భారత్‌కు పొంచి ఉన్న భారీ ముప్పు : 61 శాతం దేశం డేంజర్ జోన్‌లోనే !
India New Earthquake Map: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ విడుదల చేసిన కొత్త భూకంప మ్యాప్‌లో హిమాలయాలను అత్యంత ప్రమాదకరమైన జోన్ VIలో చేర్చారు. దశాబ్దాల తర్వాత జరిగిన ఈ భారీ మార్పుతో దేశంలోని 61 శాతం భూభాగం ప్రమాదకర భూకంప జోన్ల పరిధిలోకి వచ్చింది.

భారత భవిష్యత్తు ప్రమాదంలో ఉందా? దేశాన్ని కదిలిస్తున్న తాజా పరిణామాలు
India New Earthquake: భారత భవిష్యత్తు ప్రమాదంలో ఉందా? అంటే అవుననే సమాధానాలతో భారత భౌగోళిక చరిత్రలోనే ఇది కీలక మలుపు. దేశంలో భూకంప ముప్పు అంచనాలకు సంబంధించి దశాబ్దాల తర్వాత అత్యంత భారీ మార్పు చోటుచేసుకుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) విడుదల చేసిన కొత్త 'సెస్మిక్ జోన్ మ్యాప్' (Seismic Map) ఆందోళనకర విషయాలను వెల్లడించింది.
ప్రశాంతంగా కనిపించే హిమాలయ పర్వత శ్రేణి మొత్తాన్ని తొలిసారిగా అత్యంత ప్రమాదకరమైన జోన్ VI (Zone VI) పరిధిలోకి చేర్చారు. అంతేకాదు, దేశంలోని 61 శాతం భూభాగం ఇప్పుడు మధ్యస్థం నుండి అధిక ప్రమాదకర జోన్ల పరిధిలోకి రావడం కొత్త చర్చకు తెరలేపింది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సవరించిన ఎర్త్‌క్వేక్ డిజైన్ కోడ్‌లో భాగంగా ఈ కొత్త మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, మొత్తం హిమాలయ పర్వత శ్రేణిని తొలిసారిగా కొత్తగా ప్రవేశపెట్టిన అత్యంత ప్రమాదకరమైన జోన్ 4 పరిధిలోకి వచ్చింది. గత కొన్ని దశాబ్దాలలో భూకంప ప్రమాద అంచనాలలో ఇదే అత్యంత ముఖ్యమైన మార్పుగా చెప్పవచ్చు.
హిమాలయాలతో భారత్ కు ముప్పుందా?
గతంలో ఉన్న మ్యాప్‌ల ప్రకారం, హిమాలయ ప్రాంతం జోన్ IV, జోన్ Vలలో విడివిడిగా ఉండేది. అక్కడ ముప్పు స్థాయి సమానంగా ఉన్నప్పటికీ, వర్గీకరణలో వ్యత్యాసం ఉండేది. అయితే, తాజా మ్యాప్‌లో హిమాలయ బెల్ట్ మొత్తానికి ఒకటే గ్రూప్ ను ఇచ్చారు.
పాత మ్యాప్‌లు సుదీర్ఘకాలంగా చీలిపోని ఫాల్ట్ సెగ్మెంట్ (fault segments)ల నుండి పొంచి ఉన్న ప్రమాదాలను తక్కువగా అంచనా వేశాయని నిపుణులు గుర్తించారు. ముఖ్యంగా మధ్య హిమాలయాల్లో గత రెండు శతాబ్దాలుగా ఉపరితలం చీలిపోయే స్థాయి భారీ భూకంపం రాలేదు. దీనివల్ల అక్కడ భూగర్భంలో భారీగా శక్తి నిల్వ ఉండే అవకాశం ఉందనీ, ఇది భవిష్యత్తులో పెద్ద ముప్పుకు దారితీయవచ్చని తాజా అంచనాలు సూచిస్తున్నాయి.
హిమాలయాలు ఎందుకు ప్రమాదంలో ఉన్నాయి?
ప్రపంచంలోనే అత్యంత చురుకైన టెక్టోనిక్ ఘర్షణ సరిహద్దులపై (tectonic collision boundaries) హిమాలయాలు ఉన్నాయి. అందుకే ఇవి భారతదేశంలో అత్యంత భూకంప ప్రమాదం ఉన్న జోన్‌లో ఉన్నాయి.
ప్లేట్ల కదలిక: ఇండియన్ ప్లేట్ నిరంతరం యురేషియన్ ప్లేట్‌లోకి సంవత్సరానికి దాదాపు ఐదు సెంటీమీటర్ల వేగంతో చొచ్చుకుపోతోంది. ఈ బలమైన కదలిక వల్లే హిమాలయాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పటికీ పైకి లేస్తూనే ఉన్నాయి.
ఒత్తిడి, శక్తి విడుదల: ఈ నిరంతర ఘర్షణ భూమి పొరలలో అపారమైన ఒత్తిడిని పెంచుతుంది. ఆ ఒత్తిడి ఒక్కసారిగా విడుదలైనప్పుడు, అది శక్తివంతమైన భూకంపాలను వచ్చేలా చేస్తుంది.
భౌగోళిక అస్థిరత: ఈ ప్రాంతం భౌగోళికంగా ఇంకా యంగ్ దశలో ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అంటే ఇక్కడి రాళ్లు ఇంకా సర్దుబాటు అవుతూ, మడతలు పడుతూ, విరిగిపోతూ ఉన్నాయి. ఇది పర్వతాలను మరింత అస్థిరంగా మారుస్తోంది.
ప్రధాన ఫాల్ట్ సిస్టమ్స్: హిమాలయ శ్రేణి కింద మెయిన్ ఫ్రంటల్ థ్రస్ట్, మెయిన్ బౌండరీ థ్రస్ట్, మెయిన్ సెంట్రల్ థ్రస్ట్ వంటి అనేక ప్రధాన ఫాల్ట్ సిస్టమ్స్ నడుస్తున్నాయి. ఇవి ఒక్కొక్కటి భారీ భూకంపాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.
శతాబ్దాలుగా భారీ భూకంపాలు సంభవించని 'సిస్మిక్ గ్యాప్స్'ను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ గణనీయమైన శక్తి నిల్వ ఉందని, ఈ కారకాలన్నీ కలిసి హిమాలయాలను ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రమాదకర ప్రాంతాలలో ఒకటిగా మార్చాయని చెబుతున్నారు.
India New Earthquake Map లో వచ్చిన ప్రధాన మార్పులు ఏమిటి?
కొత్త అప్‌డేట్‌లో హిమాలయన్ ఫ్రంటల్ థ్రస్ట్ వెంబడి చీలికలు దక్షిణం వైపు విస్తరించే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల డెహ్రాడూన్, మోహండ్ వంటి ప్రాంతాలకు కూడా ప్రమాదం విస్తరించింది.
ఔటర్ హిమాలయాల రీక్లాసిఫికేషన్: జనసాంద్రత కలిగిన పర్వత ప్రాంతాలను ఖండించే ఫాల్ట్స్ ఉన్న ఔటర్ హిమాలయాలను తిరిగి వర్గీకరించారు.
సరిహద్దు పట్టణాలకు హెచ్చరిక: రెండు జోన్ల సరిహద్దులో ఉన్న పట్టణాలను ఇకపై డిఫాల్ట్‌గా అధిక ప్రమాదకర జోన్‌లోకి తీసుకుంటారు. పరిపాలనా సౌలభ్యం కంటే భౌగోళిక వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.
కఠిన నిబంధనలు: ఈ మార్పుల వల్ల ప్లానర్లు, ఇంజనీర్లు భవనాలు, వంతెనలు సహా ఇతర పట్టణ ప్రాజెక్టుల కోసం కఠినమైన ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.
మౌలిక సదుపాయాలు, భవిష్యత్తుపై ప్రభావం
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల వంటి అధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాల కింద భూగర్భ ఒత్తిడి పెరుగుతున్నట్లు ఈ మ్యాప్ స్పష్టం చేస్తోంది. ఇది కొనసాగుతున్న ఇండియన్-యురేషియన్ ప్లేట్ ఘర్షణను ప్రతిబింబిస్తుంది.
ఈ నేపథ్యంలో, మృదువైన అవక్షేపాలు (soft sediments) లేదా యాక్టివ్ ఫాల్ట్స్ ఉన్న ప్రాంతాల్లో విస్తరణ పనులను నిలిపివేయాలనీ, ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను రెట్రోఫిటింగ్ చేయాలని కొత్త నిబంధనలు డిమాండ్ చేస్తున్నాయి. పెరుగుతున్న పట్టణీకరణ మధ్య ఈ ఏకీకృత వర్గీకరణ విపత్తుల నుండి కోలుకునే సామర్థ్యాన్ని పెంచే దిశగా ఒక ముందడుగు అని నిపుణులు ప్రశంసిస్తున్నారు. అధునాతన మోడలింగ్ ఆధారంగా రూపొందించిన ఈ మ్యాప్, దేశవ్యాప్తంగా విపత్తు సన్నద్ధతను పునఃసమీక్షించుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది.

