Salt Capital: మన దేశపు ఉప్పు రాజధాని.. దేశంలో మొత్తం ఉప్పు ఇక్కడే తయారౌతుంది..!
Salt Capital: ప్రతి కిచెన్ లో ఉండే కామన్ వస్తువు ఉప్పు. మరి, మన ఇంట్లోకి ఉప్పు ఎలా వచ్చింది? మన దేశంలో ఉప్పు రాజధాని ఏదో తెలుసా? ఆసియాలోనే అతి పెద్ద ఉప్పు సామ్రాజ్యం మన దేశంలోనే ఉందా?

మన వంటింటికి ఉప్పు వచ్చేది ఇక్కడి నుంచే..
రుచి చూడటానికి చిటికెడే... కానీ, ఆ చిటికెడు ఉప్పు లేకపోతే.. ఎంతటి గొప్ప వంటకానికైనా రుచి రాదు. పప్పులు, కూరల నుంచి మన ఇంట్లో ప్రతిరోజూ వాడే ఈ ఉప్పు అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక కోటి ఎకరాల తెల్లటి ఎడారి, సుదీర్ఘమైన సముద్ర తీరం కలిసి భారతదేశానికే ఉప్పు అందిస్తున్న తెల్లటి సామ్రాజ్యం మన దేశంలో ఎక్కడ ఉందో తెలుసా? మన దేశపు సాల్ట్ క్యాపిటల్ గా మారిన ఆ ప్రత్యేక రాష్ట్రం ఏదో ఇప్పుడు చూద్దాం...
ఉప్పు తయారయ్యేది ఇక్కడే...
మన దేశపు ఉప్పు రాజధాని గుజరాత్. భారతదేశపు మొత్తం ఉప్పు ఉత్పత్తిలో గుజరాత్ ఒక్కటే ఏకంగా 87.4 శాతం వాటా కలిగి ఉంది. గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్ మూడు రాష్ట్రాలు కలిసి దేశంలో 98.8శాతం ఉప్పు ఉత్పత్తి చేస్తే.. అందులో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది.
ముఖ్యంగా గుజరాత్ లోని కచ్ అనే ప్రాంతం దీనికి అత్యంత కీలకంగా నిలిచింది. ఇక్కడికి వెళ్లి చూస్తే.. తెల్లటి మంచులాగా ఉప్పు పరిచి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక్కడి విశాలమైన ఉప్పు నేలలు నీరు ఇంకిపోయిన తర్వాత.. తెల్లగా మంచులా కనిపిస్తాయి. దూరం నుంచి చూడటానికి చాలా అందంగా కనపడుతుంది.
గుజరాత్ లోని దాహేజ్, భావ్ నగర్, జామ్ నగర్, మీతాపూర్, రాజులా, గాంధీధామ్, కాండ్లా, మలియా, కచ్ పరిసర ప్రాంతాలు ఉప్పు ఉత్పత్తికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ సముద్రపు నీటితో పాటు భూగర్భంలో ఉండే ఉప్ు నీటి నుంచి కూడా ఉప్పును ఇక్కడ తయారు చేస్తారు.
ఇక్కడ ఉప్పు ఎలా తయారు చేస్తారు..?
దూరం నుంచి చూస్తే ఉప్పు తయారీ చాలా తేలికగా అనిపించినప్పటికీ, దీని వెనక ఎంతో శ్రమ దాగి ఉంటుంది. సముద్రపు నీటిని తీర ప్రాంతాల్లో తక్కువ లోతు ఉన్న మడల్లోకి మళ్లిస్తారు. తీవ్రమైన ఎండల వల్ల ఆ నీరు ఆవిరైపోయి.. కింద ఉప్పు స్పటికాలు మాత్రమే మిగులుతాయి. ఆ తర్వాత, ఉప్పు స్పటికలను శుద్ది చేసి ప్రాసెస్ చేసిన తర్వాత.. అది మన ఇంటికి చేరుతుంది. ఈ విధానం పూర్తిగా ఎండలు, తక్కువ వర్షపాతం, అనుకూలమైన నేల స్వభావంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ లభించే ఉప్పు.. కేవలం మన దేశ అవసరాలు తీరడమే కాకుండా మిగులు ఉప్పును ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం.
ఇక.. కచ్ లోనే ఎక్కువ ఉప్పు తయారౌతుంది. ఇక్కడి నేలలు పూర్తిగా ఉప్పు నేలలే. ఈ ప్రదేశం.. ఉప్పు పరిశ్రమకు మాత్రమే కాకుండా, ఇక్కడి ఆహార సంస్కృతికి కూడా చాలా ఫేమస్. ప్రసిద్ధ రన్ ఉత్సవ్ సమయంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఆ ఉప్పు మైదానాలను చూసి మైమరిచిపోతారు. అంతేకాదు.. ఇక్కడి ట్రెడిషనల్ వంటలు కూడా పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.













