ముంచుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు. స్కూళ్లకు సెలవులు
Rain Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడుతోంది. ఇది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మొంథా తుఫాన్‌గా మారే అవకాశం
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడుతూ “మొంథా” అనే తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గడిచిన 12 గంటలలో వాయుగుండం గంటకు 10 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతోందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇది పోర్ట్ బ్లెయిర్‌కు 510 కి.మీ, చెన్నైకి 890 కి.మీ, విశాఖపట్నం, కాకినాడలకు 920 కి.మీ, గోపాల్పూర్‌కు 1000 కి.మీ దూరంలో ఉందని వివరించారు. ఈ వాయుగుండం క్రమంగా తీవ్రవాయుగుండం, తుపాను, చివరికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
తీరప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలు
తుఫాను ప్రభావంతో సోమవారం, మంగళవారం తీర జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సోమవారం (అక్టోబర్ 27) — బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కోనసీమ, గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం (అక్టోబర్ 28) — కాకినాడ, తూర్పు-పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో తీవ్ర వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తుఫాను తీరాన్ని మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో మంగళవారం సాయంత్రం లేదా రాత్రి తాకవచ్చని అంచనా. ఆ సమయంలో గాలివేగం గంటకు 90 నుంచి110 కి.మీ వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు.
ప్రభుత్వం ముందస్తు చర్యలు
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు చర్యలు చేపట్టింది. 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కోస్తా జిల్లాల్లో సిద్ధంగా ఉంచారు. సముద్రం అలజడిగా ఉండడంతో చేపల వేట, బోటింగ్, పర్యాటక కార్యకలాపాలను బుధవారం వరకు పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం టోల్‌ఫ్రీ 112, 1070, 1800-425-0101 నంబర్లను సంప్రదించవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.
వైద్యశాఖ అప్రమత్తం
తుపాను నేపథ్యంలో వైద్య సేవలలో అంతరాయం కలగకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ సన్నద్ధమైంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యదర్శి సౌరభ్ గౌర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎపిడమిక్ సెల్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంలు ఏర్పాటయ్యాయని, యాంటీ స్నేక్ వినమ్, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు, డెలివరీ తేది దగ్గరలో ఉన్న గర్భిణీల వివరాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తమ కేంద్రాల్లో 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం వస్తే ఆసుపత్రుల్లో జనరేటర్లు వినియోగంలో ఉండేలా సూచించారు.
మచిలీపట్నం కలెక్టర్ ఆదేశాలు
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తుఫాను సన్నద్ధతపై సమీక్షించారు. 27 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రతి శాఖ అధికారులు తమ పరిధిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలకు ఒకవేళ చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోతే.. వాటిని తొలగించేందుకు రంపాలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ కాకుండా పంపింగ్ యంత్రాలను సిద్ధం చేయాలని సూచించారు. పశువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, అంగన్‌వాడి పిల్లలకు పాలు, గుడ్లు ఇంటి వద్దకే ఇవ్వాలని తెలిపారు. రహదారులు, వంతెనలు దెబ్బతినే అవకాశం ఉన్నచోట రాకపోకలు నియంత్రించాలన్నారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు.
తెలంగాణలో వర్షాలు, ఎల్లో అలర్ట్
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం “మొంథా” తుఫాన్‌గా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలోనూ ప్రభావం పడనుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, హైదరాబాద్‌లో శనివారం భారీ వర్షం నమోదైంది. వాయుగుండం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆదివారం తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. అక్టోబర్ 27 నుంచి 29 వరకు దక్షిణ, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని, గాలి వేగం గంటకు 30–40 కి.మీ వరకు ఉండవచ్చని చెప్పారు.
బుధవారం వరకు వర్షాలు
ఆదివారం (అక్టోబర్ 26): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది.
సోమవారం (అక్టోబర్ 27): జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం (అక్టోబర్ 28): పెద్దపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది.
బుధవారం (అక్టోబర్ 29): ఉత్తర తెలంగాణ జిల్లాలు — ఆదిలాబాద్, మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా.
వాతావరణ శాఖ మొత్తం నాలుగు రోజులపాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వర్షాల సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించింది.
స్కూళ్లకు సెలవులు
‘మొంథా’ తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముందస్తు చర్యల్లో భాగంగా.. కృష్ణా జిల్లాలో అక్టోబర్ 27 నుంచి 29 వరకు, తూర్పు గోదావరి, అన్నమయ్య జిల్లాల్లో 27, 28 తేదీల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. విద్యార్థులు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రాణ, ఆస్తి, పశుసంపద నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.