ఉత్తరం వైపు తల పెట్టి ఎందుకు పడుకోకూడదు? శాస్త్రమే కాదు, సైన్స్ కూడా ఇదే చెప్తోంది..
మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే తీసుకునే ఆహారం మంచి జీవనశైలి ఎంత ముఖ్యమో, నిద్ర కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ నిద్ర విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా నిద్రించే సమయంలో తల ఎటు వైపు పెట్టి పడుకుంటున్నామనేది చాలా ముఖ్యమని అంటుంటారు. అటు శాస్త్రంతో పాటు, ఇటు సైన్స్ కూడా ఈ విషయాన్ని చెబుతోంది..
సాధారణంగా పడుకున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లో తలను ఉత్తరం వైపు పెట్టి పడుకోకూడదని పెద్దలు చెబుతుంటారు. ఉత్తరం వైపు తలపెట్టుకొని పడుకుంటే మృత్యువు సంభవిస్తుందని చెబుతుంటారు. వినాయకుడిని రక్షించుకునే క్రమంలో శివుడు కూడా ఉత్తర దిశకు తలపెట్టుకొని నిద్రిస్తున్న వారి తలను తీసుకురమ్మని చెబుతారన్న పురాణ ఇతిహాసలు కూడా మనకు తెలుసు. అంటే ఉత్తరం వైపు నిద్రించడం మంచిది కాదని చెప్పేందుకు ఇదొక సాక్ష్యంగా విశ్వసిస్తుంటారు.
ఇక దక్షిణ, ఉత్తర దిశలో యమదూతుల ఉంటారని అందుకే ఆ దిశలో తలపెట్టుకుని పడుకుంటే మృత్యువు సంభవిస్తుందని అంటుంటారు. అలాగే శాస్త్రాల ప్రకారం పడమర వైపు తలపెట్టుకొని పడుకోవడం కూడా మంచిది కాదని విశ్వసిస్తారు. అందుకే తూర్పు లేదా దక్షిణం వైపు తలపెట్టుకొని పడుకోవడం మంచిదని చెబుతుంటారు. అయితే ఉత్తర దిశలో తల పెట్టుకుని పడుకోవడం వల్ల నష్టం అనేది కేవలం శాస్త్ర పరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచిది కాదని నిపుణులు చెబుతుంటారు. ఇంతకీ సైన్స్ ఏం చేబుతోందంటే..
భూమి అతి పెద్ద అయస్కాంతం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే మానవ శరీరం కూడా ఒక అయస్కాంత క్షేత్రంలాగే పనిచేస్తుంది. శరీరానికి కేంద్ర స్థానమైన హృదయం నుంచి రక్తం శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరిస్తుంది. మళ్లీ గుండెకు తిరిగి చేరుకుంటుంది. సాధారణంగా అయస్కాంత ప్రభావం ఉత్తర, దక్షిణ దిశల్లో కేంద్రీకృతమై ఉంటుంది. కాబట్టి ఉత్తర దిశలో తల పెట్టుకుని పడుకుంటే భూఅయస్కాంత ప్రభావం శరీర అయస్కాంత క్షేత్రంపై ప్రభావం పడుతుంది. దీంతో శరీరంలో రక్తప్రసరణలో హెచ్చు తగ్గులు ఏర్పడుతుంటాయి.
ఉత్తర దిశలో తలపెట్టుకుని పడుకోవడం వల్ల రక్తంలోని ఐరన్ అయస్కాంత ప్రభావానికి గురవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర దిశకు ఎక్కువగా ఆకర్షించబడడంతో మెదడులోకి రక్త ప్రవాహం ఎక్కువుతుంది. ఈ కారణంగా గుండెపై ఎక్కువ ప్రభావం పడుతుంది. ఇది బీపీ, గుండె సంబంధిత సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఉత్తర దిశలో పడుకుంటే రాత్రుళ్లు సరిగ్గా నిద్రపట్టకపోవడం, తలనొప్పి, నిద్రలో మెలకువా రావడం వంటి లక్షణాలు కనిపించడానికి ఇదే కారణమని చెబుతుంటారు. అందుకే అటు శాస్త్రపరంగా, ఇటు సైన్స్ పరంగా కూడా ఉత్తర దిశలో తలపెట్టుకుని పడుకోవడం మంచిది కాదని చెబుతున్నారు.