- Home
- National
- Success Story : అనాధాశ్రమంలో పెరిగిన ఓ క్లీనర్, పేపర్ భాయ్ ఇప్పుడు ఐఏఎస్... ఇదికదా సక్సెస్ అంటే
Success Story : అనాధాశ్రమంలో పెరిగిన ఓ క్లీనర్, పేపర్ భాయ్ ఇప్పుడు ఐఏఎస్... ఇదికదా సక్సెస్ అంటే
అనాధాశ్రమంలో పెరిగిన ఓ బాలుడు... క్లీనర్ గా, పేపర్ భాయ్ గా పనిచేసిన యువకుడు... దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగం ఐఏఎస్ వరకు ఎలా చేరుకున్నాడు. అబ్దుల్ నజర్ IAS స్ఫూర్తిదాయక విజయగాథ.

ఓ ఐఏఎస్ స్ఫూర్తిదాయక విజయగాథ
పేరుచివర IAS, IPS అనే పదాలుండాలని చాలామంది కలలు కంటారు... కానీ అతి తక్కువమంది ఆ కలను నిజం చేసుకుంటారు. ఇవి చూడ్డానికే మూడు అక్షరాలే కావచ్చు... కానీ వీటిని పొందాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. దేశంలోనే అత్యంత కఠినమైన రాత పరీక్షలో టాప్ ర్యాంకులు సాధించాలి... ఇంటర్వ్యూలో ప్రతిభ చూపించాలి.. అయితేనే ఈ కల నెరవేరుతుంది. కానీ ఇవేమీ లేకుండా నేరుగా ఐఎఎస్ సాధించాడో నిరుపేద యువకుడు.
పేదరికంలో పుట్టిపెరిగిన అబ్దుల్ నాజర్ UPSC లేకుండానే IAS గా ఎలా మారాడు? ఇది సాధించేందుకు ఎన్ని కష్టాలు దాటుకుంటూ వచ్చాడు? ఆదర్శవంతంగా సాగిన అతడి IAS జర్నీ, సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అబ్దుల్ నాజర్ వ్యక్తిగత జీవితం
నిరుపేద కుటుంబంలో పుట్టిన అబ్దుల్ నాజర్ జీవితం చిన్న వయసునుండే కష్టాలతో నిండి ఉంది. ఆయన ఐదేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయారు. దీంతో కుటుంబ భారం తల్లిపై పడింది... ఆమె బిడ్డలను పోషించడానికి ఇళ్లలో పనిమనిషిగా చేసేవారు. ఎంత కష్టపడుతున్నా పిల్లలకు మంచి అహారం, చదువు అందించలేకపోతున్నానని భావించిన ఆ తల్లి అబ్దుల్ నాజర్ తో పాటు మిగతా పిల్లలను ఓ అనాధాశ్రయంలో వేసింది. ఇలా దాదాపు 13 సంవత్సరాలు కేరళలోని అనాధాశ్రమంలో గడపారు నాజర్.
క్లీనర్, పేపర్ భాయ్ గా నాజర్ జర్నీ..
చిన్నతనంలో తోటి పిల్లలతో కలిసి ఆడుకోవాల్సిన వయసులో నాజర్ కుటుంబపోషణ భారాన్ని నెత్తినెత్తుకున్నారు. క్లీనర్ గా, డెలివరీ బాయ్‌గా పని చేశారు... ఇలా పనులు చేస్తూనే చదువుకున్నాడు. తన చదువు కొనసాగించేందుకు పేపర్ భాయ్ గా కూడా మారారు ... తర్వాత ఇతర విద్యార్థులకు ట్యూషన్లు చెప్పడం, ఫోన్ ఆపరేటర్‌గా పనిచేశారు. ఇలా ఎన్నో పనులు చేసి తన చదువు, ఇంటి ఖర్చులకు డబ్బులు సంపాదించేవారు. ఇలా కుటుంభాన్ని పోషిస్తూనే చదువు కొనసాగించారు నాజర్.
కష్టాల నుండి సక్సెస్ వైపు పయనం
ఐఏఎస్ అధికారిగా ఎదగాలంటే తప్పనిసరిగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సిందే అనేది సాధారణ అభిప్రాయం. అబ్దుల్ నాజర్ జీవితం ఈ అభిప్రాయానికి భిన్నమైన ఉదాహరణ. కష్టాల నడుమ పెరిగిన అతడు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (PSC) ద్వారా ప్రభుత్వ సేవలో చేరి, ప్రతిభతో చివరకు ఐఏఎస్ అధికారిగా ఎదిగారు. అంటే యూపిఎస్సి ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకుండానే ఐఏఎస్ గా మారారన్నమాట.
ప్రభుత్వ సేవలో నాజర్ కెరీర్ హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా మొదలైంది. చాలామందికి ఇది గౌరవప్రదమైన ఉద్యోగం... కానీ నాజర్ అక్కడే ఆగిపోలేదు.. చాలా పెద్ద కలగన్నారు. యూపిఎస్సి ప్రిపరేషన్ కు అవకాశాలు లేకపోవడంతో రాష్ట్ర పీఎస్సీ పరీక్షల ద్వారా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఎంతో కష్టపడి చదవి రాష్ట్ర సివిల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు అర్హత సాధించి 2006లో డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు.
చివరకు ఐఏఎస్ సాధించేశారు...
తన కృషి, అంకితభావంతో ఆయన పదోన్నతులు పొందుతూ ముందుకు సాగారు. చివరికి ఐఏఎస్ నిబంధనల ప్రకారం అద్భుతమైన పనితీరు ఆధారంగా ఆయనను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లోకి ప్రమోట్ చేశారు. ఇలా సొంత రాష్ట్రంలోనే ఐఏఎస్ గా అత్యున్నత స్థాయిని పొందారు. 2019 నుంచి 2021 వరకు కొల్లం జిల్లా కలెక్టర్‌గా, ప్రస్తుతం కేరళ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్‌లో సెక్రటరీగా సేవలందిస్తున్నారు.
తన కృషి, పట్టుదలతో అనాథాశ్రమం నుంచి కలెక్టర్ వరకు చేరిన నాజర్ జీవన గాథ చాలామందికిి స్ఫూర్తినిస్తుంది. ఇది ఒక సాధారణమైన కల సాధించడానికి కూడా అవకాశాలు లేని ఓ యువకుడు ఎంతటి అద్భుత విజయాన్ని సాధించాడో తెలియజేస్తుంది. ఎన్ని అడ్డంకులున్నా వాటిని దాటుకుని లక్ష్యం వైపు ఎలా సాగాలో నాజర్ IAS జీవితమే ఉదాహరణ... ఆయన సక్సెస్ స్టోరీ నేటి యువతరానికి ఆదర్శం.