వీటిని తింటే మొటిమలు అవుతాయి జాగ్రత్త..
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే తగ్గ ప్రయత్నాలను కూడా చేస్తుంటారు. అయితే కొన్ని రకాల ఆహారాలు మన ఆరోగ్యాన్నే కాదు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా తగ్గిస్తాయి. అవును కొన్ని రకాల ఆహారాలను తింటే ముఖంపై మొటిమలు ఏర్పడతాయి.
మొటిమలు చిన్న సమస్యగా కనిపించినా ఇవి అందాన్ని తగ్గిస్తాయి. అలాగే ముఖాన్ని చిరాకు పెడతాయి. నొప్పిని కలిగిస్తాయి. ఇదొక సాధారణ చర్మ సమస్య. ఇవి ఎవ్వరికైనా రావొచ్చు. ప్రపంచ జనాభాలో సుమారు 10% మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. సెబమ్, కెరాటిన్ ఉత్పత్తి, మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, హార్మోన్లు, రంధ్రాలు, మంట మొదలైన వాటితో సహా మొటిమలు కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
మనం తినే ఆహారం కేవలం మన ఆరోగ్యాన్నే కాదు మన చర్మాన్ని కూడా ప్రభావితంచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొటిమల అభివృద్ధిలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇటీవలి ఒక పరిశోధనలో తేలింది. అసలు ఎలాంటి ఆహారాలను తింటే మొటిమలు అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చక్కెర
చక్కెర మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా దీన్ని అతిగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది మన ఆరోగ్యాన్నే కాదు మన చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే మొటిమలు అవుతాయి. ఎక్కువ చక్కెర ఉన్న ఆహారాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా బాగా పెరుగుతాయి. ఇది చర్మంపై నూనె మొత్తాన్ని పెంచుతుంది. అదనపు నూనె వల్ల చర్మంలో సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మొటిమలు అవుతాయి. చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. అలాగే మొటిమల వల్ల మంట కలుగుతుంది.
చాక్లెట్
చాక్లెట్లను తినని వారుండరు. అయితే డార్క్ చాక్లెట్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని లిమిట్ లో తింటే ఎలాంటి హాని జరగదు. కానీ అతిగా తింటేనే ఎన్నో అనారోగ్య సమస్యలు, చర్మ సమస్యలు వస్తాయి. చాక్లెట్ ను ఎక్కువగా తింటే మొటిమలు అవుతాయి. చాక్లెట్ల వల్ల మొటిమలు కావొద్దంటే చక్కెర తక్కువగా ఉండే చాక్లెట్ ను తినడం మంచిది.
Image: Freepik
కెఫిన్
చాలా అధ్యయనాల ప్రకారం.. కెఫిన్ మన ఆరోగ్యాన్నే కాదు మన చర్మ ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తుంది. కెఫిన్ ను ఎక్కువగా తీసుకుంటే ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఒత్తిడి హార్మోన్ల ఉత్పత్తిని పెరగడం వల్ల చర్మంలో నూనె ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీంతో మొటిమలు వస్తాయి.
జంక్ ఫుడ్
జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది వీటిని రెగ్యులర్ గా తింటుంటారు. కానీ ఇవి మన చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫాస్ట్ ఫుడ్ లో ఆయిల్, షుగర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మొటిమలు ఏర్పడతాయి. పిజ్జాలు, బర్గర్లు, సోడా, ఎక్కువ చక్కెర పానీయాలు, ఎన్నో ఇతర జంక్ ఫుడ్స్ తో సంతృప్త కొవ్వు , ప్రాసెస్ చేసిన కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ హార్మోన్లు, రక్తంలో చక్కెర స్థాయిలను అసమతుల్యం చేస్తుంది.
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులు.. ముఖ్యంగా పాలు మొటిమలు వచ్చేలా చేస్తాయి. ఎన్నో అధ్యయనాలు పాల ఉత్పత్తులు, టీనేజర్లలో మొటిమల తీవ్రతకు మధ్య సంబంధాన్ని కనుగొన్నాయి. అయినప్పటికీ పాలు మొటిమలకు ఎలా కారణమవుతాయో ఇంకా స్పష్టంగా తెలియదు. పాల ఉత్పత్తులు ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మొటిమల తీవ్రతను పెంచుతుంది.