Insects: ఈ ఒక్క పొడి వేస్తే బియ్యం,పప్పులకు పురుగులు పట్టవు, పట్టిన పురుగులు కూడా పోతాయ్..!
Insects: బియ్యం, పప్పుల్లో పురుగులు పట్టడం అనేది ప్రతి గృహిణీకి ఎదురయ్యే పెద్ద సమస్య. ఆ పట్టిన పురుగులు వదిలించలేక తిప్పలు పడుతూ ఉంటారు. కానీ, ఒక సింపుల్ చిట్కాతో వాటిని పోయేలా చేయచ్చు.

insects
సీజన్ తో సంబంధం లేకుండా చాలా మందికి ఇంట్లో బియ్యం, పప్పులు నిల్వ ఉంచినప్పుడు వాటికి పురుగులు పడుతూ ఉంటాయి. ఒక్కసారి పురుగు పట్టిందంటే.. ఆ బియ్యం, పప్పులు పాడైపోతాయి. అంతేకాదు, వాటిని శుభ్రం చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ, మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలతో ఈ పురుగులను శాశ్వతంగా పోగొట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ ఒక్క పొడి చాలు..
బియ్యం, పప్పుల్లో పురుగులు పోగొట్టడానికి లవంగాలు, దాల్చిన చెక్క, కర్పూరం ఉంటే చాలు. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు మూడు కర్పూరం బిళ్లలు పొడి చేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక పల్చటి వస్త్రంలో వేసి మూట గట్టాలి. ఇప్పుడు ఈ మూటను మీరు బియ్యం, పప్పుల డబ్బాలో వేస్తే సరిపోతుంది. ఈ వాసనకు పరుగులు ఉన్నా పోతాయి. అంతేకాకుండా.. భవిష్యత్తులో పురుగులు కూడా పట్టవు. ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు.
ఇవి వేసినా కూడా బియ్యం, పప్పుల్లో పురుగులు పట్టవు...
ఎండు మిర్చి
బియ్యం డబ్బాలో అక్కడక్కడా కొన్ని ఎండు మిర్చిలను వేసి ఉంచండి. మిర్చిలోని ఘాటు వల్ల పురుగులు బియ్యం వైపు రావు. పప్పు ధాన్యాలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది.
బిర్యానీ ఆకు
బిర్యానీ ఆకులకు ఉండే ప్రత్యేకమైన వాసన పురుగులకు అస్సలు పడదు. బియ్యం లేదా పప్పుల డబ్బాలో పైభాగంలో 3-4 బిర్యానీ ఆకులు వేస్తే సరిపోతుంది. ఇది పురుగులను నివారించడమే కాకుండా ధాన్యానికి మంచి వాసనను కూడా ఇస్తుంది.
వేపాకులు
ఇది మన తాతమ్మల కాలం నాటి చిట్కా. బాగా ఎండిన వేపాకులను ఒక పల్చటి గుడ్డలో కట్టి బియ్యం బస్తాలో లేదా డబ్బాలో వేయండి. వేపలో ఉండే చేదు గుణం వల్ల ఎలాంటి పురుగులైనా, పుచ్చులైనా దరిచేరవు.
ఆవనూనె
ముఖ్యంగా కందిపప్పు, పెసరపప్పు లాంటి వాటికి పురుగు పట్టకుండా ఉండాలంటే.. ఒక కేజీ పప్పుకు ఒక టీస్పూన్ ఆవనూనెను వేసి బాగా కలిపి ఎండలో కాసేపు ఉంచి, ఆపై డబ్బాలో నిల్వ చేయండి. నూనె జిగురు వల్ల పురుగులు గుడ్లు పెట్టలేవు.
ఉప్పు (Salt)
బియ్యం నిల్వ చేసేటప్పుడు కొద్దిగా కల్లు ఉప్పును (Rock Salt) కలిపి ఉంచితే పురుగులు పట్టవు. ఉప్పు తేమను గ్రహించి బియ్యాన్ని పొడిగా ఉంచుతుంది, తద్వారా పురుగులు పెరగవు.

