- Home
- National
- హనీట్రాప్ : రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని మోసం చేసి.. రూ. 82 లక్షలు దోపిడీ.. ముగ్గురి అరెస్ట్..
హనీట్రాప్ : రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని మోసం చేసి.. రూ. 82 లక్షలు దోపిడీ.. ముగ్గురి అరెస్ట్..
రిటైర్డ్ ప్రభుత్వోద్యోగిని హనీట్రాప్ చేసిన ఓ ఇద్దరు మహిళలు అతని నుంచి రూ. 82 లక్షలు వసూలు చేశారు. మరో రూ.42 లక్షలు డిమాండ్ చేశారు.

బెంగళూరు : మహిళలతో స్నేహం ఎంత ఖరీదో ఈ ఘటన చెబుతుంది. కర్నాటకలోని బెంగళూరులో ఓ రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి ఇద్దరు మహిళల హనీట్రాప్ లో చిక్కుకుని రూ. 82 లక్షలు మోసపోయాడు. 60 ఏళ్ల ఈ రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిని మోసం చేసిన రీనా అన్నమ్మ (40), స్నేహ (30), స్నేహ భర్త లోకేష్ (26) అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీనగర్ నివాసి నరేష్ (పేరు మార్చాం) జయనగర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఇలా పేర్కొన్కారు. తన స్నేహితులలో ఒకరు తనకు ఏప్రిల్‌లో అన్నమ్మతో పరిచయం చేసాడు. అన్నమ్మకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అతను క్యాన్సర్‌తో బాధపడుతున్నాడని ఆర్థికంగా ఏదైనా సహాయం చేయాలని అతని స్నేహితుడు సిఫార్సు చేశాడు.
నరేష్, అన్నమ్మలు ఓ హోటల్‌లో కలుసుకున్నారు. నరేష్ అదే రోజు ఆమెకు రూ.5వేలు ఇచ్చాడు. ఆ తరువాత కూడా ఆమె ఏదో ఒక కారణం చూపుతూ అతని నుండి కొన్ని వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. మే మొదటి వారంలో, అన్నమ్మ నరేష్ ను ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని హుస్కూర్ గేట్‌లోని ఒక హోటల్‌కు రావాల్సిందిగా కోరింది.
అక్కడ కాసేపు మాట్లాడుకున్న తరువాత.. తనతో శృంగారంలో పాల్గొనమని అన్నమ్మ కోరిందని, అయితే, తాను నిరాకరించానని నరేష్ పేర్కొన్నాడు. దీంతో ఆమె తనను బెదిరించి.. బలవంతంగా లైంగిక సంబంధం పెట్టుకుందని, వీరిద్దరూ అదే హోటల్‌లో మరికొన్ని సార్లు వ్యక్తిగతంగా గడిపారని అతను పేర్కొన్నాడు.
ఆ తరువాత.. అన్నమ్మ తన స్నేహితురాలు స్నేహను అతనికి పరిచయం చేసింది. ఆమె కూడా అతని నుండి డబ్బు తీసుకోవడం ప్రారంభించింది. అన్నమ్మ తన దగ్గర.. నరేష్ తో గడిపిన ఏకాంతసమయానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది.
ఆ తర్వాత స్నేహ కూడా ఆ వీడియోలను బంధువులకు పంపుతానని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. అంతేకాదు స్నేహ అలాంటి కొన్ని వీడియోలను వాట్సాప్‌లో నరేష్ కు పంపి.. 75 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో భయపడిపోయిన నరేష్ తన ప్రావిడెంట్ ఫండ్ నుంచి రూ.82 లక్షలు విత్ డ్రా చేసి అన్నమ్మ, స్నేహలకు బదిలీ చేశాడు. దోపిడీ గురించి ఎవరికైనా చెబితే నరేష్ కుమార్తెపై అత్యాచారం చేయిస్తామని ఇద్దరూ బెదిరించారు.
అయితే కొద్దిరోజుల తర్వాత మహిళలు మరో రూ.42 లక్షలు డిమాండ్ చేశారు. వేధింపులు భరించలేక నరేష్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో దోపిడీ, నేరపూరిత బెదిరింపు, ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం వంటి అభియోగాల కింద కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి బ్యాంకు ఖాతాలో సుమారు రూ. 25 లక్షలను స్తంభింపజేశామని, దాదాపు 300 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని, ముగ్గురూ కొడగుకు చెందినవారని డీసీపీ (సౌత్) పి కృష్ణకాంత్ తెలిపారు. ఈ ముగ్గురూ మరికొంత మంది పురుషులను మోసం చేసిన అలవాటైన నేరస్థులుగా కనిపిస్తున్నారని, అయితే ఎలాంటి ఫిర్యాదులు నమోదు కాలేదని ఆయన తెలిపారు.
లోకేష్ మడికేరిలోని ఓ ఎస్టేట్‌లో పనిచేస్తుండగా, స్నేహ ఏడాది పాప తల్లి. తన భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడని అన్నమ్మ చెబుతోంది. ఆ తర్వాత మగవాళ్లతో స్నేహం చేసి దోచుకోవడం మొదలుపెట్టింది. ఇద్దరు మహిళల నేర కార్యకలాపాలకు లోకేశ్ భాగస్వామి అని పోలీసులు తెలిపారు.