అరవింద్ కేజ్రీవాలే కాదు కూతురు, కొడుకూ ఐఐటియన్లే... ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ లో చదువున్నారని అందరికీ తెలుసు. కానీ ఆయన ఇద్దరు పిల్లలు కూడా ఐఐటియన్లే అని మీకు తెలుపా? వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?
Arvind Kejriwal Family
Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్... పరిచయం అక్కర్లేని పేరు. ఓ సాధారణ ఐఆర్ఎస్ అధికారి ప్రజాసేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చి అసాధారణ విజయాలు సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే రెండు రాష్ట్రాల్లో(డిల్లీ, పంజాబ్) అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత కేజ్రీవాల్ సొంతం. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఆయన కీలక నేత.
ఇలా రాజకీయాల్లోనే కాదు వ్యక్తిగతంగానూ అరవింద్ కేజ్రీవాల్ ది విజయగాథే. సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కేజ్రీవాల్ కష్టపడేతత్వమే ఆయనను ఐఐటి (ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లో చదివే అవకాశాన్ని కల్పించింది... సివిల్స్ ర్యాంకర్ గా నిలిపింది. ఇప్పుడు రాజకీయాల్లోనూ విజయాన్ని తెచ్చిపెడుతోంది.
అరవింద్ కేజ్రీవాల్ తో పాటు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కూడా సివిల్స్ ర్యాంకర్. ఇద్దరూ ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్ఎస్) లో అధికారులుగా పనిచేసారు. ఇప్పుడు వీరి ఇద్దరు పిల్లలు కూడా మంచి విద్యావంతులే. కూతురు హర్షిత కేజ్రీవాల్, కొడుకు పులకిత్ కేజ్రీవాల్ ఇద్దరూ ఐఐటియన్లే. డిల్లీ ఐఐటి నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసిన వీరు ప్రస్తుతం ప్రముఖ మల్టినేషనల్ కంపనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.
ఇలా కేజ్రీవాల్ కుటుంబమంటే ఐఐటియన్ల కుటుంబంగా మారింది. తండ్రి అరవింద్ కేజ్రీవాల్ బాటలోనే ఇద్దరు బిడ్డలు నడుస్తున్నారు. ఇలా నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న హర్షిత,పులకిత్ ల విద్యాభ్యాసం, జెఈఈ అడ్వాన్స్ ర్యాంకులు, ఐఐటిలో చదువు, ప్రస్తుత కెరీర్ గురించి తెలుసుకుందాం.
Harshita Kejriwal
హర్షిత కేజ్రీవాల్ :
డిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మొదటి సంతానమే హర్షిత కేజ్రీవాల్. చిన్నప్పటినుండి చదువులో మంచి ప్రతిభ కనబరుస్తూ తండ్రికి తగిన కూతురు అనిపించుకున్నారు. చదువులో టాపర్ గా నిలిచి కేజ్రీవాల్ ఇంటిపేరును నిలబెట్టారు.
దేశ రాజధాని డిల్లీలోనే హర్షిత విద్యాభ్యాసమంతా కొనసాగింది. ఇంటర్మీడియట్ లో ఆమె 96 శాతం మార్కులతో టాపర్ గా నిలిచారు. ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 శాతానికి పైగా మార్కులు సాధించారు... ఫిజిక్స్ లో అయితే 99 శాతం మార్కులు వచ్చాయి. మ్యాథ్స్ లో 95, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లో 96, కంప్యూటర్ సైన్స్ లో 94 శాతం మార్కులు సాధించారు.
ఇంటర్మీయట్ తర్వాత ఐఐటిలో సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు హర్షిత. 2014లో జెఈఈ పరీక్షలో ప్రతిభ చూపించి ఐఐటి డిల్లీలో సీటు సంపాందించారు. జెఈఈ అడ్వాన్స్‌డ్ లో ఆమె ర్యాంక్ 3322.
ఐఐటి డిల్లీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసారు హర్షిత. ఇలా చదువు ముగించగానే అలా ఉద్యోగంలో చేరిపోయారు. గురుగ్రామ్ లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లో అసోసియేట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. అలాగే ఓ చిన్న స్టార్టప్ ను కూడా స్థాపించారు. ప్రస్తుత కెరీర్ పైనే ఆమె దృష్టి వుంది.
కేవలం చదువులోనే కాదు ఇతర విషయాల్లోనూ హర్షిత బాగా చురుకు. ఆమె ఒడిస్సి నాట్యం నేర్చుకుంది. ఇక హింది,ఇంగ్లీష్ తో పాటు ఫ్రెంచ్ అనర్గళంగా మాట్లాడగలరు. ఇవి కాకుండా రాజకీయాల్లోనూ తండ్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇటీవల ఆప్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కూడా చేపట్టారు.
Pulkit Kejriwal
పుల్కిత్ కేజ్రీవాల్ :
అరవింద్ కేజ్రీవాల్-సునీత దంపతలు రెండో సంతానమే పుల్కిత్ కేజ్రీవాల్. తల్లిదండ్రులు, సోదరి ఇలా ఇళ్లంతా మంచి విద్యావంతులే... కాబట్టి పుల్కిత్ కూడా చిన్నప్పటి నుండే చదువుపై మక్కువ పెంచుకున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిగా పేరుతెచ్చుకుని అన్నిట్లోనూ ముందుండేవాడు. ఇలా స్కూలింగ్ నుండి కాలేజీ వరకు పుల్కిత్ టాపర్ గా నిలిచాడు. డిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిన ఇతడు టెన్త్ లో 10 సిజిపిఏ, 12th లో 96.4% మార్కులు సాధించాడు.
తండ్రి,సోదరి బాటలో నడుస్తూ ఐఐటిలో సీటు సాధించాడు పుల్కిత్. జెఈఈ లో రాణించి మంచి ర్యాంకు సాధించాడు. దీంతో సోదరి చదివిన ఐఐటి డిల్లీలోనే అతడూ సీటు సాధించి బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ చేసాడు.
ఇంజనీరింగ్ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపనీ ఫిన్ మెకానిక్స్ లో చేరాడు పుల్కిత్. ఇలా ఉద్యోగం చేస్తూనే చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. జిమ్ పరికరాలకు సంబంధించిన స్టార్టప్ ను నెలకొల్పాడు. అయితే ఇతడు రాజకీయాలకు చాలా దూరంగా వుంటాడు... సోదరిలా అప్పుడప్పుడు కూడా అటువైపు తొంగిచూడడు. ప్రస్తుతం అతడు తన కెరీర్ పైనే దృష్టిపెట్టాడు.
Arvind Kejriwal - Sunitha Kejriwal
అరవింద్ కేజ్రీవాల్-సునీత కేజ్రీవాల్ :
అరవింద్ కేజ్రీవాల్ దేశంలోనే అత్యంత విద్యావంతులైన రాజకీయ నాయకుల్లో ఒకరు. ఈయన ఐఐటి ఖరగ్ పూర్ నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసారు. ఆ తర్వాత సివిల్స్ వైపు అతడి దృష్టి పడింది. దేశంలోనే అత్యంత కఠినమైన జెఈఈ, యూపిఎస్సి రెండు పరీక్షల్లోనూ ప్రతిభ చూపించారు. యూపిఎస్సిలో మంచి ర్యాంకు సాధించి ఇండియన్ రెవెన్యూ సర్విసెస్ లో చేరారు. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం చేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో రాజీనామా చేసారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
ఇక అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ కూడా మంచి విద్యావంతురాలు. ఆమె తన గ్రాడ్యుయేషన్‌ను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్‌లో పూర్తి చేశారు. ఆ తరువాత జువాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసారు.1994లో సివిల్స్ ఎక్జామ్ లో విజయం సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (IRS)లో ఉద్యోగం సాధించారు. భోపాల్‌లో సివిల్ సర్వీసెస్ ట్రైనింగ్ సమయంలోనే ఆమెకు అరవింద్ కేజ్రీవాల్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే వారిని దంపతులుగా చేసింది.
ఆమె తన కెరీర్ లో దాదాపు 22 సంవత్సరాల పాటు ఆదాయపు పన్నుశాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 2016లో తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. చివరిసారిగా ఢిల్లీలోని ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్‌లో ఐటీ కమిషనర్‌గా పనిచేశారు.