- Home
- National
- కాసుల వర్షం కురిపించిన టమాటా.. ఒక్క పంటతోనే లక్షాధికారులైన అన్నాదమ్ములు.. అప్పులు తీర్చి, కారు కొనుక్కుని..
కాసుల వర్షం కురిపించిన టమాటా.. ఒక్క పంటతోనే లక్షాధికారులైన అన్నాదమ్ములు.. అప్పులు తీర్చి, కారు కొనుక్కుని..
టమాటా ఒక్క పంటతో అదృష్టాల్ని తిరగరాస్తోంది. కర్నాటకకు చెందిన ఓ అన్నాదమ్ముల పాలిట అదృష్టదేవతగా మారింది. కాసుల వర్షం కురిపించి.. లక్షాధికారుల్ని చేసింది.

కర్ణాటక : దేశవ్యాప్తంగా పెరిగిన టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే…మరోవైపు టమాటా రైతుల పాలిట అదృష్టంగా మారుతున్నాయి. ఒక్క నెలలోనే టమాటా దిగుబడితో లక్షాధికారులుగా మారిపోతున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత ధరకు టమాటాలు రేటు పలుకుతుండడంతో.. టమాటా రైతుల ఆనందానికి హద్దులు లేకుండా పోతుంది.
పంట దిగుబడి ఎక్కువై.. ధర పలుకక రోడ్లమీద పారబోసిన రోజుల నుంచి.. టమాటా పంటకి కాపలా పెట్టుకుని కాపాడుకోవాల్సిన దశకి రైతులు చేరుకున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని చామరాజనగరలో ఓ రైతు అన్నదమ్ములు టమాటా ఒక్క పంటతో లక్షాధికారులుగా మారిపోయారు.
టమాటా సాగు వారిని సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేసింది. వారికంటూ ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. చామరాజునగర జిల్లా లక్ష్మీపురకు చెందిన రాజేష్, నాగేష్ అన్నదమ్ములు. వీరిద్దరూ టమాటా సాగు చేస్తున్నారు.
పెరిగిన టమాటా ధరలు వీరిద్దరిని లక్షాధికారులుగా మార్చాయి. మూడేళ్ల కిందట వీరు చదువులను వదిలేసి వ్యవసాయంలోకి వెళ్లారు. తమకున్న రెండు ఎకరాల పొలంలో సేద్యం పనులు చేస్తున్నారు. నిరుడు తమ భూమి పక్కనే ఉన్న మరో 10 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నారు.
టమాటకు ధర వస్తుందని ముందుగానే ఊహించి మొత్తం 12 ఎకరాల్లో టమాటా సాగు మొదలుపెట్టారు. వారి ఊహ నిజమై వారికి కాసుల వర్షం కురిపించింది.
దిగుబడి ఎక్కువగా రావడంతో పాటు ధర కూడా ఎక్కువగా ఉండటంతో ఇప్పటివరకు ఈ అన్నదమ్ములు ఇద్దరు రెండువేల బాక్సుల టమాటాలను అమ్మారు.
దీనికిగాను రూ.40 లక్షలకు పైగా ఆదాయం వీరికి లభించింది. తామిద్దరే కాకుండా తమ తల్లిదండ్రులు కూడా తమతో పాటు పొలం పనులకు సహకారం అందిస్తారని రాజేష్ తెలిపాడు. తాను, తన సోదరుడు రాత్రివేళ పంటకి కాపలాగా వంతుల వారీగా ఉంటామని చెప్పుకొచ్చాడు.
ఈసారి ఈ ఒక్క పంటతో గతంలో తమ కుటుంబం పేరు మీద ఉన్న అప్పులన్నీ తీరిపోయాయని సంతోషం వ్యక్తం చేశాడు. టమాట పంటతో వచ్చిన డబ్బులతో వారు అప్పులు తీర్చేయగా మిగిలిన వాటితో ఓ కారు కొనుక్కున్నారు.