Red Ant Chutney: ఎర్ర చీమల పచ్చడిని అంత ఇష్టంగా ఎందుకు తింటారు? రుచి ఎలా ఉంటుంది?
Red Ant Chutney: చెట్ల తొర్రల్లో ఉండే చిన్న ఎర్ర చీమలను పట్టుకొచ్చి, ఘాటైన పచ్చడిగా చేసుకుని తింటారు కొన్ని రాష్ట్రాల్లో. ముఖ్యంగా ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోని ప్రజలు తింటారు. దీన్ని మార్కెట్లు, హోటళ్లలో అమ్ముతారు కూడా.

ఎర్ర చీమల పచ్చడి గురించి తెలుసా?
మీరు ఏదైనా హోటల్ కి వెళ్లినప్పుడు మెనూ కార్డులో ఎర్ర చీమల పచ్చడిని చూశారా? చెట్ల మీద బారులు తీరి వెళ్లే ఎర్ర చీమలను ఏరితెచ్చి పచ్చడి నూరి తింటారు. ఒడిశా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని గిరిజనులు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. తరతరాలుగా అక్కడి గిరిజనులకు ఈ ఎర్ర చీమల పచ్చడి ఇది.
అడవిలో ఉండే 'రెడ్ వీవర్ యాంట్స్' (Red Weaver Ants) అని పిలిచే ఈ ఎర్ర చీమలను స్థానికులు 'కాయ్' (Kai) అని పిలుస్తారు. అందుకే వీటితో చేసే పచ్చడికి 'కాయ్ చట్నీ' అని పేరు వచ్చింది. 2024 జనవరి 2న ఒడిశాలోని మయూర్‌భంజ్‌కు చెందిన "సిమిలిపాల్ కాయ్ చట్నీ"కి అధికారికంగా భౌగోళిక గుర్తింపు (GI Tag) లభించింది. దీంతో ఈ పచ్చడికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు దక్కింది.
ఈ చీమలను ఎలా పట్టుకుంటారు?
ఎర్ర చీమల పచ్చడి తయారీ విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అటవీ ప్రాంతంలోకి వెళ్లే జనాలు, చెట్ల ఆకులను కలిపి కుట్టి చీమలు కట్టుకునే గూళ్లపై కన్నేస్తారు. ఎక్కువగా తెల్లవారుజామునే ఈ గూళ్లను సేకరిస్తారు. చీమలతో పాటే వాటి గుడ్లను కూడా జాగ్రత్తగా తీసుకుంటారు. అయితే, ఇదేమీ అంత సులువైన పని కాదు. ఈ ఎర్ర చీమలు కుడితే చర్మంలోకి సూది గుచ్చినంత భయంకరమైన నొప్పి రావడంతో పాటు దద్దుర్లు కూడా వస్తాయి. అందుకే ఈ గూళ్లను సేకరించే వాళ్లు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తారు.
=ఘాటైన సంప్రదాయ వంటకం
గూటి నుంచి చీమలను, గుడ్లను జాగ్రత్తగా సేకరించిన తర్వాత, వాటిని శుభ్రం చేసి వంట మొదలుపెడతారు. శుభ్రం చేసిన చీమలకు ఉప్పు, అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి కలిపి మసాలాగా నూరుతారు. మరింత రుచి కోసం పుదీనా కూడా కలుపుతారు. చివరగా కారం, పులుపు సమపాళ్లలో కలిసి నోట్లో నీళ్లూరించేలా అద్భుతమైన పచ్చడి తయారవుతుంది. మన దగ్గర గోంగూర పచ్చడి ఎలాగో, వాళ్లకు ఈ కాయ్ చట్నీ అలా అన్నమాట. స్థానికులు ఈ పచ్చడిని వేడివేడి అన్నం, రాగి సంగటి లాంటి సంప్రదాయ వంటకాలతో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు.
ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రొటీన్, కాల్షియం, ఐరన్, జింక్, విటమిన్ బి-12 లాంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో నిండి ఉన్నాయి. అందుకే ఇది కేవలం సంప్రదాయ వంటకం మాత్రమే కాదు, వందలాది గిరిజన కుటుంబాలకు ప్రధాన జీవనాధారంగా మారింది.

