Heart Attack: శీతాకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎందుకు పెరుగుతుంది?
Heart Attack: గుండెపోటు వచ్చే ప్రమాదం చలికాలంలో అధికంగా ఉంటుంది. శీతాకాలంలో గుండె పోటు పెరగడానికి కారణం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా అవగాహన పెంచుకోవాలి.

చలికాలంలోనే గుండెపోటు ఎందుకు?
శీతాకాలం వచ్చిందంటే వాతావరణంలో చలి పెరుగుతుంది. ఈ సమయంలో సాధారణంగా జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హార్ట్ అటాక్ ప్రమాదం చలికాలంలో ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. సాధారణంగా గుండెపోటు ఎప్పుడైనా రావచ్చు. కానీ శీతాకాలంలో శరీరంపై పడే అదనపు ఒత్తిడి కారణంగా గుండెకు పని భారం పెరుగుతుంది. దీని వల్ల ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు, హై బీపీ, షుగర్, అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
రక్తపోటు పెరిగిపోతుంది
చలికాలంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు శరీరంలో రక్తనాళాలు సంకోచిస్తాయి. అంటే రక్తనాళాలు చిన్నవిగా మారతాయి. దీంతో రక్తం సరిగా ప్రవహించడానికి గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో రక్తపోటు పెరుగుతుంది. రక్తపోటు అధికంగా ఉండటం గుండెపోటుకు ప్రధాన కారణాల్లో ఒకటి. అలాగే చలి వల్ల రక్తం మందంగా మారే అవకాశం కూడా ఉంటుంది. రక్తం మందంగా మారితే రక్త గడ్డలు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఈ గడ్డలు ఏర్పడితే, రక్త సరఫరా ఆగిపోయి గుండెపోటు సంభవించవచ్చు. అందుకే చలికాలంలో గుండె ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్త అవసరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి ఆహారాలు
శీతాకాలంలో జీవనశైలిలో వచ్చే మార్పులు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. చలి ఎక్కువగా ఉండటంతో చాలామంది బయటకు వెళ్లి నడక లేదా వ్యాయామం చేయడానికి ఆసక్తి చూపరు. దీంతో శారీరక చలనం తగ్గిపోతుంది. శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి బరువు పెరగడం జరుగుతుంది. అలాగే ఈ కాలంలో వేడి కోసం ఎక్కువగా కొవ్వు పదార్థాలు, మసాలా ఆహారం, తీపి పదార్థాలు తినే అలవాటు పెరుగుతుంది. కొందరు ఆల్కహాల్ తాగడాన్ని పెంచుతారు. ఇవన్నీ కలిసి బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. అంతేకాదు శీతాకాలంలో జలుబు, ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తాయి. ఇవి శరీరంపై అదనపు ఒత్తిడి కలిగించి గుండె పనితీరుపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో ఉంటారు.
ఈ జాగ్రత్తలు
అయితే సరైన జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బయటకు వెళ్లేటప్పుడు సరైన బట్టలు ధరించాలి. రక్తపోటు, షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. ఆహారంలో కొవ్వు, ఉప్పు తక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, వేడి నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది. చలి ఉన్నా కూడా ఇంట్లోనే నడక, లైట్ వ్యాయామాలు చేయాలి. ఆల్కహాల్, పొగతాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అకస్మాత్తుగా అలసట వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. చలికాలంలో చిన్న జాగ్రత్తలతోనే గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

