- Home
- Entertainment
- Movie Reviews
- ఆర్కే సాగర్ `ది 100` మూవీ రివ్యూ, రేటింగ్.. బుల్లితెర స్టార్ బిగ్ స్క్రీన్ పై హిట్ కొట్టాడా?
ఆర్కే సాగర్ `ది 100` మూవీ రివ్యూ, రేటింగ్.. బుల్లితెర స్టార్ బిగ్ స్క్రీన్ పై హిట్ కొట్టాడా?
`మొగలి రేకులు` సీరియల్ నటుడు సాగర్ అందరికి పరిచయమే. ఆయన హీరోగా నటించిన `ది 100` మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

ఆర్కే సాగర్ `ది 100` మూవీ రివ్యూ
`మొగలి రేకులు` సీరియల్‌తో బుల్లితెర ఆడియెన్స్ ని అలరించారు ఆర్కే సాగర్. ఇందులో ఆర్కే నాయుడిగా ఆయన చేసిన రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు. టీవీ స్క్రీన్ పై స్టార్‌గా రాణించిన సాగర్ బిగ్ స్క్రీన్‌పై ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే ఆయన `సిద్ధార్థ`, `మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్`, `షాదీ ముబారక్` వంటి చిత్రాల్లో నటించారు. నటుడిగా మెప్పించారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు `ది 100` సినిమాతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నారు.
రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కేఆర్‌ఐఏ ఫిల్మ్ కార్ప్, ధమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై రమేష్ కరుటూరి, వెంకి పుషడపు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో సాగర్‌తోపాటు ధన్యబాలకృష్ణ, మిషా నారంగ్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రం ఈ శుక్రవారం (జులై 11)న విడుదల అవుతుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
`ది 100` మూవీ కథ
విక్రాంత్ (ఆర్కే సాగర్) ఐపీఎస్ 2024 బ్యాచ్ ట్రైన్ అవుతాడు. ట్రైనింగ్‌లో బెస్ట్ గా నిలుస్తాడు. శిక్షణ పూర్తి చేసుకుని డ్యూటీలో జాయిన్ అవ్వగానే సిటీలో ప్రధానంగా నిలిచిన దొంగతనాల కేసుని టేకాప్ చేస్తాడు.
గోల్డ్ దొంగతనం చేసిన గ్యాంగ్‌ని పట్టుకోగా, అందులో తాను ఇష్టపడ్డ క్లాసికల్ డ్యాన్సర్ ఆర్తి(మిషా నారంగ్) గోల్డ్ చైన్ కనిపిస్తుంది. దాని కోసం ఎవరూ రాకపోవడంతో తనే వాళ్ల ఇంటికి వెళ్తారు. వాళ్లు అనుమానంగా కనిపిస్తారు. ఆ తర్వాత జరిగిన దారుణం బయటపెడతారు ఆర్తి తండ్రి.
కొందరు దుండగలు దొంగతనం కోసం వచ్చి తన కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని వెల్లడిస్తాడు. వాళ్లు ఎవరు అనేది విక్రాంత్ ఎంక్వైరీ చేసే క్రమంలో పలు షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి.
దీని వెనుక పెద్ద బిగ్ షాట్ ఉన్నాడని, ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీ హోనర్ ప్రమేయం ఉందని తెలుస్తుంది. మరి ఆయన ఎవరు? ఆర్తిని ఎందుకు టార్గెట్ చేశారు? ఆయన బండారాన్ని బయటపెట్టడంలో విద్య(ధన్య బాలకృష్ణ) ఎలా బయటపెట్టింది?
ఇందులో విష్ణు ప్రియా పాత్రేంటి? వల్లభ(తారక్ పొన్నప్ప)కి ఈ కేసుకి ఉన్న సంబంధమేంటి? ఆ తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపులు తిరిగింది? దీనికి విక్రాంత్ ఎలా ముగింపు పలికాడు అనేది మిగిలిన కథ.
`ది 100` మూవీ విశ్లేషణ
మర్దర్ మిస్టరీతో కూడిన చిత్రాలు చాలా వచ్చాయి. హంతకులు ఒక మోటోతో హత్యలు చేస్తుంటారు. దాన్ని ఛేదించడమే ఈ క్రైమ్ థ్రిల్లర్స్ కాన్సెప్ట్. `ది 100` కూడా అదే టోన్‌లో ప్రారంభమై, కార్పొరేట్‌లో జరిగే ఒక రహస్యమైన, బయటకు రాని ఒక షాకింగ్ సీక్రెట్‌ని, అందులోని పచ్చి నిజాలను ఆవిష్కరించే మూవీ ఇది.
ప్రస్తుతం చాలా కార్పొరేట్ కంపెనీలు తమకు కావాల్సిన ప్రాజెక్ట్ లను ఛేజించుకోవడానికి, తమ కంపెనీలోని అందమైన లేడీ ఎంప్లాయిస్‌ని పావుగా ఎలా వాడుకుంటారనే పచ్చి నిజాలను బయటపెట్టిన మూవీ ఇది.
ఇప్పటి ఎవరూ ఇలాంటి సాహసం చేయలేదని చెప్పొచ్చు. ఈ విషయంలో `ది 100` మేకర్స్ ని, హీరో సాగర్‌ని అభినందించాల్సిందే. చాప కింద నీరులా విస్తరిస్తున్న ఈ దారుణమైన కల్చర్‌ని ఇందులో చూపించడం గొప్ప విషయం.
అయితే ఇలాంటి కథలను స్ట్రెయిట్‌గా చెబితే ఎవరికీ ఎక్కదు, అందులో కొంత డ్రామా కావాలి, మరికొంత ఎమోషన్స్ కావాలి, పెయిన్ ఉండాలి. అప్పుడే కథ రక్తికడుతుంది, సినిమా ఆకట్టుకునేలా ఉంటుంది.
ఈ మూవీ విషయంలో అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. సినిమా చివరి వరకు ఏం జరుగుతుంది? ఏం చూపించబోతున్నారు? ఏం చెప్పబోతున్నారనే క్యూరియాసిటీని క్రియేట్ చేయడం విశేషం. అదే ఇందులో హైలైట్‌గా చెప్పొచ్చు.
`ది 100` మూవీ హైలైట్స్, మైనస్‌లు
సినిమాగా చూసినప్పుడు విష్ణు ప్రియా పాత్ర అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకోవడం, ప్రియుడు టెన్షన్ పడటంతో సినిమా స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే విక్రాంత్ ఐపీఎస్‌గా ట్రైనింగ్ తీసుకుని డ్యూటీలో చేరడం, సిటీలో జరిగే రాబరీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం,
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద డేర్‌గా సమాధానం చెప్పిన అమ్మాయిని చూసి ఫిదా అవ్వడం, ఆమెనే క్లాసికల్ డాన్సర్‌గా కనిపించడంతో ఆమె డాన్సుకి ముగ్దుడైన హీరో ఆమెని ఫాలో కావడం వంటి సన్నివేశాలతో కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు.
ప్రారంభంలో కాస్త రెగ్యూలర్‌గానే అనిపిస్తుంది. కానీ వరుసగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలు దొరకడంతో కథ మరో మలుపు తిరుగుతుంది. ఇది దొంగలు చేసే పనికాదని, దీని వెనుక బిగ్ షాట్స్ ఉన్నారనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.
అది ఎవరు అనే సస్పెన్స్ రన్ అవుతుంది. దీంతో కథ కొత్త మలుపు తీసుకుంటుంది. కార్పొరేట్ కల్చర్ వైపు వెళ్తుంది. ఆ తర్వాత కథ ఆద్యంతం ఎంగేజింగ్‌గా ఉంటుంది. సెకండాఫ్ తర్వాత కథ మరింత రేసీగా, ఎమోషనల్‌గా సాగుతుంది.
క్లైమాక్స్ మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఏం జరుగుతుందనే థ్రిల్‌కి గురి చేస్తుంది. క్లైమాక్స్ ముగింపు రెగ్యూలర్‌గానే ఉన్నా అది ఉత్సుకత రేకెత్తించేలా ఉండటం విశేషం. ఇక సినిమా ఫస్టాఫ్ అంతా కాస్త రొటీన్‌గా, స్లోగా సాగినట్టు ఉంటుంది.
ఇంటర్వెల్ వరకు సినిమా రెగ్యూలర్ ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా రన్ అవుతుంది.
ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతున్నప్పుడు ఎంగేజింగ్‌గా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమాని నడిపించి తీరు కట్టిపడేస్తుంది.
`ది 100` మూవీ నటీనటులు పర్‌ఫెర్మెన్స్
ఇందులో ఐపీఎస్ విక్రాంత్ పాత్రలో సాగర్ అద్భుతంగా చేశారు. పాత్రలో జీవించాడు. చాలా సెటిల్డ్ గా నటించారు. ఎమోషన్స్ ని పలికించిన తీరు బాగుంది. యాక్షన్‌లోనూ అదరగొట్టాడు. ఐపీఎస్ పాత్రలో చాలా హుందాగా కనిపించి ఆకట్టుకున్నారు.
ఇక ఆర్తి పాత్రలో మిషా నారంగ్ సైతం మెప్పించింది. ఆమె పాత్ర ఎక్కువగా ఎమోషన్స్ తో కూడి ఉంటుంది. దాన్ని అంతే బాగా చేసింది. అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు విద్యా పాత్రలో ధన్య బాలకృష్ణ పాత్ర సర్‌ప్రైజింగ్ అని చెప్పొచ్చు.
తాను సైతం చాలా బాగా చేసింది. విష్ణు ప్రియా కాసేపు మెరిసి అలరించింది. ఆమె కూడా ఎమోషనల్ సీన్లలో అదరగొట్టింది. ఇక ఇన్ స్పెక్టర్‌గా గిరిధర్ కి మంచి పాత్ర పడింది. తాను రెచ్చిపోయి నటించాడు. అలరించాడు.
వల్లభ పాత్రలో తారక్ పొన్నప్ప నెగటివ్ రోల్‌లో అదరగొట్టాడు. తనకు యాప్ట్ గా అనిపించే పాత్రలో జీవించాడు. వీరితోపాటు ఆనంద్, లక్ష్మీ గోపాల స్వామి, కళ్యాణి నటరాజన్ వంటి వారు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.
`ది 100` మూవీ టెక్నీషియన్ల పనితీరు
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా బిగ్ బడ్జెట్ చిత్రంగా కనిపిస్తుందంటే అది కెమెరా పనితనం వల్లే అని చెప్పొచ్చు. ఇక హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ బాగుంది. బీజీఎం కూడా ఆకట్టుకుంది.
బీజీఎం విషయంలో మాస్ మూవీస్ టోన్ కనిపించింది. అది సినిమా స్థాయిని పెంచిందని చెప్పొచ్చు. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలకు కొదవ లేదు. రాజీపడలేదని ప్రతి ఫ్రేములోనూ తెలుస్తుంది.
ఇక దర్శకుడు ఎంచుకున్న కథ బాగుంది. దాన్ని మరింత రేసీగా తెరకెక్కించాల్సింది. ట్విస్ట్ లు, వాహ్ ఫ్యాక్టర్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లు మరింత జోడించాల్సింది. ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ కొంత స్లో అనిపిస్తుంది. కానీ చెప్పిన పాయింట్ మాత్రం బాగుంది.
ఎమోషనల్‌గా సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది. సెకండాఫ్‌ని, క్లైమాక్స్ ని డీల్ చేసిన తీరు బాగుంది. సాఫ్ట్ వేర్ రంగంలో జరిగే ఒక పచ్చినిజాన్ని చెప్పే ప్రయత్నం చేయడం అభినందనీయం.
ఫైనల్‌గాః ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ `ది 100`. సాగర్‌ని బిగ్ స్క్రీన్‌పై నిలబెట్టే మూవీ.
రేటింగ్‌ః 2.75