మీ బాల్కనీని సీతాకోకచిలుకల తోటగా మార్చే చిట్కాలు.. ఎలాంటి మొక్కలు పెంచాలంటే..
బాల్కనీలో మొక్కలు పెంచే వారే ఇప్పుడు అధికంగా ఉన్నారు. ఆ మొక్కలపై సీతాకోకచిలుకలు వాలుతూ ఉంటే ఆ అందమే వేరు. సీతాకోక చిలుకలు మీ బాల్కనీకి రావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.

బాల్కనీకి సీతాకోకచిలుకలు
అపార్ట్మెంట్లలో బాల్కనీలలోనే మొక్కలు పెంచుకోవాలి. నగర జీవితంలో బాల్కనీయే కేవలం నాలుగు మొక్కలు పెట్టుకునే చోటు. మనసుకు ప్రశాంతతనిచ్చే ఒక అందమైన ప్రదేశం కూడా. అయితే బాల్కనీలోకి రంగురంగుల సీతాకోకచిలుకలు రావాలంటే కేవలం పూల కుండీలు పెడితే సరిపోదు. వాటిని ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక అలంకరణలు, మార్పులు అవసరం. బాల్కనీ గోడలకు, పూల కుండీలకు ఎరుపు, పసుపు, గులాబీ, నీలిరంగుల వంటి ముదురు రంగులు వేయడం లేదా పూల చిత్రాలు గీయడం ద్వారా సీతాకోకచిలుకలు అక్కడికి సులువుగా చేరుకుంటాయి. ఆ ప్రకాశవంతమైన రంగులు వాటికి సహజమైన తోటల అనుభూతిని కలిగిస్తాయి. వీటికి తోడు కుండీలపై చిన్న చిన్న సీతాకోకచిలుకల బొమ్మలు గీయడం, రాళ్లకు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దడం వల్ల అవి ఆ ప్రదేశాన్ని సురక్షితమైనదిగా అవి భావిస్తాయి.
ఎలాంటి మొక్కలు పెంచాలి?
మొక్కల విషయానికి వస్తే కంటికి ఇంపుగా ఉండటంతో పాటు సీతాకోకచిలుకలకు అవసరమైన తీపి మకరందం అందించే రకాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా బంతి, లాంటానా, పిటూనియా, తులసి మొక్కలు వీటికి ఆహారాన్ని అందిస్తాయి. సీతాకోకచిలుకలకు తేమ, నీరు ఎంతో అవసరం కాబట్టి బాల్కనీలో ఒక చిన్న వెడల్పాటి పాత్రలో నీటిని ఉంచాలి. అందులో కొన్ని చిన్న గులకరాళ్లు వేస్తే అవి సులభంగా వాలి నీరు తాగి సేదతీరగలవు. కృత్రిమ రసాయనాలు లేదా పురుగుమందుల ప్రభావం వల్ల ఇవి బాల్కనీ వైపు రావడానికి ఇష్టపడవు. అందుకే పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో మొక్కలను పెంచుతూ సహజమైన వాతావరణాన్ని కాపాడాలి.
తగినంత వేడి,నీడ
సీతాకోకచిలుకలు ఎగరడానికి శరీరంలో వేడిని సరిచేసుకోవడానికి ఎండ చాలా అవసరం. అందుకే బాల్కనీలోకి తగినంత సూర్యరశ్మి, ఆహ్లాదకరమైన గాలి వచ్చేలా చూసుకోవాలి. ఎండ ఎంత అవసరమో, ఎక్కువసేపు ఎగిరిన తర్వాత అవి విశ్రాంతి తీసుకోవడానికి మొక్కల మధ్య చిన్నపాటి నీడ గల ప్రదేశాలు కూడా అంతే అవసరం. కఠినమైన రసాయనాలకు దూరంగా ఉంటూ, తగినంత వెలుతురు, నీడ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మీ అపార్ట్‌మెంట్ బాల్కనీ కూడా అందమైన చిరు సీతాకోకచిలుకల నందనవనంగా మారిపోతుంది.

