కృత్రిమ వర్షం కురిపించేందుకు సిద్ధమైన ప్రభుత్వం... అసలేంటిది.? దీంతో లాభాలు ఏంటి.?
Artificial Rain: దేశ రాజధాని న్యూఢిల్లీలో కాలుష్యం పెద్ద సమస్యగా మారిందన్న విషయం తెలిసిందే. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమంగా వర్షాన్ని కురిపించేందుకు సిద్ధమవుతోంది.

ఢిల్లీని ముంచేసిన విషగాలి
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గాలి విషపూరితంగా మారుతుంది. దీపావళి తర్వాత పొగ, దుమ్ము, పొగమంచు కలిసి నగరాన్ని గ్యాస్ చాంబర్‌లా మార్చేస్తాయి. కళ్లు మండిపోవడం, ఊపిరి ఆడక ఇబ్బంది పడటం, పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ బాధిస్తుంది. అయితే ఈసారి ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. అదే కృత్రిమ వర్షం దీనినే క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు.
క్లౌడ్ సీడింగ్ అంటే ఏమిటి?
క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాలలో రసాయనాలను విడుదల చేసి వాటిని వర్షం కురిపించేలా చేసే పద్ధతి. ఇందులో సాధారణంగా సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ వంటి రసాయనాలు వాడుతారు. మేఘాలు తగినంతగా ఉన్నప్పుడు ఈ రసాయనాలు వాటిలోకి చిమ్మి, నీటి బిందువులు ఏర్పడేలా చేస్తారు. దాంతో మేఘాలు వర్షం కురిపిస్తాయి. ఢిల్లీ ప్రభుత్వం IIT కాన్పూర్ శాస్త్రవేత్తల సహకారంతో ఈ ప్రయోగాన్ని ప్రారంభించింది.
ఈ మిషన్ కోసం ఉపయోగించే విమానం
ఈ ఆపరేషన్ కోసం సెస్నా (Cessna) అనే చిన్న విమానాన్ని ఎంచుకుంటారు. పేరుకే చిన్నది అయినా ఇది చాలా శక్తివంతమైన విమానం. ఇది శాస్త్రీయ ప్రయోగాలకు, తక్కువ ఎత్తులో ఎగరడానికి, కచ్చితమైన నియంత్రణకు ప్రసిద్ధి చెందింది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా క్లౌడ్ సీడింగ్ కోసం మార్పులు చేశారు. ఇందులో 8 నుంచి 10 రసాయన ప్యాకెట్లు ఉంచి, పైలట్ ఒక బటన్ నొక్కగానే అవి మేఘాలపైకి వెళ్తాయి. దాంతో మేఘాల లోపల తేమ పెరిగి వర్షం కురుస్తుంది.
ఒక్క విమానానికి అవసరమయ్యే ఇంధనం
ఒక సెస్నా 172 విమానం సాధారణంగా గంటకు 26 నుంచి 34 లీటర్ల ఇంధనాన్ని వినియోగిస్తుంది. క్లౌడ్ సీడింగ్ మిషన్‌లో ఈ విమానం సుమారు 90 నిమిషాలు (గంటన్నర) పాటు గాల్లో ఉంటుంది. దాంతో ఒక్క ప్రయాణానికి 39 నుండి 51 లీటర్ల వరకు ఇంధనం అవసరం అవుతుంది. ఇది ఒక పెద్ద కార్ నెలరోజుల ఇంధన వినియోగంతో సమానం.
ఈ వర్షంతో ప్రయోజనం ఏంటి.?
కృత్రిమ వర్షం ద్వారా గాల్లో తేలియాడే కాలుష్య కణాలు కిందికి చేరతాయి. దాంతో గాలి శుభ్రంగా మారి, ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. ఇది తాత్కాలిక పరిష్కారమే అయినప్పటికీ, కాలుష్యం అధికంగా ఉన్న సమయంలో తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. వాతావరణం అనుకూలిస్తే ఈ ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి 30 మధ్య ఢిల్లీలో జరగనుంది. మొత్తానికి, ఢిల్లీ విషగాలిని ఎదుర్కొనే ప్రయత్నంలో ప్రభుత్వం ఆకాశాన్ని నమ్ముకుంది. సెస్నా విమానం మేఘాలను వర్షంగా మార్చే ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో ఇతర నగరాల్లో కూడా ఇదే విధానం అమలు చేసే అవకాశం ఉంది.