- Home
- Life
- Paneer Sweet: ఇంట్లో కొన్ని పనీర్ ముక్కలు ఉంటే చాలు, వాటితో టేస్టీ పాయసం సులువుగా చేసేయొచ్చు
Paneer Sweet: ఇంట్లో కొన్ని పనీర్ ముక్కలు ఉంటే చాలు, వాటితో టేస్టీ పాయసం సులువుగా చేసేయొచ్చు
పాయసం అనగానే సేమ్యా లేదా అన్నంతో చేసేదే గుర్తొస్తుంది. పనీర్‌తో చేసి చూడండి అద్భుతంగా ఉంటుంది. రెసిపీ కూడా చాలా సులువు. పనీర్ పాయసం (Paneer Sweet) రెసిపీ ఇదిగో.

దీపావళికి పనీర్ పాయసం
దీపావళి వచ్చేస్తోంది.. ఆ రోజు కచ్చితంగా ఏదో ఒక స్వీట్ తయారు చేయాల్సిందే. లక్ష్మీదేవికి నైవేద్యంగా ఇంట్లోనే స్వీట్ ని తయారు చేసి పెడతారు. సింపుల్ గా అయిపోయే స్వీట్ రెసిపీ మేము ఇక్కడ ఇచ్చాము. అదే పనీర్ ఖీర్. ఇంట్లో కొన్ని పనీర్ క్యూబ్స్ ఉంటే చాలు అప్పటికప్పుడు ఈ పనీర్ తయారు చేసి పెట్టవచ్చు.
పనీర్ ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు
పనీర్ ఖీర్ తయారు చేయడానికి మీరు పనీర్ ను తెచ్చి పెట్టుకోవాలి. 200 గ్రాములు నుంచి 300 గ్రాముల పనీర్ అవసరం పడుతుంది. ఇంట్లో వాళ్ళ సంఖ్యను బట్టి పనీర్ ను తెచ్చుకోవాలి. ఇద్దరే ఉంటే 50 గ్రాముల పనీర్ అయినా చాలు. ఇక రెండు లీటర్ల ఫుల్ క్రీం పాలు కూడా అవసరం. పంచదార, జీడిపప్పులు, పిస్తా పప్పులు, బాదం పప్పులు, ఎండు ద్రాక్ష, రెండు స్పూన్ల నెయ్యి వంటివి గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవాలి.
రెసిపీ ఇదిగో
స్టవ్ మీద పెద్ద కళాయిని పెట్టి అందులో నెయ్యి వేసి బాదం, జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష వంటివి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులోనే పాలు పోసి మరిగించుకోవాలి. పాలు బాగా మరిగాక పనీరును సన్నగా తురిమి అందులో వేసి బాగా కలుపుకోవాలి.అది బాగా కలిశాక పంచదార కూడా వేసి కలపాలి. పంచదార మొత్తం కరిగిపోవాలి. ఆ తరువాత ముందుగా వేయించి పెట్టుకున్నా డ్రైఫ్రూట్స్ ని కూడా అందులో వేసి బాగా కలపాలి.
చిన్న మంట మీద
ఈ మిశ్రమం దగ్గరగా వచ్చేవరకు కలుపుతూనే ఉండాలి. దాదాపు పది నిమిషాలు పాటు మరిగించాల్సి వస్తుంది. ఇది పాయసంలాగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. కావాలనుకుంటే మరొక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు. అంతే టేస్టీ పనీర్ కి సిద్ధమైపోయినట్టే. దీన్ని మీరు చాలా సులువుగా వండవచ్చు. కష్టపడాల్సిన అవసరం లేదు. దీపావళికి ఈ పనీర్ ఖీర్ వండేందుకు ప్రయత్నించండి. కచ్చితంగా ఇది ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.
పనీర్ ఖీర్ లో కేలరీలు
ఈ పనీర్ ఖీర్ లో కేలరీలు అధికంగానే ఉంటాయి. ఎందుకంటే దీనిలో మనం, పనీర్, ఫుల్ క్రీం పాలు, పంచదార, బాదంపప్పులు, జీడిపప్పులు వంటివన్నీ వేసాము. ఇవన్నీ కూడా శరీరానికి చాలా బలాన్ని ఇస్తాయి. అలాగే కేలరీలను కూడా అధికంగా ఇస్తాయి. కాబట్టి తక్కువ మొత్తంలోనే తినడం మంచిది. ఇక డయాబెటిస్ ఉన్నవారు మాత్రం ఈ పనీర్ ఖీర్ జోలికి రాకపోవడమే ఉత్తమం. ఇందులో నిండుగా క్యాలరీలు, అలాగే పంచదార ఉంటాయి. ఇవి మధుమేహులకు హానిచేస్తాయి.