ఎక్కువసార్లు ఆవలిస్తే ఏదైనా జబ్బున్నట్టా? ఆవలిస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయి?
సాధారణంగా నిద్ర వచ్చే ముందు ఆవలింతలు వస్తాయి. లేదా ఒకరిని చూసి మరొకరికి వస్తుంటాయి. అయితే ఆవలించినప్పుడు మనకు తెలియకుండానే కళ్ల నుంచి నీళ్లు వస్తుంటాయి. దీనికి కారణం ఏంటో మీకు తెలుసా?

మనుషుల నుంచి జంతువుల వరకు ఆవలింత సహజంగా అందరికీ వస్తుంది. సాధారణంగా నిద్ర వస్తే ఆవలింత వస్తుందంటారు. అసలు ఆవలింత ఎందుకు వస్తుంది? అది వచ్చినప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయి?
ఎందుకు వస్తుంది?
ఆవలింత రావడానికి ప్రధాన కారణం మెదడు. మన శరీర ఉష్ణోగ్రత 30 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. మెదడు ఉష్ణోగ్రత ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు మెదడు ఆవలింతను ప్రేరేపిస్తుంది. ఒక వ్యక్తికి రోజుకి సగటున 20 సార్లు ఆవలింత వస్తుందట. గర్భంలో ఉన్న శిశువు కూడా ఆవలిస్తుందట.
ఎక్కువగా వస్తే సమస్యా?
ఆవలింత రావడం సమస్య కాదు. కానీ అది ఎక్కువగా రావడమే సమస్య. సాధారణంగా లివర్ సమస్య, మెదడు, చేతులు, కాళ్ళ నొప్పులు, సరిగ్గా నిద్రపోకపోవడం లాంటి వాటి వల్ల ఆవలింత ఎక్కువగా వస్తుంది. అలాగే కొన్ని మందుల దుష్ప్రభావాల వల్ల కూడా ఆవలింతలు వస్తాయి. మెదడుకు అవసరమైన పోషకాలు అందకపోయినా లేదా చురుగ్గా లేకపోయినా ఆవలింతలు ఎక్కువగా వస్తాయి.
కన్నీళ్లు ఎందుకు?
ఆవలింత వచ్చినప్పుడు కన్నీళ్లు ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ప్రధాన కారణం కనుబొమ్మల కింద ఉండే లాక్రిమల్ గ్రంథులు. సాధారణంగా ఈ గ్రంథులు మనం ఏడ్చినప్పుడు కన్నీళ్లను ఉత్పత్తి చేస్తాయి. ఆవలింత వచ్చినప్పుడు మన కండరాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల లాక్రిమల్ గ్రంథులపై ఒత్తిడి పెరిగి కన్నీళ్లు బయటకు వస్తాయి.
కన్నీళ్లు రాకపోతే ఏంటి?
ఆవలింత వచ్చినప్పుడు అందరికీ కన్నీళ్లు వస్తాయని చెప్పలేం. కొంతమందికి రాకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం కళ్ళు పొడిగా ఉండటమే. కళ్ళు పొడిగా ఉంటే లాక్రిమల్ గ్రంథులు కన్నీళ్లను ఉత్పత్తి చేయడం కష్టం. అందుకే కొంతమందికి ఆవలింత వచ్చినా కన్నీళ్లు రావు.
ఆవలింత వచ్చినప్పుడు కన్నీళ్లు రావాలని లేదు. అది సహజం కాబట్టి రావచ్చు, రాకపోవచ్చు.