ఈ ఉద్యోగం చేస్తున్న వారిలోనే వివాహేతర సంబంధాలు ఎక్కువంటా.. సర్వేలో విస్తుపోయే నిజాలు
Extra marital affair: ఇటీవలి కాలంలో విడాకులు పెరిగిపోతున్నాయి. మెజారిటీ విడాకుల్లో వివాహేతర సంబంధాలే కారణమవుతోంది. తాజాగా గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వివాహేతర సంబంధాలకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గ్లీడెన్ సంస్థ సర్వేలో షాకింగ్ వివరాలు
‘గ్లీడెన్’ (Gleeden) అనే అంతర్జాతీయ డేటింగ్ సంస్థ తాజాగా చేసిన సర్వేలో భారతదేశంలో వివాహేతర సంబంధాలు వేగంగా పెరుగుతున్నాయని వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం, బెంగళూరు నగరం దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ముంబయి, కోల్‌కతా, ఢిల్లీ, పుణె నగరాలు వరుసగా రెండో నుంచి ఐదో స్థానాల్లో ఉన్నాయి. ఈ పట్టణాల్లో నివసించే చాలా మంది తమ వివాహ బంధాన్ని విస్మరిస్తూ ఇతరులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని గ్లీడెన్ నివేదిక చెబుతోంది.
కుటుంబ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
వివాహేతర సంబంధాల పెరుగుదల కారణంగా దేశవ్యాప్తంగా విడాకులు, కుటుంబ కలహాలు గణనీయంగా పెరుగుతున్నాయి. భార్యాభర్తల మధ్య నమ్మకం క్షీణించడం, పిల్లలపై మానసిక ఒత్తిడి పెరగడం, కుటుంబ వ్యవస్థపై సమాజంలో ప్రతికూల దృక్పథం రావడం వంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మార్పులు భారతీయ కుటుంబ విలువలకు ప్రమాదంగా మారుతున్నాయని వారు చెబుతున్నారు.
ఈ రంగాల్లోనే ఎక్కువ
గ్లీడెన్ సర్వేలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఐటీ, మెడికల్ రంగాల్లో పని చేసే ఉద్యోగులే వివాహేతర సంబంధాలకు ఎక్కువగా లోనవుతున్నారని నివేదిక పేర్కొంది. నిరంతరం పని ఒత్తిడి, టైమ్ లేకపోవడం, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం తగ్గిపోవడం వంటి కారణాల వల్ల వీరు వేరే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రధాన కారణాలు
ఉద్యోగ ఒత్తిడి, కుటుంబానికి సమయం ఇవ్వకపోవడం, భావోద్వేగ దూరం వంటి అంశాలే ప్రధాన కారణాలని ఈ అధ్యయనం గుర్తించింది. భాగస్వామి మనసు అర్థం చేసుకోవడంలో విఫలమవడం, మాటల ద్వారా ప్రేమాభిమానాలను వ్యక్తం చేయకపోవడం వల్ల వారు ఒంటరితనానికి గురవుతున్నారు. ఈ ఒంటరితనం వారిని వేరే వ్యక్తుల వైపు నడిపిస్తోందని నివేదిక స్పష్టంగా చెబుతోంది.