Chai Bisuits: చాయ్ బిస్కెట్లు దేనితో తయారు చేస్తారో తెలిస్తే ఈరోజే తినడం మానేస్తారు
Chai Bisuits: టీ తాగుతూ కొన్ని రకాల బిస్కెట్లు తినేవారు ఎంతోమంది. అందుకే మార్కెట్లో చాయ్ బిస్కెట్లు పేరుతో విపరీతంగా అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ అవి వేటితో తయారుచేస్తారో, అవి తినడం వల్ల ఆరోగ్యానికి ఏం జరుగుతుందో తెలుసా?

టీతో తినే బిస్కెట్లు
టీ తాగనిదే భారతీయుల్లో సగం మందికి తెల్లారదు. ఉదయం లేచిన వెంటనే అయినా, సాయంత్రం వేళ అయినా చాయ్‌తో పాటు రెండు బిస్కెట్లు తినడం చాలామందికి అలవాటుగా మారింది. ముఖ్యంగా చాయ్ బిస్కెట్లు అని పిలిచే బిస్కెట్లు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తాయి. ఇవి తేలికగా ఉంటాయని, జీర్ణం త్వరగా అవుతాయని, ఆరోగ్యానికి మంచివని చాలామంది నమ్ముతారు. కానీ నిజంగా ఈ చాయ్ బిస్కెట్లు దేనితో తయారు చేస్తారు? వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
ఏ పిండితో తయారుచేస్తారు?
సాధారణంగా చాయ్ బిస్కెట్లను శుద్ధి చేసిన గోధుమ పిండి లేదా మైదాతో తయారు చేస్తారు. దీనిలో చక్కెర, వెజిటబుల్ ఫ్యాట్, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వంటి పదార్థాలు కలుపుతారు. కొన్నిరకాల బిస్కెట్లలో పాలు, గ్లూకోజ్ సిరప్, కృత్రిమ ఫ్లేవర్లు కూడా ఉంటాయి. తయారీ సమయంలో పిండిని బాగా కలిపి, కావాల్సిన ఆకారాల్లో కోసి, అధిక ఉష్ణోగ్రత దగ్గర బేక్ చేస్తారు. అందువల్ల ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా తయారవుతాయి. అయితే ఇందులో ఉపయోగించే మైదా పూర్తిగా శుద్ధి చేసిన పిండి కావడం వల్ల, దానిలో సహజ ఫైబర్, పోషకాలు ఏమీ ఉండవు.
అతిగా ఆకలి వేస్తుంది
ఆరోగ్యపరంగా చూసుకుంటే చాయ్ బిస్కెట్లను తినడం వల్ల అధిక కార్బోహైడ్రేట్లు,చక్కెర అధికంగా శరీరంలో చేరుతాయి. ఇవి తిన్న వెంటనే శరీరానికి తక్షణ శక్తి ఇస్తాయి. కానీ ఆ శక్తి ఎక్కువసేపు నిలవదు. రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగి, కొంతసేపటికి తగ్గిపోతుంది. దీనివల్ల మళ్లీ అతిగా ఆకలి వేయడం, అలసట రావడం జరుగుతుంది. అలాగే బిస్కెట్లలో ఉపయోగించే వెజిటబుల్ ఫ్యాట్స్ లేదా హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి ఎక్కువగా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ పెరగడం వంటి ప్రమాదాలు ఉండవచ్చు.
వీరు తినకూడదు
పిల్లలు, వృద్ధులు, షుగర్ లేదా బీపీ ఉన్నవారు రోజూ ఎక్కువగా చాయ్ బిస్కెట్లు తినడం మంచిది కాదు. ఎందుకంటే వీటిలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు పెద్దగా ఉపయోగం ఉండదు. అలాగే ఇవి పొట్ట నిండిన భావన ఇవ్వవు. చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులుగా చాయ్ బిస్కెట్లు తిని ఉండిపోదామని అనుకుంటారు. కానీ ఇది సరైన అలవాటు కాదు. పోషకాలు, ప్రోటీన్లు, విటమిన్లు తక్కువగా ఉండే ఈ బిస్కెట్లు శరీరానికి అవసరమైన సమతుల ఆహారాన్ని అందించలేవు.
పూర్తిగా తినడం మానేయాలా?
చాయ్ బిస్కెట్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. మైదాతో చేసిన బిస్కెట్లు కాకుండా ఓట్స్, మల్టీగ్రెయిన్, రాగి వంటి ధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లను ఎంపిక చేసుకోవాలి. వీటిలో ఫైబర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినా లేబుల్ చదివి చక్కెర, ఫ్యాట్ పరిమాణాన్ని గమనించి కొనడం మంచిది. చాయ్‌తో పాటు బిస్కెట్లకు బదులుగా పండ్లు, ముక్కలుగా కట్ చేసిన కూరగాయలు, నానబెట్టిన వేరుశెనగలు లేదా ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే చాయ్ బిస్కెట్లు సౌకర్యం కోసం తినే ఆహారం తప్ప, పూర్తిగా ఆరోగ్యకరమైనవి కాదని గుర్తుంచుకోవాలి.

