దీపావళి మట్టి ప్రమిదలను ఇలా వాడేయండి.. స్టీలు గిన్నెలు తళతళ మెరుస్తాయి
దీపావళి తరువాత మట్టి ప్రమిదలు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? వాటితో ఇంట్లోని స్టీలు సామాన్లను తళతళ మెరిసేలా చేయవచ్చు.ఇత్తడి, రాగి గిన్నెలను కూడా ఈ మట్టి ప్రమిదలతో మెరిపించేయవచ్చు.

మట్టి ప్రమిదలను పడేయకండి
దీపావళి వంటి పండుగల తర్వాత ఇళ్లలో పాత మట్టి ప్రమిదలు పెద్ద సంఖ్యలో మిగిలిపోతుంటాయి. చాలామంది వీటిని పనికిరానివిగా భావించి చెత్తబుట్టలో పడేస్తుంటారు. కానీ కొంచెం సమయం కేటాయిస్తే ఈ పాత ప్రమిదలతో ఇంట్లోని రాగి, ఇత్తడి, స్టీల్, అల్యూమినియం పాత్రలను తళతళా మెరిపించే అద్భుతమైన క్లీనింగ్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఖర్చు ఆదా అవ్వడమే కాకుండా పాత వస్తువులను తిరిగి ఉపయోగించుకున్నట్లు అవుతుంది.
మట్టి ప్రమిదలతో గిన్నెలకు మెరుపు
ఈ పౌడర్ తయారీ కోసం ముందుగా వాడిన మట్టి ప్రమిదలను వేడి నీటిలో వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల ప్రమిదలు పీల్చుకున్న నూనె, జిడ్డు పూర్తిగా బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత వాటిని ఎండలో పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టాలి. బాగా ఆరిన ప్రమిదలను తురుము పీటతో మెత్తగా అరగదీయాలి. దీనివల్ల తురుము పీటకు పదును పెరగడంతో పాటు మెత్తని మట్టి పొడి సిద్ధమవుతుంది. లేదా బరువైన వస్తువుతో ప్రమిదలను పొడి చేసి జల్లెడ పట్టవచ్చు. ఇలా తయారైన మెత్తని పొడిలో తగినంత ఉప్పు, కొద్దిగా బట్టలు ఉతికే డిటర్జెంట్ పొడి కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
ఏడాదంతా నిల్వ ఉండే పొడి
ఈ మట్టి పొడి ఎప్పటికీ పాడవకుండా ఏడాది పొడవునా నిల్వ ఉంటుంది. పాత్రలు శుభ్రం చేయాల్సినప్పుడు కొద్దిగా ఈ పొడిని తీసుకుని, అందులో అర చెక్క నిమ్మరసం పిండి పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జిడ్డు పట్టిన ఇనుప కడాయిలు, పెనం, రాగి, ఇత్తడి పాత్రలకు పట్టించి స్క్రబ్బర్‌తో రుద్ది కడిగితే అవి కొత్తవాటిలా మెరిసిపోతాయి.













