మహారాష్ట్ర సీఎం పడ్నవీస్ భార్య ఓ బాలీవుడ్ సింగర్ ... ఎవరో తెలుసా?
దేవేంద్ర పడ్నవిస్... ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈయన గురించే చర్చ. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన మరోసారి బాధ్యతలు చేపట్టి దేశ ప్రజల దృష్టికి ఆకర్షించారు. ఆయన రాజకీయ జీవితం గురించి అందరికీ తెలుసు... మరి వ్యక్తిగత జీవితం గురించి తెలుసా? ఆయన భార్య అమృత పడ్నవీస్ గురించి తెలుసా?
దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మరీముఖ్యంగా ఆయన భార్య అమృతా ఫడ్నవీస్ గురించి తెలుసుకుంటున్నారు.
మహా సీఎం భార్యగానే కాదు వివిధ రంగాల్లో తన ట్యాలెంట్ ప్రదర్శించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అమృతా పడ్నవిస్. ప్లేబ్యాక్ సింగర్, నటి, సామాజిక కార్యకర్త, సీనియర్ బ్యాంకింగ్ ప్రొఫెషనల్ గా తన విజయాలు, కృషితో వార్తల్లో నిలిచారు.
నాగ్‌పూర్‌లో ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు శరద్ రాణడే, గైనకాలజిస్ట్ చారులత రాణడే దంపతులకు అమృతా రాణడేగా జన్మించారు. నాగ్‌పూర్, పూణేలలో కామర్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్ చదివారు. సోషల్ మీడియాలో తాను ఓ బ్యాంకర్, గాయని, సామాజిక కార్యకర్తగా పేర్కొన్నారు అమృత.
2003లో యాక్సిస్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ క్యాషియర్‌గా అమృత పనిచేసారు. ఆ తర్వాత ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ డిపార్ట్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎదిగారు.
క్లాసికల్ సంగీతంలో శిక్షణ పొందిన ఫడ్నవీస్ బాలీవుడ్ డైరెక్టర్ ప్రకాష్ ఝా "జై గంగాజల్"లో ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేశారు. 2018లో టి-సిరీస్ ఆమె తొలి మ్యూజిక్ వీడియో ("ఫిర్ సే")ను విడుదల చేసింది, దీనిలో అమితాబ్ బచ్చన్ నటించారు.
2020లో యాసిడ్ దాడుల బాధితుల కోసం ఆమె "అలగ్ మేరా యే రంగ్ హై" పాట పాడారు. అలాగే 2021లో మహిళా సాధికారత కోసం "తిల జాగు ద్యా", 2020లో కరోనా వారియర్స్ కోసం "తు మందిర్ తు శివాల" పాటలు పాడారు.
1.1 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో, ఆమె సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. పేద పిల్లల కోసం కార్యక్రమాలు నిర్వహించడం నుండి మహిళా సాధికారత చొరవలకు మద్దతు ఇవ్వడం వరకు అనేక సామాజిక కార్యక్రమాలను అమృతా పడ్నవిస్ నిర్వహిస్తుంటారు.
దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజకీయ జీవితంలో బిజీగా ఉన్నప్పుడు, ఆమె తన గానం, నటన, వివిధ వృత్తిపరమైన కార్యక్రమాలతో ప్రజల దృష్టిలో ఉంటారు. 2005లో వివాహం చేసుకున్న ఈ జంటకు దివిజా అనే కుమార్తె ఉంది.