Cyber Fraud : అకౌంట్లో డబ్బులు పడ్డట్లు మెసేజ్ చూసి...నమ్మారో అంతే సంగతి
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకం కింద లోన్ ఇప్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. ఇది ఎలా చేస్తారంటే..
Cyber Fraud
Cyber Fraud : ఇంతకాలం బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి అకౌంట్, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరించి డబ్బులు కాజేసావారు సైబర్ కేటుగాళ్లు. అయితే ఇలాంటి మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. దీంతో సైబర్ నేరగాళ్ల ఆటలు సాగడంలేదు... కాబట్టి వారు రూటు మార్చారు. ప్రతిసారి ఒకేలా కాకుండా వేరువేరు పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా తాజాగా కేంద్ర ప్రభుత్వం పథకం కింద డబ్బులు వచ్చాయంటే ఓ అమాయకుడు నమ్మి మోసపోయాడు. ఈ ఘటన కేరళలో వెలుగుచూసింది.
Cyber Fraud
ఇదో కొత్తరకం సైబర్ మోసం :
కోజికోడ్ ప్రాంతానికి చెందిన షాజీ కి ప్రధాన మంత్రి ముద్ర లోన్ మంజూరయ్యింది అంటూ మెసేజ్ వచ్చింది. ఇది నిజమేనని నమ్మిన అతడు ఆ మేసేజ్ లోని లింక్ ను క్లిక్ చేసాడు. ఇలా లోన్ ఆశతో సైబర్ నేరగాళ్లు పన్నిన ఉచ్చులో పడ్డాడు షాజీ.
ఇలా అతడికి డబ్బులపై వున్న ఆశనే పెట్టుబడిగా చేసుకున్నారు కేటుగాళ్లు. లింక్ ఓపెన్ చేయగానే అనుమానం రాకుండా ఓ ఫారం నింపాలని సూచించారు. షాజీ అలాగే చేసాడు. ఇందులోని అతడు పేర్కొన్న వివరాల ఆధారంగా మోసానికి పాల్పడ్డారు.
ఆన్ లైన్ లో ఫామ్ ఫిల్ చేసి సమర్పించిన తర్వాత షాజీకి కాల్ వచ్చింది. మీకు రూ.50 వేల ముద్ర లోన్ మంజూరయ్యిందని... ఈ డబ్బులు పొందాలంటే ముందుగా భీమా చేయాల్సి వుంటుందని చెప్పారు. ఇందుకోసం రూ.3,750 చెల్లించాలని కోరారు. దీంతో రూ.50,000 వస్తున్నాయన్న భ్రమలో వున్న అతడు అడిగిన డబ్బులు చెల్లించాడు. ఆ వెంటనే రూ.50,000 అకౌంట్లో పడ్డట్లు షాజీ ఫోన్ కు మెసేజ్ వచ్చింది.
అయితే డబ్బులు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది కానీ అకౌంట్లో మాత్రం డబ్బులు పడలేదు. ఇదే విషయాన్ని షాజీ సైబర్ నేరగాళ్లకు తెలిపాడు. దీంతో అతడు ఇంకా తమ మోసాన్ని గుర్తించలేదని ఈ కేటుగాళ్లు గ్రహించారు. ఈ క్రమంలో మరోసారి మోసం చేసి ఇంకొంత డబ్బు లాగే ప్రయత్నం చేసారు.
రూ.50,000 ఇంకా ప్రాసెసింగ్ లో వున్నాయని... మరో రూ.9000 చెల్లిస్తే మొత్తం డబ్బులు అకౌంట్లో పడేలా చూస్తామని నమ్మించే ప్రయత్నం చేసారు. కానీ అప్పటికే కొంత డబ్బు వేసిన షాజీకి ఎందుకో ఇదంతా మోసంలా అనిపించింది. తనకు ఏ లోన్ వద్దు... ఇప్పటికే చెల్లించిన రూ.3,750 తిరిగి ఇవ్వాలని అడిగాడు. తమ మోసం బైటపడటంతో సదరు సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేసారు.
Cyber Fraud
లోన్ రద్దు పేరిట మరో మోసానికి యత్నం :
ఇప్పటికే ముద్ర లోన్ మంజూరయ్యింది... దీన్ని రద్దు చేయాలంటే రూ.1000 ఫైన్ కట్టాల్సి వస్తుందని షాజీని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నించారు సైబర్ నేరగాళ్లు. కానీ అతడు డబ్బులు చెల్లించేందుకు అంగీకరించలేదు. దీంతో అతడిని బ్లాక్ మెయిల్ చేసారు.
రుణం తీసుకున్నట్లు తమవద్ద పత్రాలు వున్నాయని... డబ్బులు ఇవ్వకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని షాజీని బెదిరించారు.అయినా అతడు డబ్బులు చెల్లించకపోవడంతో నీ ఫోటోలు తమవద్ద వున్నాయి... వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యంగా సృష్టించి తెలిసినవారికి పంపిస్తామని, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. కానీ షాజీ భయపడలేదు... తనకు జరిగిన మోసాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో ఈ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.
షాజీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడికి వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా లోన్ల పేరిట ఊరికే డబ్బులు ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలకు పాల్పడుతున్నారని... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు.