చాట్ జిపిటి, డీప్ సీక్ కు పోటీనిచ్చేది ఇండియానే ... ఏఐ టెక్నాలజీలో ఇక అద్భుతాలే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అద్భుతాలు సృష్టించేందుకు భారత్ సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే చాట్ జిపిటి, డీప్ సీక్ వంటివాటికి పోటీగా సొంత టెక్నాలజీని రూపొందించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం ఏఐ అభివృద్దికి బడ్జెట్ 2025లో ఎంత కేటాయించారో తెలుసా?

Artificial intelligence (AI)
Artificial intelligence (AI) : చందమామ రావే అంటూ పాడుకునే రోజులనుండి చంద్రుడిపైకి చేరుకునే స్థాయికి మనిషి చేరుకున్నాడు... ఇందుకు అత్యాధునికి టెక్నాలజీ అందుబాటులోకి రావడమే కారణం. రోజురోజుకు టెక్నాలజీ మరింత విస్తరిస్తోంది...కొత్తపుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీ మారుతోంది... కొత్తకొత్త అద్భుతాలను సృష్టింస్తోంది. ఇలా టెక్నాలజీ సృష్టించిన అద్భుతమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ).
ఇప్పటికి భవిష్యత్ ఏఐదే అని గుర్తించిన అమెరికా, చైనా వంటి దేశాలు ఆ టెక్నాలజీపై దృష్టిపెట్టారు. ఇలా పుట్టుకువచ్చినవే చాట్ జిపిటి, డీప్ సీక్ ... గూగుల్, మైక్రోసాప్ట్, మెటా వంటి దిగ్గజ సంస్థలుసైతం ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇలా ప్రస్తుతం అభివృద్ది చెందిన అనేక దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అద్భుతాలు చేసేందుకు సిద్దమయ్యారు. ఈ జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కోసం భారీగా నిధులు కేటాయించారు. రూ.500 కోట్లను ఈ ఏఐ టెక్నాలజీ అభివృద్దికి కేటాయించింది కేంద్రం. విద్యారంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Artificial intelligence (AI)
అమెరికా,చైనాలకు పోటీగా భారత్ :
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అమెరికా ఆధిపత్యం కొనసాగుతోంది. అమెరికాకు చెందిన ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన చాట్ జిపిటి బాగా సక్సెస్ అయ్యింది... ప్రస్తుతం దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ఇక యూఎస్ టెక్ దిగ్గజాలు మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా లు కూడా ఈ ఏఐ టెక్నాలజీని చాలాకాలంగా ఉపయోగిస్తున్నాయి.
అయితే తాజాగా ఏఐ టెక్నాలజీలో అమెరికాకు సవాల్ విసురుతూ చైనా ఎంట్రీ ఇచ్చింది. చైనాకు చెందిన ఓ స్టార్టప్ అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఏఐ టెక్నాలజీని రూపొందించింది. 'డీప్ సీక్' పేరిట ఏఐ మార్కెట్లోకి ప్రవేశించిన ఈ చైనీస్ స్టార్టప్ అమెరికా సంస్థలను వెనక్కి నెడుతోంది. దీని దెబ్బకు అమెరికన్ సంస్థలు కుదేలవుతున్నాయి.
ఇలా అమెరికా, చైనాల మధ్య ఏఐపై ఆధిపత్యం కోసం పోటీ జరుగుతుండగా తాజాగా ఇండియా కూడా దీనిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే అత్యాధునికి టెక్నాలజీని అందిపుచ్చుకున్న ఇండియా ఏఐలో కూడా అద్భుతాల సృష్టించేందుకు సిద్దమయ్యింది. అందుకోసమే తమ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్యం పెంచేందుకు బడ్జెట్ లో భారీగా నిధులు కేటాయించింది. మరి భారత్ ప్రయత్నాలు ఫలించి చాట్ జిపిటి, డీప్ సీక్ కు పోటీగా భారత స్టార్టప్స్ ఏమయినా వస్తాయేమో చూడాలి.
Artificial intelligence (AI)
విద్యారంగానికి టెక్నాలజీ టచ్ :
విద్యారంగంలో టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఈ బడ్జెట్ 2025 లో కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంది. విద్యార్థి దశనుండే సైన్స్ ఆండ్ టెక్నాలజీలో నైపుణ్యం పొందేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ప్రభుత్వం చూస్తోంది.
ఈ బడ్జెట్ లో విద్యారంగానికి రూ.1,28,650 కోట్లు కేటాయించారు. ఈ నిధులను విద్యారంగంలో సమూల మార్పులకోసం ఖర్చుచేయనున్నారు. కేవలం మూస పద్దతిలో విద్యార్థులను చదివించకుండా ప్రాక్టికల్ పద్దతిలో విజ్ఞానాన్ని అందించాలన్నది కేంద్రం ఆలోచనగా తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా కొన్ని నిర్ణయాలను బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.
దేశంలోని ప్రభుత్వం పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుచేయనున్నామని ఆర్థికమంత్రి వెల్లడించారు. రాబోయే ఐదేళ్లలో 50,000 ల్యాబ్స్ నే ఏర్పాటుచేయనున్నారు. అలాగే అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కి బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటి (భారత్ నెట్) కల్పించనున్నట్లు పార్లమెంట్ వేదికగా చేసిన బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు.