High blood pressure: నడిస్తే హై బీపీ తగ్గుతుందా..?
High blood pressure:నడక మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలుసు. అందుకే ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ నడక రక్తపోటును కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

walking
నడకతో ఎన్నో రోగాలు మటుమాయం అవుతాయి. అందుకే రోజుకు కనీసం 30 నిమిషాలైనా ప్రతి ఒక్కరూ నడవాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతూ ఉంటారు. నడవడం వల్ల శరీరంలోని కణజాలాలు బలోపేతం అవుతాయి. బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే నడిస్తే శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వు పదార్థాలు కరిగిపోతాయి.
walking
వీటన్నింటితో పాటుగా నడక రక్తపోటును కూడా నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును.. నడక తక్కువ రక్తపోటుకు దారితీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. Current Hypertension Reports లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. నడక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన డా. మహ్మద్ అల్ రిఫాయ్ మాట్లాడుతూ.. నడక వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తెలిపారు.
కాగా ఈ హైపర్ టెన్షన్ యు.ఎస్ లో 47% మందిని ప్రభావితం చేస్తుంది. కాగా నడక అధిక రక్తపోటు పేషెంట్లకు ఎంతో మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నడవడం వల్ల శరీరం ఉత్తేజంగా మారడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటుంది. నడక వల్ల శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
మధుమేహులు కూడా ప్రతి రోజు కనీసం ఒక గంటపాటు నడిచినా.. రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు. అంతేకాదు నడక బిఎమ్ఐ (BMI)స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే కండరాలు బాడీలోని గ్లూకోజ్ ను సమర్థవంతంగా ఉపయోగిస్తాయని తేలింది.
ఇకపోతే అధిక రక్తపోటు పేషెంట్లు ప్రతిరోజు ఉదయం పూట 30 నిమిషాలు నడిచినా.. మందు బిల్లలు వేసుకోకుండానే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని అధ్యయనం కనుగొంది. ట్రెడ్ మిల్ నడక దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటుందని అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో 55, 80 ఏండ్ల మధ్య వయసున్న 35 మంది ఆడవారు, 32 మంది మగవారు పాల్గొన్నారు.
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతో స్ట్రోక్, గుండెపోటు వంటి ప్రమాదాలు కూడా చాలా వరకు తగ్గుతాయని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రతిరోజూ ఉదయం కాసేపు నడవడం వల్ల శరీరం, మనస్సు రెండూ ఉత్తేజితమవుతాయి. అందుకే క్రమం తప్పకుండా ఉదయం పూట 30 నిమిషాలైనా శరీరమంతా కదిలేలా నడవాలని నిపుణులు సూచిస్తున్నారు.