- Home
- National
- భటిండా ఆర్మీ క్యాంప్ దాడి : నలుగురు జవాన్లను కాల్చింది తోటి సైనికుడే, వ్యక్తిగత కారణాలతోనే కాల్పులు.. అరెస్ట్
భటిండా ఆర్మీ క్యాంప్ దాడి : నలుగురు జవాన్లను కాల్చింది తోటి సైనికుడే, వ్యక్తిగత కారణాలతోనే కాల్పులు.. అరెస్ట్
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన భటిండా మిలటరీ స్థావరంలో కాల్పుల ఘటనలో ఓ జవాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కారణాలతో అతనే తోటి సైనికులను చంపాడని తెలిపారు.
పంజాబ్ : గత బుధవారం పంజాబ్లోని భటిండా సైనిక స్థావరంలో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన సైనిక స్థావరం మీద కాల్పులు చోటు చేసుకోవడంతో ఈ ఘటనలో పంజాబ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాల్పులకు బాధ్యుడిగా ఓ జవాన్ ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు భటిండా సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా తెలిపారు. ఈ కాల్పుల కేసులో మొదట తమను తప్పుదోవ పట్టించిన సైనికుడే అసలు నిందితుడని వెల్లడించారు.
అతనే కాల్పులకు పాల్పడినట్లు గుల్నీత్ సింగ్ తెలిపారు. మోహన్ దేశాయ్ అనే నిందితుడు సైనిక స్థావరంలో గన్నర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడిని ఈ కేసులో అరెస్టు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. కాల్పులకు దారి తీసిన కారణాలు వ్యక్తిగతమైనవని తెలిపారు. మోహన్ దేశాయ్ కి కాల్పుల్లో మృతి చెందిన జవాన్లతో వ్యక్తిగత కక్షలు ఉన్నాయని ఎస్ఎస్పి తెలిపారు.
భటిండా సైనిక స్థావరంలో ఏప్రిల్ 12వ తేదీ తెల్లవారుజామున కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు. దీని మీద పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మేజర్ ఆశుతోష్ శుక్లా ఈ ఘటనలో సాక్షిగా ఉన్నారు. ఆయన వాంగ్మూలం ఆదారంగా పంజాబ్ పోలీసులు ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆదివారం నాడు అనుమానితులుగా భావిస్తున్న నలుగురు జవాన్లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలోనే మోహన్ దేశాయ్ ని కూడా విచారించారు. పోలీసుల విచారణలో మోహన్ దేశాయ్ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. తన సహోదయోగులను వ్యక్తిగత తగాదాల కారణంగానే కాల్చి చంపినట్లుగా దేశాయ్ అంగీకరించాడని తెలిపారు. నలుగురు జవాన్లు మిలిటరీ స్టేషన్లోని శతఘ్ని డిపార్ట్మెంట్ కి చెందిన బ్యారెక్స్ లో నిద్రిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో మోహన్ దేశాయ్… ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లడం తాను చూసానని పోలీసులకు తెలిపాడు. కాల్పుల తర్వాత.. ముఖానికి మాస్కులు పెట్టుకుని, కుర్తా పైజామా వేసుకుని.. ఇద్దరు వ్యక్తులు ఆ బ్యారక్ నుంచి బయటికి వచ్చినట్లు తాను చూసానని చెప్పాడు. నిందితుల చేతుల్లో గొడ్డలి, ఇన్సాస్ రైఫిల్ ఉందని కూడా చెప్పుకొచ్చాడు.
ఈ కాల్పుల ఘటనలో చనిపోయిన వారిలో ఇద్దరు కర్ణాటక కు చెందిన వారు.. కాగా మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన జవాన్లు. వీరి పేర్లు జె. యోగేష్ కుమార్ (24), సాగర్ బన్నీ (25), సంతోష్ ఏం నగరాల్ (25), ఆర్ కమలేష్ (24)లు మృతి చెందారు. దేశంలోని అతిపెద్ద సైనిక స్థావరంలో భటిండా స్థావరం ఒకటి. ఇక్కడ పదవ కోర్ కమాండ్ కు చెందిన దళాలు ఉంటాయి. ఇది జైపూర్ కేంద్రంగా పనిచేసే సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఆధీనంలో ఈ స్థావరం పనిచేస్తుంది . ఈ స్థావరంలో అనేక కీలక పరికరాలు, పెద్ద సంఖ్యలో ఆపరేషన్ ఆర్మీ యూనిట్లు ఉంటాయి.