- Home
- National
- Air India crash probe: ఎయిరిండియా ప్రమాదం.. దర్యాప్తు పారదర్శకతపై పైలట్ల సంఘం ప్రశ్నలు ఎందుకు?
Air India crash probe: ఎయిరిండియా ప్రమాదం.. దర్యాప్తు పారదర్శకతపై పైలట్ల సంఘం ప్రశ్నలు ఎందుకు?
Air India crash probe: ఎయిర్ ఇండియా AI171 క్రాష్ ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పక్షపాతం, పారదర్శకత లేకపోవడం, నిపుణులను మినహాయించడం జరిగిందని ఆరోపించింది.

అహ్మదాబాద్ ప్రమాదం విచారణపై పైలట్ల సంఘం ఆగ్రహం
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదికను విమర్శిస్తూ ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ నివేదిక పాక్షికంగా ఉందనీ, విచారణ పూర్తి అవకముందే పైలట్ల తప్పిదాన్ని నిర్ణయించడం అన్యాయం అని పేర్కొంది.
ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) శనివారం విడుదల చేసిన ప్రకటనలో.. “విమానం ప్రమాదంపై ప్రాథమిక విచారణ నివేదిక సాక్ష్యాలు పూర్తి కాకముందే పైలట్ల తప్పిదాన్ని సూచిస్తుంది. ఇది అన్యాయమైన దృష్టికోణంగా చూడవచ్చు” అని స్పష్టం చేసింది.
అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమాన ప్రమాదం
ఎయిరిండియా విమాన ప్రమాదం జూన్ 12న జరిగింది. అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం 90 సెకన్లలోనే కూలిపోయింది.
ఈ ప్రమాదంలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది, ప్రమాద సమయంలో నేలపై ఉన్న 19 మంది ఉన్నారు.
ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రశ్నలు
ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) ప్రకారం, ఈ నివేదిక అధికారిక సంతకం లేకుండా మీడియాకు లీక్ కావడం విచారణ విశ్వసనీయతపై సందేహాలు పెంచుతోంది.
"ఇది తీవ్రమైన సాంకేతిక విషయం. అలాంటిది అధికారిక సంతకం లేకుండా ప్రాథమిక నివేదిక బయటపడడం బాధాకరం" అని ఏఎల్పీఏ వ్యాఖ్యానించింది. దర్యాప్తు బృందంలో అనుభవజ్ఞులైన నిపుణులు, ముఖ్యంగా లైన్ పైలట్లు లేకపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) నివేదికలో ఏముంది?
విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ప్రకారం, విమానం ఎగిరిన కొద్ది సేపటికే రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. ఈ చర్య వల్ల తాత్కాలికంగా రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) యాక్టివేట్ అయింది.
ఈ సమయంలో పైలట్‌లు ఇంజిన్లను మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ఒక ఇంజిన్ మాత్రమే ఒక భాగంగా పనిచేసింది. అప్పటికే విమానం నేలవైపు వేగంగా వచ్చి పడిపోయింది.
ఈ సమయంలో పైలట్లు అలర్ట్ అయి “MAYDAY” సంకేతం పంపించారు. ఇది 08:09 UTC సమయంలో జరిగింది. కొన్ని క్షణాల్లోనే విమానం విమానాశ్రయానికి సమీపంలోని నివాస ప్రాంతంలో కూలిపోయింది.
దర్యాప్తుపై ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు
ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు ప్రాథమిక నివేదిక క్రమంలో నాలుగు ప్రధాన అభ్యంతరాలు ప్రస్తావించింది. వాటిలో..
1. పైలట్ తప్పిదంపై ముందస్తు నిర్ణయం: విచారణ పూర్తికాకముందే పైలట్ల తప్పిదాన్ని నిర్దారించడం తప్పు అని పేర్కొంది.
2. దర్యాప్తు పారదర్శకత: విచారణ వివరాలు బయటపెట్టకుండా గోప్యంగా ముందుకు సాగడంపై విమర్శించింది.
3. నిపుణులు లేకపోవడం: అనుభవజ్ఞులైన పైలట్‌లు, సాంకేతిక నిపుణులు విచారణ బృందంలో లేరని పేర్కొంది.
4. సంతకం లేని నివేదిక: అధికారిక సంతకం లేకుండా నివేదిక లీక్ కావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా, "వాల్ స్ట్రీట్ జర్నల్" వంటి విదేశీ మీడియా సంస్థలకు ఈ నివేదిక ఎలా లభించిందన్నదానిపై కూడా ప్రశ్నలను లేవనెత్తింది.
ఎయిరిండియా విమానం నడిపిన పైలట్లు ఎవరు?
ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానాన్ని కెప్టెన్ సుమిత్ సబర్వాల్ (వయసు 56), ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ (వయసు 32) నడిపించారు. కెప్టెన్‌కు 15,600 గంటల పైగా, ఫస్ట్ ఆఫీసర్‌కు 3,400 గంటల పైగా విమాన సర్వీసు అనుభవం ఉంది. ఇద్దరూ డ్రీమ్‌లైనర్ నడిపేందుకు పూర్తిగా అర్హత కలిగి ఉన్నారు.
ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు కెప్టెన్ సామ్ థామస్ మాట్లాడుతూ.. “విచారణ ద్వారా పైలట్లను తప్పుపట్టే విధంగా విచారణ ముందుకు సాగుతోంది. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం” అని అన్నారు.
దర్యాప్తులో ప్రాతినిధ్యం కల్పించాలని ALPA డిమాండ్
ఎయిర్ ఇండియా విమానం ప్రమాద విచారణ బృందంలో పైలట్ల ప్రతినిధులకు స్థానం కల్పించాలని ఎయిర్‌లైన్ పైలట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA) డిమాండ్ చేసింది. ఇది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేందుకు అవసరమని స్పష్టం చేసింది.
ప్రభుత్వ స్పందన ఏమిటి?
సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి ముర్లిధర్ మోహోల్ మాట్లాడుతూ.. “AAIB విడుదల చేసినది ప్రాథమిక నివేదిక మాత్రమే. తుది నివేదిక కోసం ఎదురు చూడాలి” అన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. "భారతీయ పైలట్ల పట్ల మాకు పూర్తి విశ్వాసం ఉంది. పూర్తిస్థాయి విచారణ జరిగే వరకు ఒక నిర్ణయానికి రాకూడదు" అని ఆయన తెలిపారు.
తుది నివేదికలో ఏముంటుంది?
విమాన డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్లు, రక్షణ సమాచారం, సిబ్బంది వివరాలు, ఇంజినీరింగ్ చెక్‌ల ఆధారంగా ఏఏఐబీ నుంచి తుది నివేదిక రానుంది. దీనిలో విమాన ప్రమాదానికి నిజమైన కారణాలు, నివారణ చర్యలు ఏంటనే వివరాలు ఉంటాయి. తుది నివేదిక రావాల్సి ఉంది.