Besan Barfi: శనగపిండితో బర్ఫీ.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది!
Besan Barfi: తీపి తినాలనిపించినప్పుడు ఎప్పుడూ చేసుకునే స్వీట్స్ లకు బదులుగా ఈసారి శనగపిండితో బర్ఫీని ట్రై చెయ్యండి. ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది.

మంచి సువాసనతో బయట మార్కెట్లో దొరికే స్వీట్ షాప్ స్టైల్ లో ఈ బర్ఫీ ఉంటుంది. తక్కువ పదార్థాలతో ఎంతో సులభంగా ఈ బర్ఫీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ బర్ఫీని మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇంటికి వచ్చిన బంధువులకు సర్వ్ చేయడానికి కూడా ఈ బర్ఫీ బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం సెనగపిండి బర్ఫీ (Besanbarfi) తయారీ విధానం గురించి తెలుసుకుందాం..
కావలసిన పదార్థాలు: ఒక కప్పు సెనగపిండి (Besan), రెండు కప్పుల పంచదార (Sugar), ఒక కప్పు నెయ్యి (Ghee), రెండు చిటికెడు కుంకుమపువ్వు (Saffron), 50 గ్రాముల పచ్చికోవా (Kova), చిటికెడు యాలకుల పొడి (Cardamom powder), బట్టర్ పేపర్ (Butter paper), కొన్ని డ్రై ఫ్రూట్స్ (Dry Fruits) పలుకులు.
తయారీ విధానం: ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో రెండు కప్పుల పంచదార, పావు కప్పు నీళ్లు పోసి ఎక్కువ మంట (High flame) మీద తీగపాకం (Caramel) వచ్చే వరకు పాకం పట్టుకోవాలి. పాకం మరీ పలుచగా, మరీ ముదిరిపోతే బర్ఫీ రుచి బాగుండదు. కనుక తీగపాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి.
పాకం చిక్కబడుతున్నప్పుడు ఇందులో నానబెట్టుకున్న కుంకుమపువ్వు నీళ్లు (Soaked saffron water) పోసి ఉడికించుకోవాలి. పాకం తీగపాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరోసారి కడాయి పెట్టి అందులో ఒక కప్పు నెయ్యి (Ghee) వేసి వేడి చేసుకోవాలి.
నెయ్యి కరిగి వేడెక్కిన తరువాత ఒక కప్పు సెనగపిండి వేసి తక్కువ మంట (Low flame) మీద మంచి కలర్ వచ్చే వరకూ కలుపుతూ వేపుకోవాలి. సెనగపిండి నెయ్యిని బాగా పీల్చుకునే వరకు కలుపుతూండాలి. తరువాత 50 గ్రాముల పచ్చి కోవాను (Kova) వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు చిటికెడు యాలకుల పొడి, పంచదార పాకం వేసి మరో రెండు నిముషాలు తక్కువ మంట మీద కలుపుకుంటూ వేపుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి బర్ఫీ మిశ్రమాన్ని మరో రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి (Mix well). ఇప్పుడు ఒక ప్లేట్ పై బట్టర్ పేపర్ (Butter paper) ను ఉంచి డ్రైఫ్రూట్స్ చల్లుకొని దానిపై బర్ఫీ మిశ్రమాన్ని వేసి సుమారు నాలుగు గంటల పాటు చల్లార్చుకోవాలి.
తరువాత మీకు ఇష్టమైన ఆకారంలో (Shaped) బర్ఫీని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన స్వీట్ షాప్ స్టైల్ సెనగపిండి బర్ఫీ రెడీ (Ready). ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీ కుటుంబ సభ్యులకు ఈ స్వీట్ తప్పక నచ్చుతుంది.