- Home
- Life
- Kobbari bellam Barfi: కొబ్బరి, బెల్లం, శెనగపిండి.. ఈ మూడింటితో టేస్టీ బర్ఫీ చేసేయండి, రెసిపీ చాలా సులువు
Kobbari bellam Barfi: కొబ్బరి, బెల్లం, శెనగపిండి.. ఈ మూడింటితో టేస్టీ బర్ఫీ చేసేయండి, రెసిపీ చాలా సులువు
పండుగల సమయంలో కచ్చితంగా ప్రతి ఇంట్లో స్వీట్లు చేస్తారు. ఇక్కడ మేము కొబ్బరి బెల్లం బర్ఫీ (Kobbari bellam Barfi) రెసిపీ ఇచ్చాము. ఇది చేయడానికి చాలా తక్కువ పదార్థాలే అవసరం పడతాయి. ఈ రెసిపీ కూడా చాలా సులువు. కేవలం పావుగంటలో ఈ స్వీట్ సిద్ధమైపోతుంది.

ఇంట్లోనే సింపుల్ స్వీట్
బయటకొనే స్వీట్లు కన్నా ఇంట్లో చేసే స్వీట్లు రుచిగాను, శుచిగాను ఉంటాయి. పండుగల వేళ మీరు ఇంట్లోనే సింపుల్ గా అయ్యే స్వీట్ రెసిపీ కోసం వెతుకుతున్నారా? అయితే ఇక్కడ మేము కొబ్బరి బెల్లం బర్ఫీ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు.. నోట్లో పెడితే చాలు వెన్నలా కరిగిపోయేలా ఉంటుంది. ఈ కొబ్బరి బెల్లం బర్ఫీ చేయడానికి ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు. కేవలం పావుగంట నుంచి 20 నిమిషాల్లో ఇది సిద్ధమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కొబ్బరి బెల్లం బర్ఫీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
కొబ్బరి బెల్లం బర్ఫీ చేసేందుకు కొబ్బరి ముక్కలు అర కప్పు, శెనగపిండి ఒక కప్పు, నెయ్యి పావు కప్పు సిద్ధంగా పెట్టుకోండి. బెల్లం పావు కిలో, పాలు ముప్పావు కప్పు, యాలకుల పొడి పావు స్పూను తీసి పెట్టుకోవాలి. ఇక స్వీట్ చేసేందుకు రెడీ అవ్వాలి.
కొబ్బరి బెల్లం బర్ఫీ రెసిపీ ఇదిగో
పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి. అది తురుములాగా అవుతాయి. ఇప్పుడు తురిమిన బెల్లాన్ని మిక్సీ జార్ లో వేయండి. అందులోనే యాలకుల పొడి, పాలు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తరువాత అందులో పాలు, బెల్లం, యాలకుపొడి కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నెయ్యి వేయండి. ఆ నెయ్యిలో శెనగపిండిని వేసి చిన్న మంట మీద కలుపుతూ ఉండండి. మంట కచ్చితంగా చిన్నగానే పెట్టుకోవాలి. లేకుంటే అది త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది. ఒక ఐదు నిమిషాలు పాటు అలా వేయించిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసి మళ్లీ కలపండి.
పావుగంటలో స్వీట్ రెడీ
ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి. ఇది దగ్గరగా అయ్యేవరకు మంట మీద ఉడికిస్తూనే ఉండాలి. గరిటెతో కలపడం కూడా ఆపకూడదు. లేకుంటే అది కళాయికి అతుక్కుపోతుంది. కొబ్బరి మిశ్రమం దగ్గరగా అయిన తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసి మళ్లీ కలపండి. ఇది హల్వా లాగా గట్టిగా మారుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో అడుగు బాగానే నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని వేసి ఉంచండి. అది ఆరిపోయాక మందంగా బర్ఫీ ముక్కల్లాగా కోసుకోండి. అంతే టేస్టీ కొబ్బరి బెల్లం బర్ఫీ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇదంతా పావుగంటలో సిద్ధమైపోతుంది.
బెల్లమే మంచిది
ఈ కొబ్బరి బెల్లం బర్ఫీ రెసిపీలో మన ఆరోగ్యానికి మేలు చేసే బెల్లాన్ని వినియోగించాము. కాబట్టి ప్రతిరోజూ ఒక బర్ఫీ ముక్క తినడం వల్ల శరీరానికి ఇనుము అందుతుంది. కొంతమంది దీనిలో పంచదార వేసి చేస్తారు. అలాంటి బర్ఫీ ఆరోగ్యానికి మేలు చేయదు. కాబట్టి బెల్లాన్ని వాడడం మంచిది. ఈ బెల్లం బర్ఫీలో వాడిన ప్రతి ఒక్కటి మనకు పోషకాలను ఇచ్చేదే. పచ్చి కొబ్బరి ముక్కలు, నెయ్యి, శెనగపిండి, యాలకులు, పాలు అన్నీ కూడా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ కొబ్బరి బెల్లం బర్ఫీ చేసేందుకు సిద్ధమైపోండి.