర్వంగా ప్రకటించారు. “LVM3 సిరీస్‌లో ఇది 8వ సక్సెస్. చంద్రయాన్-3 మిషన్‌లో ఈ రాకెట్ విజయవంతంగా ల్యాండర్, రోవర్‌ను చంద్రుడిపై దింపింది. ఇప్పుడు CMS-03 ప్రయోగంతో మరో అద్భుతం సాధించింది” అని ఆయన అన్నారు.
క్రియోజనిక్ ఇంజిన్ “రీ-ఇగ్నైట్” టెక్నాలజీని ఈసారి విజయవంతంగా ప్రయోగించడం ఇస్రోకు మరో కీలక దశగా నిలిచింది. శాస్త్రవేత్తల సమిష్టి కృషితోనే ఈ సక్సెస్ సాధ్యమైందని ఆయన ప్రశంసించారు.
Congratulations India, @isro has successfully launched the heaviest GEO communication satellite from Indian soil. The Indian space sector is soaring high to provide valuable services to the user community in and around the Indian region.
- Dr. V. Narayanan
Secretary,…— ISRO (@isro) November 2, 2025
భవిష్యత్తు ప్రయోగాలకు CMS-03
ఈ ఉపగ్రహం సుమారు 10 సంవత్సరాలపాటు కక్ష్యలో తిరుగుతూ సేవలు అందించనుంది. ప్రధానంగా రక్షణ రంగం, సముద్ర పర్యవేక్షణ, వ్యూహాత్మక కమ్యూనికేషన్ రంగాల్లో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది.
అలాగే గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మెరుగైన ఇంటర్నెట్, డేటా ట్రాన్స్‌మిషన్ సదుపాయాలను విస్తరించడంలో ఇది సహాయపడుతుంది. ఈ సక్సెస్‌ఫుల్ లాంచ్ ద్వారా ఇస్రో భారత అంతరిక్ష సామర్థ్యాలను ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.
ఇస్రో శాస్త్రవేత్తల కృషి, సాంకేతిక నైపుణ్యం దేశ గర్వకారణం. బాహుబలి రాకెట్ ప్రయోగ విజయంతో భారత్ అంతరిక్షరంగంలో మరో మెట్టెక్కింది. ఈ విజయంతో భారత రక్షణ వ్యవస్థ మరింత శక్తివంతమైందని చెప్పడం అతిశయోక్తి కాదనీ, CMS-03 ఉపగ్రహం కేవలం కమ్యూనికేషన్ శాటిలైట్ మాత్రమే కాదు.. ఇది భారత్ అంతరిక్ష శక్తిని ప్రపంచానికి తెలియజేసే సాక్ష్యంగా నిలిచిందని నిపుణులు పేర్కొంటున్నారు.