విగ్గుతో బట్టతల కవర్ చేసి రెండో పెళ్లి.. విగ్గు పీకి, చితకబాదిన బంధువులు...
ఓ వ్యక్తి పెళ్లైన సంగతి దాచిపెట్టి రెండో పెళ్లికి సిద్ధపడ్డాడు. అయితే, తనకు బట్టతల అనే విషయాన్ని కూడా దాచాడు. అనుమానం రావడంతో బట్టతలతో పాటు, మొదటి పెళ్లి ముచ్చటా బయటపడింది.

బీహార్ : బీహార్లో ఓ విచిత్రమైన ఘటన అందరిని అవాక్కయ్యేలా చేసింది. ఓ పెళ్లి మండపంలో రసాబసా చెలరేగింది. బంధువులంతా పెళ్లికొడుకును ఓ రౌండ్ కుమ్మేశారు.
దీనికి కారణం ఏంటయ్యా అంటే.. ఆ పెళ్లి కొడుకు తనకు బట్టతల ఉందన్న విషయాన్ని దాచిపెట్టి.. విగ్గు పెట్టుకొని పెళ్లికూతురు తరపు వారిని మోసం చేశాడు.
అంతేకాదు, అతనికి అంతకుముందే పెళ్లి కూడా అయిందట. ఈ విషయం పెళ్లికూతురి తరపు వారికి తెలిసింది. దానితోపాటు ఆ పెళ్లి కొడుకు విగ్గు పెట్టుకుని పెళ్లి మండపానికి వచ్చాడు. ముందు ఈ విషయం ఎవరికీ తెలియదు.
పెళ్లికూతురు తరపు వారికి ఎందుకో అతని జుట్టు మీద అనుమానం వచ్చింది. గుసగుసలు మొదలయ్యాయి. ఆరా తీయగా.. అది అతనికి రెండో పెళ్ళని.. అతనిది అసలైన జుట్టు కాదని…విగ్గు పెట్టుకున్నాడని తేలింది.
దీంతో… వధువు బంధువులు తీవ్ర అగ్రహావేషాలకు లోనయ్యారు.. ఆ రెండో పెళ్లి కొడుకు.. విగ్గు పెళ్ళికొడుకుని చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక తాను చేసింది తప్పేనని అతను ఒప్పుకున్నాడు. ఎంతగానో ప్రాధేయపడ్డాడు.
భర్త రెండో పెళ్లి విషయం తెలిసిన మొదటి భార్య కూడా అక్కడికి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ్రామ పెద్దల సమక్షంలో దీని మీద పంచాయతీ పెట్టారు. సమస్యను పరిష్కరించినట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో ఏ తీర్పు ఇచ్చారో తెలియలేదు.